Reading Time: < 1 minute
Harish Shankar Supports Vijay Deverakonda Ranabali Pre Release Event

Harish Shankar: సినిమా ఇండస్ట్రీలో ట్రోలింగ్స్, సోషల్ మీడియా నెగెటివిటీ అనేది ఈ మధ్య కాలంలో హద్దులు దాటిపోతోంది. దీనిపై డైరెక్టర్ హరీష్ శంకర్ తనదైన శైలిలో స్పందించారు. ‘రణబాలి’ ప్రీ-రిలీజ్ వేదికపై ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో సంచలనంగా మారాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హీరో విజయ్ దేవరకొండను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. “మన భాషనో, బాడీ లాంగ్వేజ్‌నో చూసి ఎవరైనా హేళన చేయొచ్చేమో గానీ.. పడే కష్టాన్ని, చూపించే డెడికేషన్‌ను ట్రోల్ చేసేవాడు ఇంకా పుట్టలేదు, మున్ముందు పుట్టడు కూడా” అంటూ గట్టి భరోసానిచ్చారు. ఆన్‌లైన్ నెగెటివిటీని పట్టించుకుంటూ కూర్చుంటే ఎవరూ ముందుకు వెళ్లలేరని గుర్తుచేసిన హరీష్, తన కెరీర్ స్టార్టింగ్‌లో ఎదురైన చేదు అనుభవాన్ని ప్రస్తావించారు. “నేను కూడా అలాంటి విమర్శలకే కుంగిపోయి ఉంటే.. మొదటి సినిమా ‘షాక్’ తర్వాతే మూటముల్లే సర్దుకుని BHELకి వెళ్ళిపోయేవాడిని. ఈ స్థాయికి వచ్చేవాడినే కాదు” అని స్పష్టం చేశారు. ఇటీవల తనపై వచ్చిన ట్రోల్స్‌ను గుర్తుచేస్తూ, “నా అంత దారుణంగా ఎవరైనా ట్రోలింగ్ ఎదుర్కొన్నారా? నేనే మీ కళ్లముందు ధైర్యంగా నిలబడినప్పుడు నువ్వెందుకు బెదరాలి?” అంటూ విజయ్‌కి ధైర్యాన్ని నూరిపోశారు.

డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన నేనింతే సినిమాలో రాసిన డైలాగ్‌ను ఉటంకిస్తూ.. హిట్ వచ్చిందని ఆగిపోలేం, ఫ్లాప్ వచ్చిందని ప్రయత్నం మానుకోలేమని తేల్చిచెప్పారు. “మనం నమ్ముకున్న సినిమా ఎప్పటికీ అన్యాయం చేయదు. సినిమానే నిలబడుతుంది.. సినిమానే మనల్ని నిలబెడుతుంది” అంటూ ‘గద్దలకొండ గణేష్’ డైలాగ్‌తో ఆడియన్స్‌లో జోష్ నింపారు. దర్శకుడు రాహుల్ సంకృత్యన్ గురించి మాట్లాడుతూ.. కెరీర్ స్టార్టింగ్‌లోనే ఇంతటి భారీ కాన్వాస్ ఉన్న కథను ఎంచుకోవడం, విజయ్‌ను పూర్తి భిన్నమైన రోల్‌లో ప్రెజెంట్ చేయడం చిన్న విషయం కాదని ప్రశంసించారు. ప్రతి ఫ్రేమ్‌ను రాజీ పడకుండా తీర్చిదిద్దిన రాహుల్ పట్టుదల కచ్చితంగా పెద్ద విజయాన్ని తెచ్చిపెడుతుందని ఆకాంక్షించారు. మైత్రీ మూవీ మేకర్స్ గురించి మాట్లాడుతూ.. హిట్లతో సంబంధం లేకుండా కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ నుంచి కొత్త దర్శకుల వరకు అందరినీ సమానంగా ఆదరించే గొప్ప బ్యానర్ ఇదని కొనియాడారు. మొత్తానికి విమర్శకులకు తనదైన మాటలతో సమాధానం చెబుతూనే చిత్ర యూనిట్‌కు బలాన్నిచ్చిన హరీష్ శంకర్ స్పీచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.