
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ మరో భారీ నిరసనకు సిద్ధమైంది. 2026, అక్టోబర్ 16న ఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్‌లో లెహ్రా దో త్రిరంగా యాత్రకు పిలుపునిచ్చింది. తమతో పాటు జాతీయ జెండాను తీసుకురావాలని నిరసనకారులకు సీజేపీ సూచించింది. ఢిల్లీకి రాలేని వారు ఆరోజు సాయంత్రం తమ తమ ఏరియాల్లో జాతీయ జెండాలతో ర్యాలీ తీయాలని కోరింది. సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాల అరెస్ట్, వారి జ్యుడీషియల్ కస్టడీకి వ్యతిరేకంగా జాతీయ జెండా ఎగరేయడం తప్పు కాదనే నినాదంతో ఈ నిరసన చేపట్టనున్నట్లు కాక్రోచ్ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే బుధవారం (అక్టోబర్ 14) ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.
‘‘సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా కేవలం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినందుకే జైలు పాలయ్యారు. వీరి అరెస్ట్, రిమాండ్‌కు నిరసనగా త్రివర్ణ పతాకాన్ని ప్రేమించే దేశభక్తులందరూ అక్టోబర్ 16వ తేదీ సాయంత్రం 5 గంటలకు కన్నాట్ ప్లేస్‌లోని సెంట్రల్ పార్క్‌కు జాతీయ జెండాతో రావాలని నేను కోరుతున్నాను. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం నేరం కాదని మనం నిరూపిద్దాం. ఢిల్లీకి రాలేని వారు ఆరోజు సాయంత్రం మీ నగరాల్లో త్రివర్ణ పతాకంతో ఊరేగింపులు నిర్వహించి ఆ పతాకమే మన గర్వమని చాటి చెప్పండి. ఈ నిరసన తర్వాత నన్ను కూడా జైలుకు పంపవచ్చు. కానీ నాకు ఎలాంటి ఆందోళన లేదు. త్రివర్ణ పతాకం నా గర్వం. నేను దానిని ఎగురవేస్తాను’’ అని అభిజిత్ పేర్కొన్నారు.
సీజేపీ ప్రతినిధులు అరెస్ట్.. 5 రోజుల రిమాండ్
ఢిల్లీ జంతర్ మంతర్ నిరసనల క్రమంలో అరెస్టయిన కాక్రోచ్ జనతా పార్టీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు ఐదు రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. డీ-నోటిఫై చేయబడిన జంతర్ మంతర్ నిరసన ప్రదేశంలోకి ఆ పార్టీకి చెందిన కార్యకర్తలతో కలిసి చొరబడ్డారని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను బుధవారం ఓ ప్రత్యేక కార్యనిర్వాహక మేజిస్ట్రేట్ (SEM) ఐదు రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించి తిహార్ జైలుకు తరలించారు.
►ALSO READ | పాకిస్తానీ పైలట్లపై ఎయిర్ ఫ్రాన్స్ నిషేధం.. ఇజ్రాయెల్ దెబ్బకు రూల్స్ ఛేంజ్..!
ముందస్తు అరెస్టు చర్యల్లో భాగంగా బుధవారం ఉదయం మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్‌లోని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (SEM) ముందు ప్రవేశపెట్టగా ఈ 5 రోజుల కస్టడీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఢిల్లీ పోలీసులు జంతర్ మంతర్‌ను అధికారిక నిరసన వేదికల లిస్టు నుంచి తొలగించిన మరుసటి రోజే రూల్స్ ఉల్లంఘించి జాతీయ జెండాలతో అక్కడి గేట్లు, బారికేడ్లను దాటుకుని లోపలికి ప్రవేశించారని ఆరోపణలతో మంగళవారం వారిని అరెస్ట్ చేశారు.
సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా, అజింక్య షిండేల తరుఫు న్యాయవాది అభిష్ హెలా మాట్లాడుతూ.. సీజేపీ ప్రతినిధులకు అకారణంగా 5 రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధించారు. ప్రజలను జంతర్ మంతర్ కు రావాలని ఫోన్ చేసి పిలిచారని పోలీసులు కోర్టులో అబద్దం చెప్పారు. నిజానికి అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ లు ఎలాంటి ఫోన్ కాల్ చేయలేదని అయినప్పటికీ తప్పుడు ఫిర్యాదుతో వారిని 5 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపారని అన్నారు. ఇదిలా ఉండగా, సీజేపీ నేత అజింక్య షిండే వ్యక్తిగత పూచీకత్తుపై విడుదలయ్యారు.