
హాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రేక్షకాదరణ పొందిన ‘బ్రేకింగ్ బ్యాడ్’ వెబ్ సిరీస్‌లో వాల్టర్ వైట్ జూనియర్ పాత్రతో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు ఆర్‌జే మిట్టే (RJ Mitte) 34 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన మరణవార్తతో అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. నటుడిగా మాత్రమే కాకుండా, దివ్యాంగుల హక్కుల కోసం గళమెత్తిన వ్యక్తిగా కూడా ఆయన ఎంతోమంది హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.
అయితే, ఆర్‌జే మిట్టే మరణానికి సంబంధించిన పరిస్థితులపై వెలువడుతున్న భిన్నమైన నివేదికలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అసలు ఏం జరిగింది? మరణానికి ముందు ఆయన ఎలాంటి పనుల్లో నిమగ్నమయ్యారు? దర్యాప్తులో ఇప్పటివరకు వెల్లడైన వివరాలేమిటి? అనే వివరాలు ఇలా ఉన్నాయి..
ఆర్‌జే మిట్టే మరణంపై కొనసాగుతున్న దర్యాప్తు..
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం బ్రౌన్స్‌విల్లేలో అక్టోబర్ 12న ఆర్‌జే మిట్టే మరణించినట్లు ఆయన పీఆర్ టీమ్ ధ్రువీకరించింది. మధ్యాహ్నం 12.50 గంటలకు సమాచారం అందుకున్న పోలీసులు ఆయన నివాసానికి చేరుకోగా, అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారని పీపుల్ పత్రిక తెలిపింది. తొలుత మరణానికి కారణం వెల్లడికాకపోయినా, టీఎంజెడ్, పీపుల్ కథనాల్లో ఆత్మహత్యగా పేర్కొన్నారు. అయితే, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.
ఆర్‌జే మిట్టే మరణం వెనక మిస్టరీపై కథనాలు
ఆర్‌జే మిట్టే మరణంపై వెలువడిన కథనాల్లో అత్యంత కీలకమైన అంశం పోలీసుల దర్యాప్తు. ది గార్డియన్ కథనం ప్రకారం, ఈ ఘటనలో ఇతరుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానించడం లేదని సమాచారం. అలాగే, మరణానికి గల కారణాన్ని నిర్ధారించేందుకు పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు కామెరాన్ కౌంటీ న్యాయాధికారి సిండి హినోజోసా వెల్లడించినట్లు ఆ పత్రిక పేర్కొంది.
అయితే, ఇతరుల ప్రమేయం ఉన్నట్లు అనుమానం లేకపోవడం ఒక్కటే మరణానికి సంబంధించిన అన్ని ప్రశ్నలకు సమాధానం కాదు. పోస్టుమార్టం, దర్యాప్తు ఫలితాల ద్వారానే మరణానికి సంబంధించిన పూర్తి వివరాలు స్పష్టమయ్యే అవకాశం ఉంది.
మరణానికి ముందు భవిష్యత్తుపై ఎన్నో ఆశలు..
ఆర్‌జే మిట్టే మరణవార్త మరింత దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన ఇటీవల కూడా తన వృత్తిపరమైన భవిష్యత్తుపై దృష్టి సారించి ఉండటమే ఆశ్యర్యం కలిగిస్తుంది. టీఎంజెడ్ కథనం ప్రకారం, ‘ది జో వల్పిస్ పాడ్‌కాస్ట్’లో ఆయన ఇటీవల పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అక్టోబర్ 5న విడుదలైంది. పాడ్‌కాస్ట్ నిర్వాహకుడు జో వల్పిస్ మాట్లాడుతూ, మిట్టే తనతో జరిగిన సంభాషణలో భవిష్యత్తు సినిమాలు, టెలివిజన్ ప్రాజెక్టులు, సామాజిక సేవా కార్యక్రమాల గురించి చర్చించినట్లు వివరించారు. ఆయన మరణవార్త తనను తీవ్రంగా ఆశ్చర్యానికి గురిచేసిందని కూడా పేర్కొన్నారు.
