ప్రస్తుతం టీమిండియా (Team India)లో చోటు సంపాదించడం గతంతో పోలిస్తే కొంత సులభంగా మారింది. ఇప్పుడు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి. ఐపీఎల్‌తో పాటు వివిధ రాష్ట్రాల్లో నిర్వహించే టీ20 లీగ్‌లలో ప్రతిభ చూపిస్తే జాతీయ జట్టులోకి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే గతంలో పరిస్థితులు భిన్నంగా ఉండేవి. ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్లోనే తమ సత్తా నిరూపించుకుని సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాల్సి వచ్చేది. ముఖ్యంగా భారత టెస్టు జట్టులోకి ప్రవేశించడం చాలా కష్టంగా ఉండేది. దీంతో దేశవాళీ క్రికెట్లో రెడ్ బాల్ ఫార్మాట్లో అద్భుతంగా రాణించినా.. టీమిండియా తరపున ఆడే అవకాశం దక్కని ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారు. అలాంటి నలుగురు రంజీ స్టార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. అమోల్ మజుందార్: ఈ జాబితాలో తొలి పేరు ముంబై మాజీ బ్యాటర్, ప్రస్తుత భారత మహిళల జట్టు హెడ్ కోచ్ అమోల్ మజుందార్ (Amol Muzumdar). దేశవాళీ క్రికెట్లో అతడిని పరుగుల యంత్రంగా పిలిచేవారు. ఏదో ఒకరోజు టెస్టు క్రికెట్లో తన సత్తా చాటుతాడని చాలామంది భావించారు. కానీ ఆ అవకాశం మాత్రం రాలేదు. రెడ్ బాల్ క్రికెట్లో ఫస్ట్ క్లాస్ స్థాయికే పరిమితమైన మజుందార్ 2014లో రిటైర్మెంట్ ప్రకటించాడు. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ వంటి దిగ్గజ బ్యాటర్లు భారత జట్టులో ఉన్న కారణంగా అతడికి జాతీయ జట్టులో చోటు దక్కలేదు. మజుందార్ 171 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 11,167 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 60 అర్ధసెంచరీలు ఉన్నాయి.
2. మిథున్ మిన్హాస్: ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మిన్హాస్ (Mithun Manhas) కూడా దురదృష్టవంతులైన దేశవాళీ క్రికెటర్లలో ఒకరు. రెడ్ బాల్ క్రికెట్లో అద్భుతంగా రాణించినా.. భారత జట్టు తరపున ఆడే అవకాశం మాత్రం ఆయనకు రాలేదు. ఆయన గురించి చాలాసార్లు ‘రాంగ్ టైంలో పుట్టాడు’ అని చెబుతుంటారు. ఎందుకంటే ఆ కాలంలో భారత టెస్టు జట్టులో అత్యుత్తమ ఆటగాళ్లు పలువురు ఉన్నారు. అమోల్ మజుందార్ మాదిరిగానే మిన్హాస్‌కు కూడా అదే కారణంగా అవకాశం దక్కలేదు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మిథున్ మిన్హాస్ రికార్డు ఎంతో గొప్పగా ఉంది. 157 మ్యాచ్‌ల్లో 45.82 సగటుతో 9,714 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 49 అర్ధసెంచరీలు ఉన్నాయి.
3. ప్రియాంక్ పాంచల్: గుజరాత్ ఓపెనర్ ప్రియాంక్ పాంచల్ (Priyank Panchal) కూడా టీమిండియా తరపున ఆడకుండానే తన కెరీర్‌కు ముగింపు పలికాడు. 2008లో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అడుగుపెట్టిన అతడు రంజీ ట్రోఫీతో పాటు ఇతర రెడ్ బాల్ టోర్నీల్లోనూ అద్భుతంగా రాణించాడు. అయితే చాలా కాలం సెలెక్టర్ల నుంచి అతడిని పట్టించుకోలేదు. 2021-22లో దక్షిణాఫ్రికా పర్యటనకు రోహిత్ శర్మ స్థానంలో ప్రత్యామ్నాయ ఆటగాడిగా అతడిని ఎంపిక చేశారు. కానీ తుది జట్టులో అవకాశం మాత్రం రాలేదు. ఆ తర్వాత కూడా భారత జట్టు స్క్వాడ్‌లో అతడిని కొనసాగించలేదు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ప్రియాంక్ పాంచల్ 127 మ్యాచ్‌లు ఆడి 45.18 సగటుతో 8,856 పరుగులు చేశాడు. అతడి ఖాతాలో 29 సెంచరీలు, 34 అర్ధసెంచరీలు ఉన్నాయి.
4. రణదేబ్ బోస్: బెంగాల్ తరపున దేశవాళీ క్రికెట్లో తన బౌలింగ్‌తో మెరిసిన ఫాస్ట్ బౌలర్ రణదేబ్ బోస్ (Ranadeb Bose) కూడా భారత జట్టు తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. 2007లో ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టులో ఎంపికైనప్పటికీ.. తుది జట్టులో చోటు దక్కలేదు. ఆ సమయంలో దేశవాళీ రెడ్ బాల్ క్రికెట్లో అత్యుత్తమ బౌలర్లలో రణదేబ్ బోస్ ఒకడిగా గుర్తింపు పొందాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతడు 91 మ్యాచ్‌లు ఆడి 376 వికెట్లు పడగొట్టాడు. అయితే ఆ సమయంలో జహీర్ ఖాన్, ఎస్. శ్రీశాంత్, ఆర్.పీ. సింగ్ వంటి పేసర్లు భారత జట్టులో ఉండటంతో రణదేబ్ బోస్ కెరీర్ దేశవాళీ క్రికెట్‌కే పరిమితమైంది.




