
న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమి బృందానికి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ అపాయింట్మెంట్ నిరాకరించారు. సర్ ప్రక్రియలో అవకతవకలు, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తొలగింపు వంటి అంశాలపై వినతిపత్రం సమర్పించేందుకు లోక్ సభ, రాజ్య సభ ప్రతిపక్ష నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే చేసిన వ్యక్తిగత సమావేశ అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. ఇండియా కూటమి నేతలకు ఈ-మెయిల్ ద్వారా సీజేఐ ఈ విషయాన్ని తెలియజేశారు.
ఈ సమయంలో భేటీ అనవసరం: సీజేఐ
విపక్షాలు లేవనెత్తాలనుకుంటున్న ఓటర్ల జాబితా సవరణలో అవకతవకలు, సీఈసీ ఏకపక్ష తీరు ఆరోపణలకు సంబంధించిన అంశాలు ఇప్పటికే సుప్రీంకోర్టులో న్యాయపరమైన విచారణలో ఉన్నందున ఇలాంటి సమయంలో ఈ సమావేశం అనవసరమని సీజేఐ అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం కార్యనిర్వాహక వర్గ పరిపాలనాపరమైన వ్యవహారాలలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.
ప్రతిపక్ష నేతలు తమ డిమాండ్లు లేదా ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం సీజేఐకి వినతిపత్రం ఇవ్వడానికి బదులుగా అధికారికంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయవచ్చని సూచించారు. సుప్రీంకోర్టు తలుపులు ప్రతి పౌరుడి హక్కుల రక్షణ కోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయని పేర్కొన్నారు. వ్యక్తిగత సమావేశానికి సీజేఐ నిరాకరించినప్పటికీ సుప్రీం కోర్ట్ మార్చ్ కొనసాగుతుందని ఇండియా కూటమి స్పష్టం చేసింది.
సుప్రీం కోర్ట్ వైపు ఇండీ కూటమి మార్చ్
దేశంలో ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం సోమవారం (అక్టోబర్ 12) సుప్రీంకోర్టు వైపు భారీ శాంతియుత నిరసన ప్రదర్శన నిర్వహించనున్నట్టు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రకటించారు. ఇందులో భారీ సంఖ్యలో పాల్గొనాలని ఆయన ఆదివారం ‘ఎక్స్’ వేదికగా విద్యార్థులు, పౌర సమాజ సంస్థలు, ప్రతిపక్ష పార్టీలకు పిలుపునిచ్చారు.
‘‘ అక్టోబర్ 12న యావత్ భారతదేశం శాంతియుతంగా, ఏకతాటిపై నిలిచి సుప్రీంకోర్టు వైపు అడుగులు వేయనుంది. మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి విద్యార్థులు, పౌర సమాజ సంస్థలు, ప్రతిపక్ష పార్టీలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మాతో చేతులు కలపాలి” అని రాహుల్ గాంధీ కోరారు. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు, ఓటర్ల జాబితా సవరణపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ భారీ నిరసన ప్రదర్శన చేపడుతున్నట్టు ప్రకటించారు.
ఈ మార్చ్ మధ్యాహ్నం 1:30 గంటలకు దేశ రాజధానిలోని కన్నాట్ ప్లేస్ వద్ద ప్రారంభమై, బారకంబా రోడ్ మీదుగా సుప్రీంకోర్టు వరకు కొనసాగుతుందని తెలిపారు. ‘చలో ఢిల్లీ’..‘మార్చ్ ఫర్ డెమోక్రసీ’ పేరిట చేపట్టే ఈ ఉద్యమంలో రాజకీయాలకతీతంగా ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్న పౌరులంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు.
దేశ గళాన్ని ఎవరూ నొక్కలేరు..
కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీలో ఇటీవల యువత శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే వారిపై దాడి జరిగిందని ఆరోపించారు. ‘‘ఇది మనం కోరుకుంటున్న భారత్ కాదు. ఈ మార్చ్ ఏ ఒక్క పార్టీకో, కులానికో, వర్గానికో పరిమితం కాదు. ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్న ప్రతి భారతీయుడి కోసం” అని వ్యాఖ్యానించారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, దేశం కోసం కలిసి ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.
ఈ ప్రదర్శన అనంతరం భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)కి వినతిపత్రం అందజేయనున్నట్టు రాహుల్‌గాంధీ వెల్లడించారు. ఓట్ల దొంగతనం వెంటనే ఆగాలని, ‘సర్’ ప్రక్రియను రద్దు చేయాలని, ఈవీఎంల వాడకాన్ని నిలిపివేయడంతోపాటు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనేవే తమ డిమాండ్లని వెల్లడించారు.