Reading Time: 2 minutes
Hyderabad: ఉప్పల్‌లో ఇండియా–వెస్టిండీస్‌ మ్యాచ్‌.. తిలక్ వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. అర్థరాత్రి వరకు మెట్రో..

ఇండియా, వెస్టిండీస్‌ టీ20 మ్యాచ్‌తో హైదరాబాద్‌లో క్రికెట్‌ ఫీవర్‌ నెలకొంది. మ్యాచ్‌లో సత్తా చాటేందుకు ఇరుజట్లు పట్టుదలగా ఉన్నాయి. బుధవారం రాత్రి 7గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. అయితే.. మ్యాచ్‌కు ముందు.. టీమిండియా వైస్ కెప్టెన్ తిలక్ వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.. ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న తిలక్ వర్మ.. హైదరాబాద్ అభిమానుల ముందు, తన సొంత గ్రౌండ్‌లో వైస్ కెప్టెన్‌గా బరిలోకి దిగడం ఎంతో గర్వంగా, ప్రత్యేకంగా ఉందని తెలిపారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో అగ్రెసివ్‌గా ఆడుతున్న తమకు హైదరాబాద్‌ పిచ్‌ కలిసివచ్చే అవకాశముందన్నారు. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 2–1 ఆధిక్యంలో ఉంది.

మ్యాచ్‌ను వీక్షించేందుకు 40వేలమందికిపైగా ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉండటంతో 2200 మంది సిబ్బందితో బందోబస్తును నిర్వహిస్తున్నారు. స్టేడియం పరిసరాలతో పాటు పార్కింగ్‌ ప్రాంతాల్లో 408 సీసీ కెమెరాలతో పాటు రెండు అత్యాధునిక డ్రోన్లతో నిఘా పెట్టామన్నారు. మ్యాచ్‌ సందర్భంగా ఉప్పల్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో మధ్యాహ్నం 3 తర్వాత ఆంక్షలను అమలు చేయనున్నారు. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ 8 షీ టీమ్స్‌ బృందాలు మఫ్టీలో ఉంచారు. మ్యాచ్‌కు వచ్చేవారు ఆర్టీసీ, మెట్రో సేవలను వినియోగించుకోవాలని ఇప్పటికే నిర్వాహకులు సూచించారు.

అర్థరాత్రి వరకు మెట్రో..

ఉప్పల్ స్టేడియంలో భారత్ వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్‌కు హాజరయ్యే క్రికెట్ అభిమానుల కోసం హైదరాబాద్ మెట్రో సేవలను ఈరోజు అర్ధరాత్రి వరకు పొడిగించారు. సాధారణంగా, మెట్రో రైళ్లు రాత్రి 11 గంటల వరకు నడుస్తాయి. అయితే, మ్యాచ్ రోజు కోసం ఎల్అంట్‌టి హైదరాబాద్ మెట్రో సమయాలను పొడిగించింది. స్టేడియం – ఎన్‌జిఆర్‌ఐ మెట్రో స్టేషన్ల నుండి చివరి రైళ్లు అర్ధరాత్రి 12 గంటలకు బయలుదేరుతాయి.. తద్వారా ప్రేక్షకులకు స్టేషన్లకు చేరుకోవడానికి సౌకర్యవంతంగా ఇళ్లకు ప్రయాణించడానికి సౌలభ్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

నలుగురు అరెస్ట్..

ఉప్పల్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో జరగనున్న భారత్‌, వెస్టిండీస్‌ నాలుగో టీ20 మ్యాచ్‌కు టికెట్లు భారీగా అమ్ముడుపోయాయి. క్రికెట్‌ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్‌ను కొందరు క్యాష్‌ చేసుకోవాలనుకున్నారు. బ్లాక్‌లో టికెట్లు విక్రయిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ‘నాట్‌ ఫర్‌ సేల్‌’ అని ముద్రించిన 11 కాంప్లిమెంటరీ టికెట్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ సభ్యుడు సురేష్‌చంద్ర తన కుమారుడికి ఫ్రీ పాస్‌లు ఇచ్చాడు. అతను వాట్సాప్‌ స్టేటస్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా బ్లాక్‌లో విక్రయిస్తుండగా పోలీసులు గుర్తించి అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. పట్టుబడ్డ వారి నుంచి ఐదు మొబైల్స్‌, ఒక టూ వీలర్‌ను సీజ్‌ చేశారు. సతీష్‌చంద్ర యంగ్‌ సిటిజన్స్‌ క్రికెట్‌ క్లబ్‌ సెక్రటరీగా ఉన్నారు.