
శతాబ్దాల చరిత్ర, కోట్లాది రూపాయల సామ్రాజ్యం, నలుగురి నోటా నానిన బ్రాండ్.. అన్నీ ఉన్నా అల్లుకుపోయిన బంధాలలో చిక్కులు వస్తే ఏమవుతుంది? సరిగ్గా ఇప్పుడు టీవీఎస్ గ్రూపులో ఇదే జరుగుతోంది. కుటుంబ పెద్ద వేణు శ్రీనివాసన్ కుటుంబంలో ఆస్తి పంపకాలు ఇంకా కొలిక్కి రాలేదంటూ ఆయన సతీమణి మల్లికా శ్రీనివాసన్, కుమార్తె లక్ష్మీ వేణు విడుదల చేసిన ప్రకటన ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలు ఈ వివాదం వెనుక ఉన్న అసలు కథ ఏమిటి? ఆస్తుల పంపిణీలో ఎక్కడ తేడా కొట్టింది?
టీవీఎస్ గ్రూప్.. భారతదేశ ఆటోమొబైల్ రంగంలో ఎంతో పేరొందిన కంపెనీ. టీవీ సుందరం అయ్యంగార్ అలియాస్ టీవీఎస్ అయ్యంగార్ ఈ కంపెనీని 1911వ సంవత్సరంలో స్థాపించారు. ద్విచక్ర వాహనాలు, ఆటో విడిభాగాలు, ఆర్థిక సేవల రంగంలో టీవీఎస్ అగ్రగామిగా నిలిచింది. అయితే, కాలం మారుతున్న కొద్దీ కుటుంబ వ్యాపారాలలో గొడవలు తలెత్తాయి. దీంతో 2020లోనే అయ్యంగార్ కుటుంబ వారసులు ఆస్తులు పంచుకున్నారు. ఆయా కుటుంబాలు తమ వ్యాపారాలను చూసుకుంటున్నాయి. అయితే అప్పుడు అయ్యంగార్ వారసుల మధ్య ఆస్తి పంపకాలు పూర్తయ్యాయి కానీ.. వేణు శ్రీనివాసన్ కుటుంబంలో మాత్రం పంపకాలు జరగలేదు.
టీవీఎస్ గ్రూప్ నిర్వహిస్తున్న వేణు శ్రీనివాసన్ కుటుంబంలో తండ్రీకొడుకులు ఒక వర్గంగా, తల్లీకూతుళ్లు మరో వర్గంగా విడిపోయారు. వేణు శ్రీనివాసన్ కుమారుడైన సుదర్శన్ వేణును, గతేడాది ఏప్రిల్లో టీవీఎస్ హోల్డింగ్స్ లిమిటెడ్ కు మేనేజింగ్ డైరెక్టర్గా, సిగ్నిఫికెంట్ బెనిఫిషియల్ ఓనర్గా ప్రకటించారు. దీంతో కుటుంబంలో విభేదాలు బట్టబయలయ్యాయి. కుమారుడికి అత్యధిక ప్రయారిటీ ఇస్తూ.. తమను పక్కన పెట్టడం తల్లీకూతుళ్లకు నచ్చలేదు. కుమారుడికి పదవులు దక్కడంపై తమకు అభ్యంతరం లేదంటూనే.. తమ వాటా సంగతేంటని తల్లీకూతుళ్లు మల్లికా శ్రీనివాసన్, లక్ష్మీ వేణు ప్రశ్నిస్తున్నారు. కుటుంబ సభ్యులందరికీ సమానంగా ఆస్తులు పంచాలని డిమాండ్ చేస్తున్నారు.
అయ్యంగార్ ఆస్తుల పంపకం సమయంలో.. వేణు శ్రీనివాసన్ కుటుంబానికి దక్కిన ఆస్తులను సక్రమంగా నిర్వహించుకునేందుకు కుటుంబసభ్యులు బాధ్యతలను పంచుకున్నారు. అయితే.. 2020లో జరిగిన ఆ విభజనే ఫైనల్ అనేలా మాట్లాడడం తగదనేదని తల్లీకూతుళ్ల వాదన. ఆనాడు జరిగింది కేవలం బాధ్యతల పంపకం మాత్రమేనని తల్లీకూతుళ్లు వాదిస్తున్నారు. అది ఆస్తుల పంపకం కాదంటున్నారు. సంస్థను పారదర్శకంగా వ్యాల్యూయేషన్ చేసి, సమనంగా ఆస్తుల పంపకాలు జరగాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత పంపకాలకు అందరి ఆమోదం లేదని వాళ్లు స్పష్టం చేస్తున్నారు.
