Reading Time: < 1 minute
India Counters China Says Ladakh Is An Integral Part Of The Country

Ladakh: లడఖ్ భారత్ అంతర్భాగమని, చైనా ఎన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా ఈ వాస్తవాన్ని మార్చలేరని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం లడఖ్‌లోని 28 వ్యూహాత్మక ప్రాంతాలకు, భౌగోళిక ప్రదేశాలకు అధికారికంగా పేర్లు నిర్ధారించి భారత మ్యాప్‌లో చేర్చడంపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో భారత్ ఈ ప్రకటన చేసింది.

అక్టోబర్ 02న భారత ప్రభుత్వం లడఖ్‌లోని పలు ప్రాంతాలను అధికారికంగా గుర్తించింది. వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి ఉన్న గోగ్రా, హాట్ స్ప్రింగ్స్ వంటి సున్నితమైన సరిహద్దు ప్రాంతాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. 2020లో భారత్, చైనాల మధ్య నెలకొన్న గాల్వాన్ ఘర్షణ సమయంలో గోగ్రా, హాట్ స్ప్రింగ్స్ కీలక ఘర్షణ ప్రాంతాలుగా నిలిచాయి. భారత్ గుర్తించిన ఇతర ప్రాంతాల్లో అలీషా గిరి, బ్రాంగ్సా, చాప్చింగల్ పాస్, కనిష్క పీక్, కరుణ్ పీర్ పర్వతం, కుక్సెల్, మార్తండ్ గిరి, పార్పిక్ హిమానీనదం, స్కామ్రి హిమానీనదం, షాచ్మిరిక్ పాస్, ష్కోర్గా లోయ, జొరావర్ పీక్ తదితర ప్రాంతాలు ఉన్నాయి.

అయితే, భారత్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ తప్పపట్టారు. భారత్ ఏకపక్ష్ంగా ఈ నిర్ణయాన్ని తీసుకుందని, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంగా తాము గుర్తించబోమని అన్నారు. భారత్ పేర్లు పెట్టడం చట్టవిరుద్ధమని, చైనా-భారత్ సరిహద్దు పశ్చిమ ప్రాంతంలోని సంబంధిత భూభాగాలు చైనాకే చెందుతాయని ఆమె వాదించారు. తాజా ప్రకటనలో భారత్ చైనా వ్యాఖ్యలకు చెక్ పెట్టింది.