Reading Time: 2 minutes

ఎల్‌నినో దెబ్బ: రబీకి నీటి కష్టాలు.. తెలంగాణలో రూ.20వేల కోట్లు పంట నష్టం!

Caption of Image.

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అందించిన నివేదిక ప్రకారం.. ప్రస్తుత వానాకాలం సీజన్‌లో తెలంగాణ రాష్ట్రం అక్షరాలా రూ.20వేల కోట్ల భారీ పంట నష్టాన్ని ఎదుర్కొనే ప్రమాదంలో ఉంది. ముఖ్యంగా ఎల్ నినో ప్రభావం, సరైన సమయంలో వర్షాలు కురవకపోవడం, దీర్ఘకాలిక వర్షాభావ పరిస్థితులు అన్నదాతల కష్టాన్ని కళ్లముందే ఆవిరి చేస్తున్నాయి. రాష్ట్రంలో ప్రధాన పంటలైన వరి, పత్తి సాగు తీవ్రంగా దెబ్బతిన్నట్లు విశ్వవిద్యాలయం తన స్పష్టం చేసింది. సాధారణ స్థాయితో పోలిస్తే ఈ సీజన్‌లో సాగు విస్తీర్ణం ఏకంగా 25 శాతం నుంచి 30 శాతం వరకు పడిపోవడం వ్యవసాయ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది.

వర్షాభావం.. ఎండిపోయిన పంటలు
సాధారణంగా తెలంగాణ వ్యాప్తంగా వానాకాలం సీజన్‌లో సుమారు కోటి 45 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతుంటాయి. కానీ ఈ ఏడాది వర్షాలు సకాలంలో కురవకపోవడంతో పరిస్థితి తలకిందులైంది. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు రాష్ట్రంలో సాధారణంగా కురవాల్సిన 740.6 మి.మీ వర్షపాతానికి బదులుగా కేవలం 615.5 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. అంటే 17 శాతం లోటు వర్షపాతం నమోదైంది.

►ALSO READ | జనగామలో గుప్త నిధుల తవ్వకాల కలకలం… గుడిలో శివలింగాన్ని పక్కకు జరిపి…!

ఈ తీవ్ర వర్షాభావ ప్రభావం పంటల ఎదుగుదలకు అత్యంత కీలకమైన దశల్లో పడింది. నేలలో తేమ శాతం అడుగంటడంతో మొక్కలు ఎండిపోయాయి. ఒక్క వరి సాగు విషయానికొస్తే.. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం67 లక్షల ఎకరాల నుంచి 56 లక్షల ఎకరాలకు పడిపోయింది. అంటే ఒక్క వరి పంటలోనే సుమారు 11 లక్షల ఎకరాల విస్తీర్ణం తగ్గిపోయింది. మరోవైపు పత్తి పంట కూడా తీవ్రంగా దెబ్బతింది. విత్తనాలు వేశాక తగినంత తడి అందక, వర్షాల ఎక్కువ గ్యాప్ రావటంతో పత్తి మొక్కలు ఎదుగుదల ఆగిపోయి ఎండిపోయాయి.

రబీ సీజన్‌కు ముప్పు..
సాధారణంగా ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడిన ప్రతీసారీ కచ్చితంగా కరువు వస్తుందని చెప్పలేమని.. గతంలో 2023లో కూడా ఎల్‌నినో ఉన్నప్పటికీ సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిశాయని నిపుణులు గుర్తు చేస్తున్నారు. కానీ ఈసారి తెలంగాణలో నమోదైన వర్షపాత లోటు, నెలల వారీగా వర్షాల అసమతుల్యత పంటలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లో నీటి మట్టాలు క్రమంగా పడిపోతుండటం రాబోయే కాలంలో సాగునీటి కొరతను మరింత తీవ్రతరం చేసే ప్రమాదం ఉందని తెలుస్తోంది.

ఈ పరిస్థితుల ప్రభావం యాసంగి సీజన్ మీద కూడా పడే అవకాశం ఉంది. సాధారణంగా రబీలో కోటి ఎకరాలకు పైగా సాగయ్యే భూమి.. ప్రస్తుత నీటి లభ్యత ఆధారంగా గణనీయంగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనేందుకు, రైతులను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు విశ్వవిద్యాలయం ప్రభుత్వానికి ప్రభుత్వం కీలక సిఫార్సులు చేసింది. నీటి లభ్యత అనిశ్చితంగా ఉన్న ప్రాంతాలలో రైతులు నీటిని ఎక్కువగా అవసరం అయ్యే వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని సూచించింది.

పెసర, మినుము, శనగ, కంది వంటి పప్పుధాన్యాలు.. పొద్దుతిరుగుడు, నువ్వులు, కుసుమ, వేరుశెనగ వంటి నూనె గింజలు.. జొన్నలు, సజ్జలు వంటి చిరుధాన్యాలను సాగు చేయడం ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించవచ్చని రైతులకు వెల్లడించింది. అలాగే భూగర్భ జలాలను కాపాడుకోవడానికి, నీటి ఎద్దడిని తట్టుకునే తక్కువ కాల వ్యవధి గల పంటలను ఎంచుకోవడం ద్వారా రైతులు ఆర్థిక నష్టాల నుంచి రక్షణ పొందవచ్చని విశ్వవిద్యాలయం పేర్కొంది.

©️ VIL Media Pvt Ltd.