
హైదరాబాద్: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని నార్లాపూర్ రిజర్వాయర్ దగ్గర ఏర్పాటు చేసిన రెండు బాహుబలి మోటార్లను బుధవారం (అక్టోబర్ 14) మంత్రి జూపల్లి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ సర్కార్ పాలమూరు ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు.
రూ.8 లక్షల కోట్లు అప్పులు చేసి కూడా ప్రాజెక్టులను పూర్తి చేయలేదని విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ పనులు పూర్తి కాకుండానే క్రెడిట్ కోసం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేశారని ఆరోపించారు. డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్, ఇతర పనులను గత బీఆర్ఎస్ సర్కార్ పెండింగ్లో పెట్టిందన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసి, చివరి ఆయకట్టు వరకు నీరందిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులకు అండగా ఉంటామని పేర్కొన్నారు.