Reading Time: 2 minutes
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే.. ఫ్యూచర్ చెప్పేసిన ఆసీస్ దిగ్గజం..!

ICC ODI World Cup 2027: వచ్చే ఏడాది జరగబోయే వన్డే ప్రపంచకప్ 2027 కోసం ఐసీసీ తాజాగా షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. క్రికెట్ ఫార్మెట్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మక టోర్నీల్లో ఒకటైన ఈ మెగా వేడుక కోసం ఇప్పటినుంచే చర్చలు మొదలయ్యాయి. ఆఫ్రికా గడ్డపై జరగనున్న ఈ మెగా టోర్నీలో ఏ జట్టు టైటిల్ సాధిస్తుంది? ఏ జట్లు నాకౌట్ దశకు చేరుకుంటాయి? అనే ప్రశ్నలపై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ (Aaron Finch) తన అంచనాను వెల్లడించాడు. 2027 ప్రపంచకప్‌లో సెమీఫైనల్ చేరే అవకాశం ఉన్న 4 జట్లను అతడు ఎంపిక చేశాడు.

ఫించ్ అంచనా ప్రకారం భారత్ (India), ఆస్ట్రేలియా (Australia), ఇంగ్లండ్ (England), దక్షిణాఫ్రికా (South Africa) జట్లు ప్రపంచకప్‌లో సెమీస్ చేరుకుంటాయంట. అయితే ఈ జాబితాలో రెండు ప్రముఖ జట్లకు చోటు దక్కకపోవడం గమనార్హం. ఐసీసీ టోర్నీల్లో తరచూ నాకౌట్ దశ వరకు వెళ్లే న్యూజిలాండ్ (New Zealand), పాకిస్థాన్ (Pakistan) జట్లను ఫించ్ తన టాప్-4లో చేర్చలేదు. దీంతో అతడి అంచనా క్రికెట్ వర్గాల్లో చర్చకు దారితీసింది.

ఫించ్ ఎంపిక చేసిన 4 జట్లు..

భారత్: ప్రపంచకప్‌లో బలమైన జట్టుగా భారత్‌పై ఫించ్ నమ్మకం ఉంచాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకం ఉంటే భారత జట్టు చివరి నాలుగు చేరే అవకాశాలు ఉన్నాయని అతడి అంచనా.

ఆస్ట్రేలియా: ఐసీసీ టోర్నీల్లో అనుభవం, పెద్ద మ్యాచ్‌లను ఎదుర్కొనే సామర్థ్యం కారణంగా ఆస్ట్రేలియాను కూడా ఫించ్ ఎంపిక చేశాడు.

ఇంగ్లండ్: పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఇంగ్లండ్‌కు ఉన్న అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ జట్టును సెమీఫైనల్ అభ్యర్థిగా పేర్కొన్నాడు.

దక్షిణాఫ్రికా: సొంత గడ్డపై ప్రపంచకప్ జరగడం ఈ జట్టుకు కీలక అంశంగా మారనుంది. ఆఫ్రికా పరిస్థితులకు త్వరగా అలవాటు పడటం దక్షిణాఫ్రికాకు అదనపు బలం కావచ్చని ఫించ్ భావిస్తున్నాడు.

ఆఫ్రికా గడ్డపై ప్రపంచకప్..: 2027 ప్రపంచకప్‌కు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఆఫ్రికాలోని భిన్నమైన పిచ్ పరిస్థితులకు త్వరగా అలవాటు పడే జట్లకు టోర్నీలో ప్రయోజనం ఉంటుందని ఫించ్ అంచనా.

ముఖ్యంగా బ్యాటింగ్ లైనప్‌తో పాటు పవర్ ఫుల్ బౌలింగ్ దళం ఉన్న జట్లకు అవకాశాలు మెరుగ్గా ఉంటాయని అతడి అభిప్రాయం. ప్రపంచకప్‌నకు ముందు జట్ల ఫామ్, ఆటగాళ్ల లభ్యత, గాయాలు, పిచ్ పరిస్థితులు వంటి అంశాలు చాలా మార్పులు తీసుకురావొచ్చు. మరి ఫించ్ అంచనా వేసిన భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా నిజంగానే సెమీఫైనల్ చేరతాయా? లేక న్యూజిలాండ్, పాకిస్థాన్ వంటి జట్లు అంచనాలను తారుమారు చేస్తాయా? అనేది టోర్నీ సమయంలోనే తేలనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..