Reading Time: < 1 minute
Anupama Parameswaran Missed Rangasthalams Ramalakshmi Role Now In Bhogi

టాలీవుడ్‌లో కొన్ని సినిమాలు, వాటిలోని పాత్రలు నటీనటులకు ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తాయి. అలాంటి చిత్రాల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగస్థలం’ ఒకటి. ఈ సినిమాలో ‘రామలక్ష్మి’ పాత్రలో సమంత నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. అయితే ఈ పాత్రకు సమంత కంటే ముందుగా మరో హీరోయిన్‌ను అనుకున్నారనే వార్త అప్పట్లో ఆసక్తికరంగా మారింది. ఆమె మరెవరో కాదు.. ‘అనుపమ పరమేశ్వరన్’.

రంగస్థలం సినిమాలో రామలక్ష్మి పాత్ర కోసం మొదట అనుపమ పరమేశ్వరన్‌ను పరిశీలించారట. ఆమెతో ఫొటోషూట్ కూడా నిర్వహించినట్లు సమాచారం. అయితే ఆ పాత్ర డీగ్లామరస్‌గా ఉండటంతో అనుపమ అంగీకరించలేదట. ఆ తర్వాత ఆ పాత్రలో సమంతను ఎంపిక చేశారు. సినిమాలో పల్లెటూరి యువతిగా సమంత నటనకు మంచి గుర్తింపు దక్కింది. పాటల్లో కూడా సామ్ తనదైన ముద్ర వేశారు. రంగస్థలం కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో.. రామలక్ష్మి పాత్ర ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది.

ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్‌కు మరోసారి అలాంటి డీగ్లామరస్‌ పాత్ర దక్కింది. దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్న ‘భోగి’ సినిమాలో అను డీగ్లామరస్‌ పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమ పాత్ర పల్లెటూరి నేపథ్యంలో సాగనుంది. దీంతో రంగస్థలంలో రామలక్ష్మి పాత్ర మిస్ చేసుకున్న అనుకు మరోసారి అలాంటి పాత్ర చేసే అవకాశం దక్కింది. గ్లామర్ పాత్రలకు భిన్నంగా సహజమైన నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు నటీనటులకు కొత్త గుర్తింపును తీసుకొస్తాయి. రంగస్థలంలో రామలక్ష్మి పాత్ర సమంత కెరీర్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇప్పుడు భోగిలో అనుపమ ఎలాంటి నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.