Reading Time: 2 minutes
కాలినడకన ప్రపంచాన్ని చుట్టొచ్చిన సాహసికుడు! 28 ఏళ్లు.. 29 దేశాలు.. 50 వేల కి.మీ!

బ్రిటన్‌కు చెందిన కార్ల్ బుష్బీ 1998 నవంబర్‌ 1న తన ప్రపంచ యాత్రను ప్రారంభించాడు. దక్షిణ అమెరికాలోని చిలీ దేశం నుంచి ప్రయాణం మొదలుపెట్టాడు. ప్రపంచాన్ని చుట్టి, చివరకు ఉత్తర ఇంగ్లండ్‌లోని హల్‌ (Hull) సమీపంలో ఉన్న తన తల్లి ఇంటికి చేరుకోవాలన్నది అతడి లక్ష్యం. అప్పటికి అతడి వయసు 29 ఏళ్లు. ఈ యాత్ర ప్రారంభించినప్పుడు బుష్బీ తనకు తానే రెండు కఠినమైన నియమాలు పెట్టుకున్నాడు. మొదటిది.. తన ప్రయాణంలో ఎలాంటి రవాణా సాధనాలను ఉపయోగించకూడదు. రెండోది.. యాత్ర పూర్తయ్యే వరకు బ్రిటన్‌కు తిరిగి వెళ్లకూడదు. ఈ రెండు నియమాలను పాటిస్తూ దాదాపు 28 ఏళ్లపాటు తన ప్రయాణాన్ని కొనసాగించాడు. చివరకు ఫ్రాన్స్‌ నుంచి ఇంగ్లండ్‌కు ఇంగ్లిష్‌ ఛానల్‌ను ఈదుకుంటూ దాటి బ్రిటన్‌ గడ్డపై అడుగుపెట్టాడు.

మూడు రోజులు ఈత.. దాదాపు 20 గంటలు నీటిలోనే!

57 ఏళ్ల కార్ల్ బుష్బీ సోమవారం మధ్యాహ్నం ఇంగ్లండ్‌ బీచ్‌కు చేరుకున్నాడు. ఫ్రాన్స్‌ నుంచి బ్రిటన్‌కు చేరుకునేందుకు మూడు రోజులపాటు ఈతకొట్టాడు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తన దేశపు నేలను తాకడం ఎంతో ఆనందంగా ఉందని బుష్బీ చెప్పాడు. ఈ ప్రయాణం అంత సులభంగా సాగలేదని, అయితే మనం ఊహించినదానికంటే ఎక్కువ సాధించగలమని తన ప్రయాణం ద్వారా తెలుసుకున్నానని తెలిపాడు.

దక్షిణ అమెరికా నుంచి ఆసియా వరకు.. ఎన్నో సవాళ్లు!

బుష్బీ ప్రయాణం ఎన్నో ఖండాలు, దేశాల మీదుగా సాగింది. దక్షిణ అమెరికాలో నడక ప్రారంభించిన అతడు, ప్రమాదకరమైన డారియన్‌ గ్యాప్‌ ప్రాంతాన్ని దాటి మధ్య అమెరికా మీదుగా ఉత్తర దిశగా ప్రయాణించాడు. ఆ తర్వాత అమెరికా, కెనడా చేరుకున్నాడు. అక్కడి నుంచి బేరింగ్‌ జలసంధిని కాలినడకన దాటాడు. అవసరమైన చోట్ల ఈత సాయం తీసుకుంటూ తన ప్రయాణాన్ని కొనసాగించాడు. అనంతరం సైబీరియా, మంగోలియా, చైనా సహా ఆసియాలోని పలు ప్రాంతాల గుండా ముందుకు సాగాడు. ఈ యాత్రలో అత్యంత కష్టమైన దశల్లో కాస్పియన్‌ సముద్రాన్ని దాటడం ఒకటి. ఈ ప్రయాణానికే ఏకంగా 31 రోజులు పట్టింది. ఒక్కో ప్రాంతంలో భౌగోళిక పరిస్థితులు, వాతావరణం, ప్రయాణ పరిమితులు అతడికి పెద్ద సవాళ్లుగా మారాయి.

వీసా సమస్యలు.. ఆర్థిక ఇబ్బందులు.. కరోనా కూడా అడ్డంకే!