🚨🇺🇸 Breaking Bad star RJ Mitte, who spent a decade digging out of a business manager’s tax fraud, has died by suicide at 34 TMZ reports he died today in Texas, and his reps called his passing a profound loss. RJ lived with cerebral palsy just like the character he played, and he turned that role into a lifelong fight to get disabled actors seen and hired in Hollywood He also fought through a business manager who secretly pocketed his tax money for five years, spending a decade paying back the IRS without ever giving up on his career… engaged, smiling with his castmates just weeks ago, he was still building a life. What a tragic loss🙏 Source: The Iced Coffee Hour, TMZ / Writer: Daniel
— Mario Nawfal (@MarioNawfal) October 12, 2026
పోలీసుల దర్యాప్తులో తేలాల్సిన అంశాలివే..
ఆర్‌జే మిట్టే మరణంపై ఇంకా కొన్ని కీలక ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. మరణానికి అసలు కారణమేమిటి? ఘటన ఏ పరిస్థితుల్లో జరిగింది? అనే అంశాలపై పోస్టుమార్టం నివేదిక, పోలీసుల దర్యాప్తు కీలకం కానున్నాయి. అధికారిక నివేదికలు వెలువడిన తర్వాతే మరణానికి సంబంధించిన పూర్తి వివరాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ప్రపంచవ్యాప్తంగా అభిమానుల కన్నీటి నివాళులు..
‘బ్రేకింగ్ బ్యాడ్’లో వాల్టర్ వైట్ జూనియర్ పాత్రతో గుర్తింపు తెచ్చుకున్న ఆర్‌జే మిట్టే.. నటుడిగానే కాకుండా దివ్యాంగుల హక్కుల కోసం కూడా కృషి చేశారు. ఆయన మరణవార్తతో సహనటులు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు.
సమాధానాల కోసం ఎదురుచూపులు..
ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు తమ అభిమాన నటుడిని కోల్పోయిన బాధలో ఉండగా, మరోవైపు ఆయన మరణానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం సినీ ప్రపంచం ఎదురుచూస్తోంది. ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న నివేదికలు మరణంపై కొన్ని అంశాలను వెల్లడిస్తున్నప్పటికీ, దానికి దారితీసిన పరిస్థితులపై నిర్ధారణకు రావడానికి అధికారిక దర్యాప్తు ఫలితాలు అవసరం. 34 ఏళ్ల వయసులో ముగిసిన ఆర్‌జే మిట్టే జీవితం.. ఎన్నో ప్రశ్నలను మిగిల్చింది. ఆ ప్రశ్నలకు సమాధానాలు ఊహాగానాల్లో కాదు.. అధికారిక దర్యాప్తు నివేదికల్లోనే లభించనున్నాయి.
‘బ్రేకింగ్ బ్యాడ్’తో ప్రపంచవ్యాప్త గుర్తింపు..
ఆర్‌జే మిట్టేకు అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చిన సిరీస్ ‘బ్రేకింగ్ బ్యాడ్’. 2008లో ప్రారంభమైన ఈ సిరీస్‌లో ఆయన వాల్టర్ వైట్ జూనియర్, అంటే ఫ్లిన్ వైట్ పాత్రలో నటించారు. ఐదు సీజన్లలోనూ కనిపించి తన సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ఈ సిరీస్‌లో బ్రయాన్ క్రాన్స్టన్ వాల్టర్ వైట్‌గా, అన్నా గన్ స్కైలర్ వైట్‌గా నటించగా, వారి కుమారుడిగా మిట్టే పోషించిన పాత్ర కథలో భావోద్వేగాలకు ప్రతీకగా నిలిచింది. తండ్రి నేర ప్రపంచంలోకి అడుగుపెడుతున్న కొద్దీ కుటుంబంలో చోటుచేసుకునే సంఘర్షణలు, బంధాలు, నైతిక విలువలను ప్రతిబింబించే పాత్రగా వాల్టర్ జూనియర్ ప్రేక్షకులకు గుర్తుండిపోయారు.