Reading Time: 2 minutes
Chandrababu Vijay Meeting Chennai Water Supply Godavari Cauvery Link

Chandrababu-Vijay Meeting: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మధ్య సమావేశం ముగిసింది. సుమారు గంటా 10 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో ప్రధానంగా చెన్నై నగర తాగునీటి సమస్య పరిష్కారం, తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా తమిళనాడుకు నీటి సరఫరా, గోదావరి–కావేరీ నదుల అనుసంధానం వంటి కీలక అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది.. ఇక, సమావేశం అనంతరం ఇద్దరు ముఖ్యమంత్రులు విజయవాడ ఉత్సవ్‌కు హాజరయ్యారు.. వారితో పాటు మంత్రి నారా లోకేష్‌ కూడా ఉత్సవ్‌లో పాల్గొన్నారు..

చెన్నై తాగునీటి అవసరాలపై చర్చ
చెన్నై నగర తాగునీటి అవసరాలను తీర్చేందుకు తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా తమిళనాడుకు నీటిని సరఫరా చేస్తున్న అంశం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా చెన్నై తాగునీటి అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్ 4.08 టీఎంసీల నీటిని అందించింది. అయితే, చెన్నైలో తాగునీటి అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో తెలుగు గంగ నుంచి నీటి విడుదలను మరింత పెంచాలని తమిళనాడు ప్రభుత్వం కోరుతున్నట్లు సమాచారం. తమిళనాడు విజ్ఞప్తిపై ఏపీ ప్రభుత్వం సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. మానవీయ కోణంలో చెన్నై ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు సహకరించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ, నీటి విడుదల నిర్ణయం వాతావరణ పరిస్థితులు, జలాశయాల్లో నీటి లభ్యత, రాష్ట్ర అవసరాలు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య నీటి సరఫరాపై సమన్వయం, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరిగినట్లు సమాచారం.

గోదావరి–కావేరీ నదుల అనుసంధానంపై దృష్టి
సీఎం చంద్రబాబు, సీఎం విజయ్ సమావేశంలో మరో కీలక అంశంగా గోదావరి–కావేరీ నదుల అనుసంధానం ప్రస్తావనకు వచ్చింది. దక్షిణాది రాష్ట్రాల్లో నీటి లభ్యతను మెరుగుపరచడంతో పాటు వ్యవసాయ అవసరాలకు నీటిని సమర్థంగా వినియోగించుకునే లక్ష్యంతో నదుల అనుసంధానంపై చంద్రబాబు గతంలో పొరుగు రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం.
గోదావరి నుంచి కావేరీ వరకు నీటిని తరలించే ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో లక్షలాది మంది రైతులకు ప్రయోజనం కలగవచ్చన్నది ఈ ప్రతిపాదన వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. నదుల్లో సముద్రంలో కలిసిపోయే మిగులు జలాలను సాధ్యమైనంత సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా తాగునీరు, సాగునీటి అవసరాలను తీర్చవచ్చని ఈ ప్రాజెక్టుకు మద్దతు ఇస్తున్నవారు భావిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్టును అమలు చేయాలంటే పొరుగు రాష్ట్రాల మధ్య సమన్వయం, నీటి లభ్యతపై సమగ్ర అధ్యయనం, కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని చంద్రబాబు ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌తో జరిగిన భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.

గోదావరి–బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ ప్రతిపాదన
గోదావరి–కావేరీ నదుల అనుసంధానంలో భాగంగా గోదావరి–బనకచర్ల ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ఈ ప్రతిపాదన ప్రకారం గోదావరి జలాలను మొదట కృష్ణా నదీ పరివాహక ప్రాంతానికి, అక్కడి నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్‌కు తరలించాలని భావిస్తున్నారు. అనంతరం బొల్లాపల్లి నుంచి బనకచర్లకు, అక్కడి నుంచి పెన్నా నదీ పరివాహక ప్రాంతానికి నీటిని తీసుకెళ్లే విధంగా ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. ఈ మార్గం ద్వారా నీటిని కండలేరు మీదుగా కావేరీ నదీ వ్యవస్థకు తరలించే అవకాశాలను కూడా ఏపీ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ అనుసంధాన ప్రతిపాదన ద్వారా గోదావరి జలాలను దక్షిణాది రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, ఈ ప్రాజెక్టు అమలుకు సంబంధించి నీటి లభ్యత, సాంకేతిక సాధ్యాసాధ్యాలు, ఆర్థిక వ్యయం, పర్యావరణ అనుమతులు, ఇతర రాష్ట్రాల అభిప్రాయాలు వంటి అంశాలపై మరింత అధ్యయనం, సమన్వయం అవసరం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పాటు పొరుగు రాష్ట్రాల భాగస్వామ్యంతోనే ఈ భారీ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలన్నది ఏపీ ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది.

తమిళనాడు చొరవతో కీలక భేటీ
దక్షిణాది రాష్ట్రాల్లో నీటి సమస్యల పరిష్కారం, నదుల అనుసంధానంపై చంద్రబాబు చేస్తున్న ప్రతిపాదనల నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చర్చలకు చొరవ తీసుకున్నట్లు సమాచారం. చెన్నై తాగునీటి అవసరాలకు తక్షణ పరిష్కారాలను అన్వేషించడంతో పాటు, దీర్ఘకాలంలో నీటి లభ్యతను మెరుగుపరిచే మార్గాలపై ఇరు రాష్ట్రాలు చర్చించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మొత్తంగా, చంద్రబాబు–విజయ్ సమావేశంలో తక్షణ అవసరమైన చెన్నై తాగునీటి సరఫరాతో పాటు, దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించే గోదావరి–కావేరీ నదుల అనుసంధానంపై చర్చకు ప్రాధాన్యం లభించింది. ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చాలంటే ఇరు రాష్ట్రాల మధ్య నిరంతర చర్చలు, సాంకేతిక అధ్యయనాలు, కేంద్ర ప్రభుత్వ సహకారం కీలకం కానున్నాయి.