
Rain Alert for AP for 4 Days: ఆంధ్రప్రదేశ్‌లో రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ అల్పపీడనం ఏర్పడిన తర్వాత స్వల్పంగా బలపడే అవకాశముందని పేర్కొంది. ఈ నెల 15వ తేదీ నుంచి ఏపీపై అల్పపీడన ప్రభావం స్పష్టంగా కనిపించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.
ముఖ్యంగా ఈ నెల 17వ తేదీ నాటికి అల్పపీడనం ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరయ్యే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అల్పపీడనం కదలికలు, దాని తీవ్రతను బట్టి వర్షాల ప్రభావంలో మార్పులు ఉండవచ్చు. వాతావరణ శాఖ నుంచి వెలువడే తాజా హెచ్చరికలను ప్రజలు గమనించాలని అధికారులు సూచిస్తున్నారు. రైతులు, మత్స్యకారులు, ప్రయాణాలు చేసేవారు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.