Reading Time: < 1 minute
ఇంట్లో దొరికే వీటితో తులసి మొక్కను పచ్చగా, గుబురుగా మార్చేయండి.. మీకు తెలియని సింపుల్ టిప్స్

భారతీయ సంస్కృతిలో తులసి మొక్కకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ఆధ్యాత్మికంగా పూజించడమే కాకుండా శ్వాసకోశ సమస్యలను నివారించడానికి, రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి దీని ఆకులను ఔషధంగా వాడుతుంటారు. అయితే ఎంత శ్రద్ధగా నీరు పోసినా చాలామంది ఇళ్లలో తులసి మొక్క సరిగ్గా ఎదగదు, ఆకులు రాలిపోవడం లేదా కొమ్మలు ఎండిపోవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. మార్కెట్లో దొరికే రసాయనాలు వాడకుండా ఇంట్లోనే లభించే కేవలం రెండు సహజ పదార్థాలతో తులసి మొక్కను గుబురుగా, పచ్చగా ఎలా మార్చవచ్చో గార్డెనింగ్ నిపుణులు వివరిస్తున్నారు. గార్డెనింగ్ ఎక్స్‌పర్ట్ సంజన తల్లపల్లి అందించిన సమాచారం ప్రకారం.. వంటింట్లో ఉండే కొద్దిపాటి బెల్లం, పూజకు వాడే రెండు మూడు కర్పూరం బిళ్లలతో అద్భుతమైన ఆర్గానిక్ ఎరువును సులభంగా తయారు చేసుకోవచ్చు.

ఎలా తయారు చేయాలి?

ఒక గ్లాసు నీటిని తీసుకుని అందులో చిన్న బెల్లం ముక్క వేసి పూర్తిగా కరిగిపోయే వరకు బాగా కలపాలి. అనంతరం రెండు లేదా మూడు కర్పూరం బిళ్లను మెత్తని పొడిగా చేసి, ఆ బెల్లం నీటిలో వేసి కలపాలి. ఇలా తయారుచేసుకున్న మిశ్రమాన్ని తులసి మొక్క మొదట్లో కొద్దికొద్దిగా పోయాలి.

ఈ సహజ ఎరువు ఎలా పనిచేస్తుంది?

వేగవంతమైన ఎదుగుదల: బెల్లంలో ఉండే సహజ పోషకాలు మట్టిలోని మేలుచేసే సూక్ష్మజీవులను వేగంగా వృద్ధి చేస్తాయి. ఇవి మొక్క వేర్లకు అవసరమైన పోషకాలను వేగంగా అందించి, మొక్క బలంగా పెరిగేలా చేస్తాయి.

చీడపీడల నివారణ: కర్పూరంలో సహజసిద్ధమైన యాంటీ ఫంగల్, క్రిమి సంహారక లక్షణాలు ఉంటాయి. ఇది తులసి వేర్లకు ఫంగస్ చేరకుండా కాపాడటమే కాకుండా, మొక్క మొదట్లో చీమలు, తెల్ల దోమలు, పురుగులు చేరకుండా సహజ రక్షణ కవచంలా పనిచేస్తుంది.

మొక్క గుబురుగా మారడానికి అదనపు చిట్కాలు

ఎరువు అందించడంతో పాటు తులసి మొక్కపై పూత రాగానే ఎప్పటికప్పుడు గిల్లేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల శక్తి అంతా విత్తనాల తయారీకి పోకుండా కొత్త కొమ్మలు పుట్టుకొచ్చి మొక్క గుబురుగా, పచ్చగా మారుతుంది. వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఈ బెల్లం-కర్పూరం ద్రావణాన్ని అందిస్తూ, మొక్కకు తగినంత ఎండ తగిలేలా చూసుకుంటే తులసి మొక్క ఏడాది పొడవునా కళకళలాడుతూ ఉంటుంది.