
ట్రైన్ ప్రయాణం సురక్షితంగా.. హ్యాపీగా సాగాలంటే.. రైలు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు అప్రమత్తత అవసరం.. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలంటూ తరచూ అవగాహన కల్పిస్తుంటారు.. కానీ.. కొంతమంది అవేమి పట్టించుకోకుండా ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ఇలాంటి సందర్భాల్లో కొందరు ప్రాణాలు కోల్పోగా..మరికొంతమంది ప్రయాణికలు రెప్పపాటులో ప్రాణాపాయం నుంచి బయటపడ్డ సందర్భాలు చాలానే ఉన్నాయి.. తాజాగా.. సమయస్ఫూర్తి, నిరంతర అప్రమత్తత ఒక మనిషి ప్రాణాన్ని ఎలా కాపాడగలవో నిరూపించే సంఘటన హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. కదులుతున్న రైలు ఎక్కబోయి ప్రమాదవశాత్తూ కిందపడబోయిన ఒక ప్రయాణికుడిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) కానిస్టేబుల్ చాకచక్యంగా కాపాడారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
కాచిగూడ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌పైకి వచ్చిన మహబూబ్‌నగర్ – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ (12862) రైలు అప్పటికే నెమ్మదిగా కదలడం ప్రారంభించింది. ఈ క్రమంలో ఒక ప్రయాణికుడు వేగంగా వచ్చి కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించాడు. రైలు వేగం పుంజుకోవడంతో ఆ ప్రయాణికుడు పట్టుతప్పి, కాలు జారి ప్లాట్‌ఫారమ్.. రైలు పట్టాల మధ్య ఉన్న ప్రమాదకరమైన ఖాళీ స్థలంలోకి జారిపడబోయాడు. ఈ క్రమంలోనే.. అక్కడే విధులు నిర్వహిస్తున్న ఆర్పీఎఫ్ (RPF) కానిస్టేబుల్ ఈ ప్రమాదాన్ని తక్షణమే గమనించారు. మరుక్షణంలోనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా అత్యంత వేగంగా స్పందించి, కిందపడబోతున్న ప్రయాణికుడిని ప్లాట్‌ఫారమ్‌పైకి లాగి సురక్షితంగా కాపాడారు.
వీడియో చూడండి..
#OperationJeevanRaksha, On 12.10.26, At Kacheguda railway station, RPF Women Constable Ms.Reena Kumari acted swiftly to rescue a passenger and his child who slipped while attempting to board the moving Train No.12862 MBNR – VSKP Express.
@rpfpckcg , @rpf_scr1 @RPF_INDIA https://t.co/VrmHuKspW2— RPF HYDERABAD DIV (@rpfscrhyb) October 13, 2026
కానిస్టేబుల్ చూపిన అత్యంత ధైర్యసాహసాలు, సమయస్ఫూర్తి వల్ల ఒక పెద్ద ప్రమాదం నుంచి.. ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ దృశ్యాలు లేదా సమాచారం తెలిసిన తోటి ప్రయాణికులు, అధికారులు సదరు ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ రీనా కుమారిని ప్రశంసించారు.
ఈ సంఘటన నేపథ్యంలో రైల్వే అధికారులు ప్రయాణికులకు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. కదులుతున్న రైళ్లను ఎక్కడం లేదా దిగడం అత్యంత ప్రమాదకరమని, తొందరపాటు నిర్ణయాలతో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని కోరారు.