Reading Time: 3 minutes

ఒక అంతర్మథన కావ్యావిష్కరణ..ఏకాంతం అంటే కేవలం ఒంటరితనం కాదు

Caption of Image.

అక్షయ సాహితీ సృజన కళావేదిక ఆధ్వర్యంలో శ్రీ లేదాళ్ళ రాజేశ్వర రావు గారు రచించిన “ఓ ఏకాంత తపస్సు – రెండు దుఃఖాల నడిమి సంతోషం” అనేది ఆయన కలం నుంచి జాలువారిన 5వ కవితా సంపుటి ఇది. కొన్ని కవితా పుస్తకాలు మనల్ని చదివిస్తాయి. 

కొన్ని పుస్తకాలు మనల్ని ఆలోచింపజేస్తాయి. మరికొన్ని పుస్తకాలు మాత్రం మనలో మనమే దాచుకున్న ఏదో ఒక గదిని తెరిపిస్తాయి. రాజేశ్వరరావు లేదాళ్ళ గారు రాసిన ‘ఓ ఏకాంత తపస్సు’ అలాంటి పుస్తకం. 

ఏకాంతం అంటే కేవలం ఒంటరితనం కాదు. అది ఒక ఆత్మాన్వేషణ. కవిత్వం అంటే కేవలం అక్షరాల అల్లిక కాదు. అది నిరంతర ఆత్మశోధన, సామాజిక స్పందన, అంతర్మౌనంతో కూడిన ఒక తపస్సు. జీవితంలోని సంక్లిష్టతలను, దుఃఖపు పొరలను విప్పుతూ, వాటి మధ్యలో సంతోషపు సన్నని చినుకు కోసం పరితపించే కవి అంతరంగం ఈ సంపుటిలోని ప్రతి కవితలోనూ మనకు కనిపిస్తుంది. 

“పాట ఓ ఏకాంత తపస్సు” అనే మొదటి కవిత నుంచే కవి మనల్ని తన అంతరంగంలోకి తీసుకెళ్తారు. పాట అనేది కేవలం వినోదం కాదు, శబ్దాల సమాహారం కాదు. తనలోకి తాను ప్రయాణిస్తూ, తన అంతరంగాన్ని తాను తాకే ఒక పవిత్రమైన ఏకాంత ధ్యానం. అందుకే కవి దృష్టిలో పాట రాయడం, పాడడం అంటే ఒక ఏకాంత తపస్సు. అదే తాత్వికత మరో రూపంలో “రెండు దుఃఖాల నడిమి సంతోషం” అనే కవితలో కనిపిస్తుంది. 

‘‘ఒకటి ప్రవహించే దుఃఖం/ మరొకటి నిశ్చల దుఃఖం/ రెంటి నడుమ కొంచెం సంఘమ సంబరం లాంటి అనూహిత సుఖం” ఇక్కడ కవి దుఃఖాన్ని కూడా ఒకే రూపంలో చూడరు. ఒకటి కాలంతోపాటు ప్రవహించే దుఃఖం. మరొకటి మనసు లోతుల్లో గడ్డకట్టుకుపోయిన నిశ్చల దుఃఖం. ఈ రెండింటి మధ్యలోనే ఎప్పుడో ఒక చిన్న, అనూహ్యమైన సంతోషం మనల్ని పలకరిస్తుంది. 

“సింధులోయ నాగరికుడి కళ్ళు” అనే ప్రతీక ద్వారా కవి దుఃఖానికి కాలాతీతమైన స్వభావాన్ని కూడా సూచిస్తారు. యుగాలు మారినా, నాగరికతలు మారినా, మనిషి ఏకాంతం, భయం, దుఃఖం.. వాటి సారం మాత్రం మారదు. అందుకే ఈ పుస్తకం కేవలం దుఃఖాన్ని చెప్పే పుస్తకం కాదు. దుఃఖాల మధ్య సంతోషాన్ని వెతికే పుస్తకం. 

నాకు ఇందులో అన్నింటికంటే అందంగా అనిపించింది “సంధ్య వెలుగు”. సంధ్య పూర్తిగా పగలు కాదు. పూర్తిగా రాత్రీ కాదు. అలాగే మనిషి జీవితం కూడా పూర్తిగా సంతోషం కాదు, పూర్తిగా దుఃఖం కాదు. అలాంటి సంధ్యా సమయంలో కూడా నిజాన్ని పాడాలి. నిజాన్నే పాడాలి. పాట తెగిపోతే మళ్లీ కుట్టుకోవాలి. ఆ కుట్టిన చోట్ల నుంచే మరింత గద్గదమైన స్వరం రావాలి. ఇది “నేను ఓడిపోను” అని చెప్పే కవిత కాదు. అంతకంటే గొప్పది “నేను గాయపడిన గొంతును. ఆ గొంతుతోనే నిజాన్ని పాడుతాను” అని చెప్పే కవిత. 

