
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం మరోసారి మారుతోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర అండమాన్ సముద్రంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రేపు ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇది క్రమంగా బలపడి రానున్న మూడు, నాలుగు రోజుల్లో ఉత్తర తమిళనాడు – దక్షిణ కోస్తాంధ్ర దిశగా పయనించే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ ప్రయాణంలో అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే సూచనలున్నాయని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని హెచ్చరించారు.
ఈ వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ , వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా సముద్రంలోకి వేటకు వెళ్లే మత్స్యకారులు మరింత జాగ్రత్తగా ఉండాలని, ప్రభుత్వ సూచనలను పాటించాలని కోరారు. కోత దశలో ఉన్న పంటల విషయంలో రైతులు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని సూచించారు. వర్షాల తీవ్రత , గాలి దిశకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అధికారిక హెచ్చరికలను గమనించాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు.