Reading Time: 2 minutes
Tvs Radeon 2026 Price Features Mileage Colours

TVS Radeon 2026 Launched: టీవీఎస్ తన పాపులర్ కమ్యూటర్ మోటార్‌సైకిల్ ‘రేడియాన్’ (TVS Radeon) 2026 ఎడిషన్‌ను పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని తాజాగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ సరికొత్త అప్‌డేటెడ్ వెర్షన్ ఆల్-ఎల్‌ఈడీ లైటింగ్, ఆకర్షణీయమైన కొత్త గ్రాఫిక్స్, సరికొత్త కలర్ ఆప్షన్లతో కస్టమర్లను ఆకట్టుకునేలా వస్తోంది. పండుగ సమయంలో వాహనాల కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, ఆ సేల్స్‌ను క్యాష్ చేసుకునేందుకు కంపెనీ ఈ బైక్‌ను రంగంలోకి దింపింది. ఈ కొత్త టీవీఎస్ రేడియాన్ ధర రూ. 67,100 (ఎక్స్-షోరూమ్) వద్ద ప్రారంభమై, టాప్ మోడల్ కోసం రూ. 73,100 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

ఇది బేస్, డిజి-డ్రమ్, డిజి-డిస్క్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో బేస్ వేరియంట్ ధర గత మోడల్ కంటే రూ. 1,250 పెరగగా, టాప్ ఎండ్ అయిన డిజి-డిస్క్ వేరియంట్ మాత్రం గతంతో పోలిస్తే చౌకగా లభిస్తోంది. అన్ని వేరియంట్ల ధరలను పరిశీలిస్తే, బేస్ వేరియంట్ ధర రూ. 67,100 కాగా, డిజి-డ్రమ్ ధర రూ. 70,100, టాప్-స్పెక్ డిజి-డిస్క్ ధర రూ. 73,100 (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఇక, ఫీచర్లు, డిజైన్ పరంగా చూస్తే.. సరికొత్త టీవీఎస్ రేడియాన్‌లో ఎల్‌ఈడీ లైటింగ్ అన్ని వేరియంట్లలోనూ స్టాండర్డ్‌గా లభిస్తుంది. సిగ్నేచర్ DRLతో కూడిన కొత్త హెడ్‌ల్యాంప్, ఎల్‌ఈడీ టెయిల్‌ల్యాంప్, ఎల్‌ఈడీ టర్న్ ఇండికేటర్లను ఇందులో చేర్చారు. డిజి-డిస్క్ వేరియంట్‌లో ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఉండగా, మిగతా రెండు వేరియంట్లలో డ్రమ్ బ్రేక్స్ ఇచ్చారు.

అలాగే బైక్ గ్రాఫిక్స్ కూడా అప్‌డేట్ చేశారు. బేస్ వేరియంట్ బ్లాక్ అండ్ బ్లూ, బ్లాక్ అండ్ రెడ్ కలర్లలో వస్తుంది. డిజి-డ్రమ్ వేరియంట్ బ్లాక్ విత్ ఆరెంజ్, రెడ్ విత్ బ్లాక్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇక టాప్ వేరియంట్ అయిన డిజి-డిస్క్ బ్లాక్ విత్ ఆరెంజ్, రెడ్ విత్ బ్లాక్ డ్యూయల్-టోన్ (DT) కలర్లలో అందుబాటులో ఉంది. ఇక, బైక్ ఫీచర్లలో పెద్దగా మార్పులు చేయలేదు. ఇందులో 109.7 సీసీ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 8 హెచ్‌పీ పవర్‌, 8.7 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 10 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉన్న ఈ బైక్ లీటరుకు 69.3 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. అంతేకాకుండా, రేడియాన్‌లో యూఎస్‌బీ ఛార్జింగ్ సదుపాయం, కలర్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా లభిస్తాయి.