అలాంటి నిజాన్ని పాడాలంటే కవి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడాలి. ఆ ప్రపంచంలోని మనుషుల్ని చూడాలి. వారి బాధల్ని, అసంతృప్తుల్ని, సంఘర్షణల్ని తనలోకి తీసుకోవాలి. అందుకే “సంఘర్షణ లేనిదే వాక్యమెలా పుడుతుంది చెప్పు?” అనే కవితలో ‘‘వాళ్లందరినీ కలిపి/వాక్యాలు వాక్యాలుగా/ పద్యమొకటి పేనుతాను’’ అంటారు. ఈ మూడు కవితల్ని కలిపి చూస్తే కవి ప్రయాణం మనకు స్పష్టమవుతుంది. కవి వాక్యాన్ని రాయడం కాదు… ఒక దశలో కవే ఒక వాక్యంగా మారిపోతాడు. 

ఈ అంతర్మథనం కేవలం తాత్విక ఆలోచనలకే పరిమితం కాదు. అది కుటుంబ బంధాల్లోకి కూడా ప్రవహిస్తుంది. అందుకు నాకు అత్యంత ఆర్ద్రంగా అనిపించిన కవిత “నాన్నొస్తాడు”. నాన్నొస్తాడు/ ఎండా, వాన నాన్నకివేమీ పట్టదు/ ఎప్పుడు తడిచే వస్తాడు/ చెమటతోనో, కాకుంటే వర్షపు చినుకులతోనో,/ లేకపోతే కాస్త మంచు లాంటి చలిలో వణుకుతూనో.. ఇంతకంటే నాన్న శ్రమ గురించి ఇంకేం చెప్పగలం? తండ్రి కోసం ఎదురుచూసే కొడుకు చూపుల్ని కవి మన కళ్ల ముందుంచుతారు.

 ఇక “ఇనప్పెట్టె” కవితలో ఒక నిర్జీవ వస్తువును మానవ జ్ఞాపకాలతో కలిపిన తీరు మరింత అద్భుతం. ఈ కవి కలంతో కాకుండా కుంచెతో కవిత్వం రాస్తారనిపిస్తుంది. రంగులను కేవలం దృశ్యాలుగా చూడకుండా, వాటికి రుచిని, కాలాన్ని, జీవితాన్ని ఆపాదిస్తారు. ‘‘రంగుల వెనుక కలనై పారుతూ పోతాను, నిమ్మ పండు రంగు సాయంత్రం, మామిడిపండు లాంటి తీయని రంగుకాలం, కొత్త రంగు ఉదయాలు మొలిచే చోట నేనుంటాను’’ ఇలాంటి కవితలు వాటి శీర్షికలు రంగుల మయం. ఇక్కడ అక్షరాలు వర్ణాలుగా మారిపోతాయి. వర్ణాలు అనుభూతులుగా మారిపోతాయి.

 అనుభూతులు ఒక కొత్త లోకాన్ని సృష్టిస్తాయి

‘‘జీవితమంటే ఇంతేనేమో/ కొంత సముద్రం లాంటి నిశ్చల దుఃఖం/ కొంత భూమి లాంటి నిర్భయ సంతోషం” మళ్లీ అదే దుఃఖం – సంతోషం. అదే ఈ సంపుటి అంతరంగం. మాటల విషయంలో కూడా కవి ఎంత జాగ్రత్తగా ఉంటారో “నమోదు కాని మాటలు” కవిత చెప్తుంది. ‘‘మాటల ప్రపంచం మీద మనం నడుస్తూ ఉంటాం/ ఒక్కోసారి మాటలు లావాలా/ మరోసారి మాటలు మంచి పువ్వుల్లా/ మనల్ని చుట్టుముడతాయి”మాట పువ్వు కావచ్చు. మాట లావా కూడా కావచ్చు. ఒకటి మనల్ని తాకుతుంది. మరొకటి మనల్ని కాల్చేస్తుంది. 

ఒకచోట మనుషుల్ని ఆకాశంలోంచి రాలిపడ్డ అమృత బిందువులంటారు. మరోచోట సన్నని దారి వెంట పాకే చీమలంటారు. ఒకచోట నది లాంటివాళ్లంటారు. మరోచోట పరంపరలా కదిలే  రుతువులంటారు. ఈ సంపుటి గొప్పతనం దాని వస్తు విస్తృతి, వస్తు వైవిధ్యం. 67 కవితల ఈ ఏకాంత తపస్సు ఆయన కవితా ప్రస్థానంలో ఒక ముఖ్యమైన మజిలీ. కవి తనలోని ఏకాంతాన్ని మన ముందుంచాడు. 

తన దుఃఖాన్ని మనతో పంచుకున్నాడు. చివరికి.. రెండు దుఃఖాల మధ్య దొరికే ఆ చిన్న సంతోషాన్ని మనకు చూపించాడు. “ఓ ఏకాంత తపస్సు”లో కవి ఒంటరిగా తపస్సు చేశారు. కానీ ఆ తపస్సు నుంచి పుట్టిన కవితలు మాత్రం.. మనందరినీ మన అంతరంగాల్లోకి  తీసుకెళ్లే ఒక సామూహిక ప్రయాణంగా మారాయి. 

– వినయ్ కుమార్ కొట్టె-

©️ VIL Media Pvt Ltd.