బుష్బీ యాత్ర అనుకున్నంత వేగంగా సాగలేదు. వివిధ దేశాల్లో వీసా పరిమితులు, ఆర్థిక ఇబ్బందులు, అంతర్జాతీయ పరిస్థితుల్లో మార్పులు అతడి ప్రయాణాన్ని పలుమార్లు నిలిపివేశాయి. 2007-08 ఆర్థిక సంక్షోభం కారణంగా స్పాన్సర్లు దూరమవడంతో అతడికి ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయి. ఆ తర్వాత కరోనా మహమ్మారి యాత్రకు ఆటంకం కలిగించింది. భౌగోళిక, రాజకీయ పరిస్థితులు మారడంతో కొన్ని ప్రాంతాల్లో ప్రయాణాన్ని కొనసాగించడం కష్టమైంది. అయినప్పటికీ పరిస్థితులు అనుకూలించినప్పుడల్లా తిరిగి తన యాత్రను ప్రారంభించాడు. ఇంగ్లిష్‌ ఛానల్‌ దాటేందుకు మరో మార్గాన్ని ఎంచుకోవాలని భావించిన బుష్బీకి జూన్‌లో ఇంకో ఎదురుదెబ్బ తగిలింది. ఛానల్‌ టన్నెల్‌లోని సర్వీస్‌ టన్నెల్‌ ద్వారా వెళ్లేందుకు చేసిన అభ్యర్థనను అధికారులు తిరస్కరించారు. దీంతో సముద్రాన్ని ఈదుకుంటూ బ్రిటన్‌ చేరుకోవడమే మిగిలిన మార్గమైంది.

తండ్రి సహా కుటుంబ సభ్యుల ఘన స్వాగతం

బ్రిటన్‌కు చేరుకున్న బుష్బీకి కుటుంబ సభ్యులు, స్నేహితులు ఘనంగా స్వాగతం పలికారు. వారిలో అతడి తండ్రి కీత్‌ బుష్బీ కూడా ఉన్నాడు. ఆయన గతంలో బ్రిటన్‌ ప్రత్యేక దళం SASలో పనిచేశారు. ఈ అసాధారణ యాత్రపై ‘Walk of Life’ పేరుతో ఓ డాక్యుమెంటరీ రూపొందుతోంది. ప్రముఖ చిత్ర నిర్మాత వెర్నర్‌ హెర్జాగ్‌ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. బుష్బీ బ్రిటన్‌కు చేరుకున్న సమయంలో ఆయన కూడా అక్కడ ఉన్నారు.

పారాట్రూపర్‌గా పనిచేస్తున్న సమయంలోనే బుష్బీకి ఈ యాత్ర చేయాలనే ఆలోచన వచ్చింది. తన ప్రయాణ మార్గానికి సంబంధించిన ప్రాథమిక ప్రణాళికను తోటి సైనికులకు చూపించగా, అది అసాధ్యమని వారు చెప్పారట. అయితే, వారి మాటలు అతడిని వెనక్కి తగ్గించలేదు. ఆ సవాలునే స్వీకరించి తన లక్ష్యం వైపు అడుగులు వేశాడు.

ఇంకా ఒక చివరి లక్ష్యం.. తల్లి ఇంటికి చేరుకోవాలి!

దాదాపు మూడు దశాబ్దాలపాటు సాగిన ఈ సాహస యాత్ర ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం బ్రిటన్‌కు చేరుకున్న అతడు.. తన యాత్రకు అసలు గమ్యమైన హల్‌ నగరంలోని తల్లి ఇంటికి చేరుకోవాల్సి ఉంది. నవంబర్‌ మొదటి వారంలో అక్కడికి చేరుకుంటాడని అంచనా వేస్తున్నారు. ప్రపంచాన్ని చుట్టి రావాలన్న కలను నిజం చేసుకోవడానికి 28 ఏళ్ల పాటు కష్టపడి, వేల కిలోమీటర్లు నడిచి, సముద్రాన్ని సైతం ఈదుకుంటూ దాటిన కార్ల్ బుష్బీ కథ.. పట్టుదల ఉంటే అసాధ్యమనుకున్న లక్ష్యాలను కూడా చేరుకోవచ్చని మరోసారి నిరూపిస్తోంది.