వేణు శ్రీనివాసన్ కుటుంబ గొడవల్లో టాఫే సంస్థ కూడా ప్రధాన పాత్ర పోషిస్తోంది. దేశంలో ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలు చేసే కంపెనీల్లో టఫే ఒకటి. దీనికి వేణు శ్రీనివాసన్ భార్య మల్లికా శ్రీనివాసన్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. టఫే సంస్థను ఆమె నిర్వహిస్తున్నారు కాబట్టి.. అదే ఆమెకు, ఆమె కుమార్తెకు చెందుంతుందని వాదిస్తున్నారు. దీన్ని తల్లీకూతుళ్లు తప్పుబడుతున్నారు. టఫేలో కేవలం తాను వాటాదారును మాత్రమేనని, మిగిలిన టీవీఎస్ సంస్థల్లో ఆస్తుల పంపకాల సంగతేంటని మల్లికా శ్రీనివాసన్ తో పాటు, ఆమె కుమార్తె లక్ష్మీ వేణు వాదిస్తున్నారు.
కోట్ల రూపాయల టర్నోవర్ కలిగిన టీవీఎస్ ఫ్యామిలీలో తండ్రీ కొడుకులు కీలక బాధ్యతలు పోషిస్తుండగా, తల్లీకూతుళ్లకు ఆ స్థాయి వాటా దక్కలేదనేది ఇప్పుడు సమస్య. టీవీఎస్ హోల్డింగ్స్, టీవీఎస్ మోటార్ కంపెనీ, టీవీఎస్ క్రెడిట్, సుందరం-క్లేటన్ లిమిటెడ్ వంటి ప్రముఖ కంపెనీలన్నీ ప్రస్తుతం వేణు శ్రీనివాసన్ కుటుంబ నియంత్రణలోనే ఉన్నాయి. అయితే వీటిలో కీలక బాధ్యతలు, ఆర్థిక ప్రయోజనాలన్నీ తండ్రీకొడుకులకే దక్కాయి. తండ్రీకొడుకులకు తగ్గట్లు తమకు ఆర్థిక, సమాన వాటా దక్కలేదని తల్లీకూతుళ్లు వాదిస్తున్నారు. ప్రైవేట్ కుటుంబ విషయాలను బయటకు పొకకుండా అంతర్గతంగానే పరిష్కరించుకోవాలని ఇంతకాలం భావించారు. అయితే ఇప్పుడు ఈ విషయాలు బహిర్గతమయ్యాయి.
వ్యాపార సామ్రాజ్యాన్ని విజయవంతంగా నడుపుతున్న కుటుంబాలలో ఈగోలు, ఆస్తుల పంపకాల తగాదాలు రావడం కొత్తేమీ కాదు. అంబానీ కుటుంబం నుండి మొదలుకుని ఎన్నో పెద్ద కార్పొరేట్ దిగ్గజాలు ఇదే బాటలో ఆస్తుల విభజన వివాదాలను ఎదుర్కొన్నాయి. టీవీఎస్ గ్రూప్ విషయంలో కూడా తండ్రీకుమారుడు, తల్లీకూతుళ్ల మధ్య ఆస్తుల పంపిణీ కొలిక్కి వస్తేనే వ్యాపార భవిష్యత్తు సాఫీగా సాగుతుంది. లేదంటే, ఈ వారసత్వ పోరు సంస్థల ఆర్థిక కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది.
“కాలం కరిగిపోతుంది, కీర్తి నిలిచిపోతుంది.. కానీ ఆస్తుల పంపకాల వద్దే బంధాలు బీటలు వారుతాయి” అని పెద్దలు ఊరికే అనలేదు. ఒక శతాబ్దానికి పైగా విశ్వాసాన్ని సంపాదించుకున్న టీవీఎస్ బ్రాండ్ భవిష్యత్తు ఇప్పుడు ఈ కుటుంబ రాజకీయంపైనే ఆధారపడి ఉంది. పదవులు ఎవరికైనా దక్కవచ్చు, కానీ పారదర్శకత లేని ఆర్థిక ఒప్పందాలు ఏ బంధాన్నైనా బలహీనపరుస్తాయి. మరి వేణు శ్రీనివాసన్ కుటుంబం ఈ విబేధాలను ఎలా పరిష్కరించుకుంటుందనేది కాలమే సమాధానం చెప్పాలి!
:- CLN RAJU (Editor-NTV Digital)