
Sandeep Patil: సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్, జహీర్ ఖాన్ వంటి సూపర్ ప్లేయర్స్ టీమిండియాకు అందించిన సేవలు మరువలేనివి.. వారు నెలకొల్పిన కొన్ని రికార్డులు.. చెక్కచెదరకుండా ఉండిపోయాయి కూడా.. అయితే, వీరిలో కొందరు జట్టుకు దూరం కావడం, మరికొందరి కెరీర్ ముగింపు విషయంలో సెలెక్టర్లు తీసుకున్న నిర్ణయాలపై అభిమానుల్లో చాలాకాలంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు మాజీ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2012 నుంచి 2016 వరకు తన పదవీకాలంలో సీనియర్ ఆటగాళ్ల ఎంపిక విషయంలో తీసుకున్న నిర్ణయాల వెనుక ఉన్న కారణాలను ఓ ఇంటర్వ్యూలో వివరించారు.
వ్యక్తిగత సంబంధాల కంటే భారత క్రికెట్ ప్రయోజనాలే ముఖ్యం
దూరదర్శన్‌లో ప్రసారమైన ‘ది గ్రేట్ ఇండియన్ క్రికెట్ షో’లో మాట్లాడిన సందీప్ పాటిల్.. సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్, జహీర్ ఖాన్ వంటి ప్రముఖ ఆటగాళ్ల విషయంలో సెలక్షన్ కమిటీ తీసుకున్న నిర్ణయాల గురించి ప్రస్తావించారు. ఈ నిర్ణయాలు తాను ఒక్కడే తీసుకున్నవి కావని, ఐదుగురు సభ్యులతో కూడిన సెలక్షన్ కమిటీ సమష్టిగా నిర్ణయాలు తీసుకుందని స్పష్టం చేశారు. జట్టులో సీనియర్ ఆటగాళ్లను కొనసాగించాలా? కొత్త ఆటగాళ్లకు అవకాశాలు కల్పించాలా? అనే అంశాలను పరిశీలించేటప్పుడు భారత క్రికెట్ భవిష్యత్తుకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు.. దిగ్గజ ఆటగాళ్లు జట్టును వీడాల్సి రావడం లేదా రిటైర్మెంట్ దిశగా వెళ్లడం బాధాకరమైన విషయమేనని పేర్కొన్నారు సందీప్ పాటిల్..
.
ప్లేయర్స్‌తో ఫ్రెండ్‌షిప్ ఉన్నా.. ఎంపికలో పక్షపాతం ఉండకూడదు
సెలెక్టర్లకు ఆటగాళ్లతో వ్యక్తిగత స్నేహాలు, అనుబంధాలు ఉండటం సహజమని సందీప్ పాటిల్ అన్నారు. అయితే, ఎంపిక బాధ్యతలు చేపట్టినప్పుడు ఆ వ్యక్తిగత సంబంధాలను పక్కన పెట్టాలని స్పష్టం చేశారు. ఒక ఆటగాడు తన స్నేహితుడు కాబట్టి అతడినే జట్టులోకి ఎంపిక చేయడం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు. “అతను నా స్నేహితుడు, కాబట్టి అతడినే ఎంపిక చేస్తాను” అనే ఆలోచనకు సెలెక్టర్లు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. దేశం తరఫున కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు వాటిని ఎంతో సీరియస్‌గా తీసుకోవాలని, వ్యక్తిగత ఇష్టాయిష్టాల కంటే జట్టు ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టంచేశారు.
కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది
సెలెక్టర్లు తమ వ్యక్తిగత అభిప్రాయాల గురించి కాకుండా భారత క్రికెట్, జట్టు భవిష్యత్తు గురించి ఆలోచించాలి. కొన్ని సందర్భాల్లో తమకు ఇష్టం లేని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పటికీ, జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాల్సి ఉంటుందని చెప్పారు సందీప్.. సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్, జహీర్ ఖాన్ వంటి ఆటగాళ్ల విషయంలో తీసుకున్న నిర్ణయాలు కూడా ఈ బాధ్యతలో భాగంగానే చూడాలని ఆయన వ్యాఖ్యల సారాంశం. అయితే, ఈ ఆటగాళ్లందరినీ బలవంతంగా రిటైర్ చేయించారని ఆయన స్పష్టంగా చెప్పినట్లు భావించకూడదు. జట్టు ఎంపిక, ఆటగాళ్లను కొనసాగించడం వంటి అంశాల్లో సెలెక్టర్ల బాధ్యతలు, నిర్ణయాల వెనుక ఉన్న దృక్పథాన్ని ఆయన వివరించారు.
భారత క్రికెట్ భవిష్యత్తే అంతిమ లక్ష్యం
సెలక్షన్ కమిటీ బాధ్యత కేవలం ఆటగాళ్లను ఎంపిక చేయడం మాత్రమే కాదని, భారత జట్టు దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవడం కూడా అందులో భాగమని సందీప్ పాటిల్ పేర్కొన్నారు. ఆటగాళ్లతో స్నేహం ఉన్నప్పటికీ, ఎంపికలో నిష్పాక్షికంగా వ్యవహరించడం ముఖ్యమని తెలిపారు. మొత్తంగా, తన పదవీకాలంలో సీనియర్ ఆటగాళ్ల విషయంలో తీసుకున్న నిర్ణయాల గురించి సందీప్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు మరోసారి భారత క్రికెట్‌లో సెలక్షన్ ప్రక్రియ, వ్యక్తిగత అనుబంధాలు, జట్టు భవిష్యత్తు మధ్య ఉండాల్సిన సమతుల్యతపై చర్చకు తెరతీశాయి.