Reading Time: < 1 minute

దసరాకు జ్యువెలరీ షోరూం ఓపెనింగ్.. ఇంతలోనే 5.5 కేజీల బంగారం కొట్టేశారు.. 12 నిమిషాల్లో మాయం !

Caption of Image.

దసరా పండుగకు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న ఒక జ్యువెలరీ షోరూంలో దొంగలు పడ్డారు. కేవలం 12 నిమిషాల వ్యవధిలో 5.5 కేజీల బంగారు ఆభరణాలు కాజేసి పరారయ్యారు. పోయిన బంగారం విలువ రూ.8.28 కోట్లు ఉంటుందని షోరూం యజమాని తెలిపారు. గుజరాత్‌లోని వడోదర నగరంలో ఈ ఘటన జరిగింది. వడోదరలోని వాఘోడియా రోడ్, జావేర్‌నగర్ సమీపంలోని సాయి గణేష్ కాంప్లెక్స్‌లో ఉన్న ‘శ్రీ అంబికా జ్యువెల్లర్స్’ షోరూమ్‌లో ప్రదర్శన కోసం ఆభరణాలను ఉంచారు.

అయితే.. సేల్స్ మేనేజర్ కాసేపు బ్రేక్ తీసుకుని పక్కకు వెళ్లిన సమయంలో.. ఆభరణాలు ఉన్న రెండు బ్యాగులు మాయమయ్యాయి. ముంబైకి చెందిన ‘యుగన్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్’లో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్న హిమాన్షు జైన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, బాపోడ్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు.

►ALSO READ | 2029లో తేల్చుకుందాం.. ఓడిపోయేందుకు సిద్ధంగా ఉండండి: ఇండియా కూటమిపై అమిత్ షా ఫైర్

జైన్ ఫిర్యాదు ప్రకారం, ఆయన 2017 నుంచి డాకోర్‌కు చెందిన ఆభరణాల దుకాణ యజమాని భవిక్‌కుమార్ సోనీతో వ్యాపారం చేస్తున్నారు. వడోదరలో తాను ఒక కొత్త షోరూమ్‌ను ప్రారంభించానని, దసరాకు ముందు ప్రారంభోత్సవం కోసం బంగారు ఆభరణాలను సప్లై చేయాలని సోనీ జైన్‌ను కోరారు.

ఆ ఆర్డర్ మేరకు, సుమారు రూ. 8.28 కోట్ల విలువైన 5.5 కిలోల బంగారు ఆభరణాలతో జైన్ ఆదివారం వడోదరకు చేరుకున్నాడు. ఆ ఆభరణాలను షోరూమ్‌లో ప్రదర్శన కోసం ఉంచిన సమయంలోనే ఈ చోరీ జరిగింది. నిందితుల ఆచూకీ కోసం పోలీసులు నాలుగు స్పెషల్ టీమ్స్గా గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు.
 

©️ VIL Media Pvt Ltd.