Reading Time: 2 minutes

ఉప్పల్ మ్యాచ్‌కు భారీ భద్రత.. 2,200 మంది పోలీసులు, 408 సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా! 

Caption of Image.

భారత్ వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల  టీ20 సిరీస్‌లో అత్యంత కీలకమైన నాలుగో పోరుకు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (ఉప్పల్) రెడీ అయింది. రేపు (బుధవారం, అక్టోబర్ 14, 2026) రాత్రి 7 గంటలకు జరగనున్న ఈ మ్యాచ్‌కు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు రాచకొండ/మల్కాజ్‌గిరి కమిషనరేట్ పరిధిలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇక ఫ్యాన్స్ కి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మైదానం లోపల, పరిసర ప్రాంతాలలో సుమారు 2,200 మంది పోలీస్ సిబ్బందితో మూడంచెల నిఘా ఏర్పాటు చేశారు.

408 సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా:

* ఉప్పల్ స్టేడియం ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించేందుకు పోలీసులు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. 

* ప్రత్యేక వాచ్ టీమ్‌లు: భద్రతా వ్యవహారాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు 4 ప్రత్యేక వాచ్ టీమ్‌లను బరిలోకి దించారు. 

* సీసీటివీ (CCTV) కంట్రోల్ రూమ్: గ్రౌండ్ లోపల, బయట కలిపి మొత్తం 408 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి డిజిటల్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించారు.

* డ్రోన్ కెమెరాలు: భద్రతా దృష్ట్యా గగనతలాన్ని పర్యవేక్షించేందుకు 2 హై-రిజల్యూషన్ డ్రోన్ కెమెరాలను నిరంతరం వినియోగిస్తున్నట్లు మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌ సీపీ సుమతి స్పష్టం చేశారు.

8,000 వాహనాలకు పార్కింగ్ సౌకర్యం: 

* మ్యాచ్ వీక్షించేందుకు వచ్చే వేలాది మంది అభిమానుల కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు. 

* పార్కింగ్ వసతి: స్టేడియం సమీపంలో ఒకేసారి 8,000 వాహనాలకు కేటాయించిన నిర్ణీత స్థలాల్లో నిలిపేలా పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఉప్పల్ రహదారుల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా వాహనదారులు పోలీసుల సూచనలు పాటించాలని సీపీ సుమతి కోరారు.  

* స్టేడియంలోకి అనుమతి: మ్యాచ్ ప్రారంభ సమయానికి సరిగ్గా 2 గంటల ముందే ప్రేక్షకులను స్టేడియం లోపలికి అనుమతిస్తారు. చివరి నిమిషంలో తోపులాట జరగకుండా ప్రేక్షకులు సకాలంలో వచ్చి భద్రతా తనిఖీలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నకిలీ టికెట్ల విక్రయాలు, మోసపూరిత వెబ్‌సైట్లు, ఆన్‌లైన్‌ నేరాలను అడ్డుకోవడంపై ప్రత్యేక నజర్ పెట్టినట్లు చెప్పుకొచ్చారు. మఫ్టీలోనూ పోలీసులతో నిఘా ఉంచినట్లు వెల్లడించారు. 

* భారత్ వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు సుమారు 40 వేల మందికి పైగా ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉందని సీపీ సుమతి తెలిపారు. ఇప్పటికే 25 వేల టికెట్లు అమ్ముడయ్యాయని పేర్కొన్నారు. పోలీసు అధికారులు, హెచ్‌సీఏ ప్రతినిధులతో కలిసి స్టేడియంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను సిద్ధం చేసినట్లు చెప్పారు. 

* ప్రత్యేక బస్సులు: టీ20 మ్యాచ్‌ జరగబోతుండటంతో ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్‌ స్టేడియానికి డైరెక్టుగా 60 ప్రత్యేక బస్సులను నడుతున్నట్లు తెలిపింది. సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయని గ్రేటర్‌ ఈడీ ఎ. శ్రీధర్‌ ఒక ప్రకటనలో వెల్లడించారు. బస్సుల వివరాల కోసం ప్రయాణికులు 99592 26160 నంబర్‌కు ఫోన్‌ చేయవచ్చని పేర్కొన్నారు. 

ప్రజా రవాణాను ఉపయోగించుకోవాలి: మ్యాచ్‌కు వచ్చే క్రికెట్ అభిమానులు ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లలో ప్రయాణించాలని హైదరాబాద్ పోలీసులు సూచించారు. మ్యాచ్‌కు ముందు, తర్వాత అదనపు బస్సులు నడపడంతో పాటు మెట్రో సేవలను పొడిగించాలని సంబంధిత విభాగాలకు లేఖలు రాసినట్లు తెలిపారు.  

©️ VIL Media Pvt Ltd.