
ప్రముఖ అమెరికన్ టీవీ సిరీస్ ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు, దివ్యాంగుల హక్కుల కోసం పోరాడిన ఆర్జే మిట్టే కన్నుమూశారు. 34 ఏళ్ల వయసులో సోమవారం మరణించినట్లు అధికారులు, ఆయన ప్రతినిధులు వెల్లడించారు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం బ్రౌన్స్‌విల్లేలో ఉన్న ఆయన నివాసంలో చనిపోయినట్లు సమాచారం.
కామెరాన్ కౌంటీ జస్టిస్ ఆఫ్ ది పీస్ సిండీ హినోజోసా తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం సుమారు 1.30 గంటలకు ఆర్జే మిట్టే మరణించినట్లు ఆమె ప్రకటించారు. అయితే ఆయన మృతికి గల కారణం ఇంకా వెల్లడికాలేదు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన ‘బ్రేకింగ్ బ్యాడ్’ టీవీ సిరీస్‌లో ఆర్జే మిట్టే కీలక పాత్ర పోషించారు. ఈ సిరీస్‌లో బ్రయాన్ క్రాన్‌స్టన్ పోషించిన వాల్టర్ వైట్ కుమారుడు వాల్టర్ వైట్ జూనియర్‌గా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఐదు సీజన్ల పాటు ప్రసారమైన ఈ సిరీస్‌లో దాదాపు అన్ని ఎపిసోడ్‌లలో కనిపించారు. 2008 నుంచి 2013 వరకు ప్రసారమైన ఈ సిరీస్ ఆర్జే మిట్టేకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత ‘స్విచ్డ్ అట్ బర్త్’, ‘గార్డియన్స్ ఆఫ్ జస్టిస్’ వంటి టీవీ కార్యక్రమాల్లోనూ నటించారు. స్వతంత్ర చిత్రాల నిర్మాణంలోనూ భాగస్వామిగా వ్యవహరించారు.
దివ్యాంగుల హక్కుల కోసం పోరాటం
ఆర్జే మిట్టే నటుడిగానే కాకుండా దివ్యాంగుల హక్కుల కోసం పనిచేసిన కార్యకర్తగానూ గుర్తింపు పొందారు. ఆయనకు మూడేళ్ల వయసులోనే సెరిబ్రల్ పాల్సీ ఉన్నట్లు నిర్ధారణ అయింది. తన జీవిత అనుభవాలను నటనలో ప్రతిబింబిస్తూ.. దివ్యాంగులపై సమాజంలో ఉన్న అపోహలను తొలగించేందుకు కృషి చేశారు. దివ్యాంగులకు వినోద రంగంలో మరింత ప్రాతినిధ్యం కల్పించడం, సమాన అవకాశాలు అందించడం వంటి అంశాలపై ఆయన తన వేదిక ద్వారా అవగాహన కల్పించారు. యునైటెడ్ సెరిబ్రల్ పాల్సీ, ష్రైనర్స్ చిల్డ్రన్స్ సంస్థలకు అంబాసిడర్‌గా పనిచేశారు. దివ్యాంగుల సంక్షేమం, సామాజిక కార్యక్రమాల కోసం తన పేరుతో ఉన్న మిట్టే ఫౌండేషన్‌కు అధ్యక్షుడిగానూ వ్యవహరించారు. ఆర్జే మిట్టే మరణవార్తతో టెలివిజన్ రంగంలో విషాదం నెలకొంది. నటుడిగా, దివ్యాంగుల హక్కుల కోసం గళమెత్తిన వ్యక్తిగా ఆయన చేసిన కృషిని అభిమానులు, సహచరులు గుర్తుచేసుకుంటున్నారు.