Reading Time: < 1 minute
Hyderabad Moti Nagar Woman Murder Ashwin Anjali Attack

Hyderabad: హైదరాబాద్ అల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోతీ నగర్ బాబుగూడలో ప్రేమోన్మాది దాడికి ఒక వివాహిత బలైన దారుణ ఘటన వెలుగుచూసింది. పెళ్లికి నిరాకరించిందనే కక్షతో అంజలి అనే మహిళను అశ్విన్ అనే ఆటో డ్రైవర్ కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం, కర్ణాటకలోని బీదర్ జిల్లాకు చెందిన అంజలి భర్త ఓ మర్డర్ కేసులో గత రెండేళ్లుగా జైలులో ఉన్నాడు. భర్త స్నేహితుడైన ఆటో డ్రైవర్ అశ్విన్ (25), అంజలిని తనను పెళ్లి చేసుకోవాలని, తనతోనే ఉండాలని పదే పదే వేధించడం ప్రారంభించాడు. ఈ వేధింపులు తాళలేక అంజలి నెల రోజుల క్రితం బీదర్ నుంచి హైదరాబాద్‌లోని బాబుగూడకు వచ్చి అక్క అశ్వినీ కుటుంబంతో కలసి నివాసముంటూ ఓ గ్లాస్ పరిశ్రమలో పనిచేస్తోంది. అంజలికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు.

గతంలో అశ్విన్ వేధింపులపై సనత్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని అంజలి బావ దిలీప్ ఆరోపించారు. కాగా, బీదర్ నుంచి కత్తితో బయలుదేరిన నిందితుడు అశ్విన్ అక్టోబర్ 10న మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో మోతీ నగర్‌లోని అంజలి ఉంటున్న ఇంట్లోకి చొరబడ్డాడు. ఆమెతో గొడవపడి నేరుగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో అంజలిని కాపాడేందుకు అడ్డువచ్చిన ఆమె అక్క అశ్వినీ (25) పై కూడా కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ కుటుంబ సభ్యులు తక్షణమే సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అంజలి మృతి చెందగా, తీవ్ర గాయాల పాలైన అశ్వినీ ఇంకా ప్రైవేట్ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతోంది. అంజలి మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అల్లాపూర్ సీఐ నవీన్ కుమార్ నేతృత్వంలోని పోలీసులు, పరారీలో ఉన్న నిందితుడు అశ్విన్ కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలు బీదర్ జిల్లాకు కూడా వెళ్లినట్లు సీఐ తెలిపారు. ప్రేమోన్మాది అశ్విన్‌ను తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.