Reading Time: 2 minutes
బీసీలకు 40 శాతం సీట్లు..! మాస్టార్‌ ప్లాన్‌తో బరిలోకి.. ఏపీలో ఏ క్షణమైనా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌..

ఏపీలో స్థానిక సమరానికి తెరలేవబోతోందా..? పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల దిశగా అధికార, ప్రతిపక్ష పార్టీలు కసరత్తు ముమ్మరం చేస్తున్నాయా..? బీసీ రిజర్వేషన్లు.. సీట్ల సర్దుబాటు.. అభ్యర్థుల ఎంపిక.. ఇలా ఎవరి లెక్కల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. బీసీలకు 40 శాతం సీట్లు కేటాయిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించగా.. కూటమిలో సీట్ల సర్దుబాటుపై జనసేన తన వాదన వినిపిస్తోంది. అటు వైసీపీ కూడా ఎన్నికల యుద్ధానికి ముందస్తు వ్యూహాలు రచిస్తోంది. మరి లోకల్‌ ఫైట్‌లో పార్టీల ఈక్వేషన్లు ఎలా ఉన్నాయి..? ఎవరికి వారు ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తున్నారు..? స్థానిక సమరానికి ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి! స్థానిక సంస్థల ఎన్నికలపై అన్ని ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదునుపెట్టాయి. 40 శాతం సీట్లు బీసీలకే అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు క్లారిటీ ఇవ్వగా.. త్యాగం చేసిన తమకూ తగిన ప్రాధాన్యత కావాలంటోంది జనసేన. మరోవైపు వైఎస్సార్‌సీపీ కూడా జిల్లాల వారీగా వ్యూహాలు రచిస్తూ వార్‌రూమ్‌లను సిద్ధం చేస్తోంది.

మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల, ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్

ఏపీలో లోకల్‌ ఫైట్‌ ఈక్వేషన్స్‌ స్పీడ్‌ అందుకున్నాయి. స్థానిక ఎన్నికల్లో పార్టీ పరంగా బీసీలకు పెద్దపీట వేయాలని టీడీపీ నిర్ణయించింది. స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు ముమ్మరం చేసిన సీఎం చంద్రబాబు.. మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు పార్టీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా.. స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, కూటమి పార్టీలతో సమన్వయం, ప్రత్యర్థి పార్టీల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం లాంటి అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సారి ఏకంగా 40 శాతం సీట్లు బీసీలకే కేటాయిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అందుకే.. జయహో బీసీ…! జనాభాలో సగం-కూటమి ఇచ్చింది బలం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. అదేసమయంలో.. కూటమి పార్టీల మధ్య సమన్వయంపైనా సీఎం చంద్రబాబు ఫోకస్‌ పెట్టారు. కూటమి పార్టీల మధ్య విభేదాలకు తావివ్వొద్దని చెప్పారు. మిత్రధర్మం చాలా ముఖ్యమని.. జనసేన, బీజేపీని కలుపుకొని ముందుకెళ్లాలని టీడీపీ శ్రేణులకు సూచించారు. జనసేన, BJPతో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలన్నారు సీఎం చంద్రబాబు.

త్యాగాలు చేసినవారికి న్యాయం జరగాలంటున్న జనసేన

మరోవైపు.. స్థానిక ఎన్నికల సమరం మొదలవుతున్న వేళ కూటమిలో సీట్ల లెక్కలు ఆసక్తిగా మారుతున్నాయి. గత ఎన్నికల్లో త్యాగాలు చేసిన వారికి న్యాయం జరగాలంటోంది జనసేన. గోదావరి జిల్లాల్లో 50 నుంచి 70 శాతం వరకు జనసేన బలం ఉందని, అందుకే ఎక్కువ సీట్లు అడుగుతున్నామన్నారు కాకినాడ ఎంపీ ఉదయ్‌ శ్రీనివాస్‌. పార్టీ కోసం కష్టపడ్డ జనసైనికులు, వీర మహిళలకు పదవులు వచ్చేలాగా కూటమితో సమన్వయం చేసుకుంటామన్నారు. 2014 నుంచి 19వరకు జనసేన నాయకులంతా ఏ పదవీ ఆశించకుండా నిస్వార్థంగా పనిచేశారని గుర్తు చేశారు. త్యాగాలు చేసినవారికి సీట్లు అడుగుతున్నామని.. ఆ లెక్కకు తగ్గట్టే కచ్చితంగా తీసుకుంటామని ఎంపీ ఉదయ్‌ శ్రీనివాస్‌ స్పష్టం చేశారు.

ఏపీలో ఏ క్షణమైనా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉండటంతో కూటమి నేతలు అలర్ట్‌ అవుతున్నారు. టీడీపీ నేతలంతా ఎక్కడికక్కడ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో ప్రజల్లోనే ఉంటున్నారు. నెల్లూరులో మంత్రి నారాయణ ఇళ్ల పట్టాలు పంపిణీ చేయగా.. విజయనగరంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ భూమిపూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక.. త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికలపై బీజేపీ ఏపీ చీఫ్‌ మాధవ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల విజయాన్ని స్థానిక ఎన్నికల్లోనూ రిపీట్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఇవాళ కీలక భేటీ..

కాగా.. స్థానిక ఎన్నికలపై ఇవాళ కూటమి పార్టీల నేతల కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. సీట్ల సర్దుబాటుపై ఈ సాయంత్రం 4 గంటలకు సీఎం చంద్రబాబు, పవన్‌, మాధవ్‌ భేటీ కానున్నారు. చంద్రబాబు నివాసంలో కూటమి కీలక సమావేశం జరగనుంది. మూడు పార్టీల అగ్రనేతల భేటీలో సీట్ల సర్దుబాటుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఎన్నికల యుద్ధానికి సన్నద్ధమవుతున్న వైసీపీ..

మరోవైపు.. ప్రధాన ప్రతిపక్షం వైసీపీ కూడా స్థానిక ఎన్నికల యుద్ధానికి సన్నద్ధమవుతోంది. వైసీపీ ముఖ్యనేతలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించిన స్టేట్ కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి.. జిల్లా, నియోజకవర్గ స్థాయిల్లో ప్రత్యేక ఎన్నికల వార్‌రూమ్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. ముందే అభ్యర్థులను, ప్రత్యామ్నాయ అభ్యర్థులను గుర్తించాలని ఆదేశించారు. ప్రతీ గ్రామానికీ న్యాయం సహాయం అందేలా లీగల్‌ నెట్‌వర్క్‌ నామినేషన్ల నుంచి కౌంటింగ్‌ వరకు లీగల్‌ టీమ్‌లు అప్రమత్తంగా ఉండాలన్నారు సజ్జల. ఇక.. గతంలోనే బీసీలకు 48శాతానికి పైగా పదవులు ఇచ్చామని గుర్తుచేశారు వైసీపీ రీజినల్ కో-ఆర్డినేటర్ భూమన కరుణాకర్‌రెడ్డి. కర్నూలు జిల్లా స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన.. ప్రస్తుతం పార్టీ చాలా బలంగా ఉందని, మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

మొత్తంగా.. నోటిఫికేషన్‌ రాకముందే ఏపీలో స్థానిక ఎన్నికల వేడి పెరుగుతోంది. సీట్ల సర్దుబాటు, బీసీ రిజర్వేషన్లపై లెక్కలపై అధికార కూటమి ఫోకస్‌ పెట్టగా.. వార్‌రూమ్‌ వ్యూహాలతో ప్రతిపక్ష వైసీపీ సన్నద్ధమవుతుండటం ఆసక్తి రేపుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..