Reading Time: 2 minutes

Jailer 2: ‘జైలర్ 2’ రిలీజ్‌పై మేకర్స్ క్లారిటీ.. బాక్సాఫీస్ బరిలో ఉంటుందా?

Caption of Image.

సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘జైలర్ 2’ సినిమా విడుదలపై నెలకొన్న అనుమానాలకు తెరపడింది. ఈ చిత్రం హిందీ వెర్షన్ విడుదల వాయిదా పడుతుందంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మేకర్స్ కీలక ప్రకటన చేశారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే అక్టోబర్ 15, 2026న తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ హిందీ వెర్షన్ థియేటర్లలోకి రానుందని స్పష్టం చేశారు. దీంతో నార్త్ ఇండియాలోనూ రజనీ మేనియా ఏ స్థాయిలో ఉండబోతోందన్న ఆసక్తి ట్రేడ్ వర్గాల్లో పెరిగింది.

హిందీ రిలీజ్‌పై పుకార్లకు చెక్.. మేకర్స్ క్లారిటీ

‘జైలర్ 2’ హిందీలో విడుదల కావడం లేదంటూ వస్తున్న వార్తలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెడుతూ చిత్ర బృందం అధికారిక ప్రకటన విడుదల చేసింది. హిందీ వెర్షన్‌కు సంబంధించి విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని, అక్టోబర్ 15నే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని వెల్లడించింది.

ఉత్తర భారతదేశంలో ఈ సినిమాను పెన్ మారుధర్ ఎంటర్‌టైన్‌మెంట్ పంపిణీ చేయనుంది. ధృవీకరించని వార్తలను ప్రచారం చేయవద్దని మీడియా సంస్థలను చిత్ర బృందం కోరింది. దీంతో హిందీ మార్కెట్‌లోనూ ‘జైలర్ 2’ విడుదలకు మార్గం సుగమమైంది.

రూ.22 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్‌పై చర్చ..

సినిమా విడుదలకు ముందే ‘జైలర్ 2’ బాక్సాఫీస్ ర్యాంపేజ్ పై చర్చ మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఈ చిత్రం రూ.22 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇండియాలో తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. హిందీ మార్కెట్ లో త్వరలోనే ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. 

జైలర్ 2 స్టోరీ ఏంటీ?

నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జైలర్ 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వచ్చిన ‘జైలర్’లో రిటైర్డ్ జైలర్ టైగర్ ముత్తువేల్ పాండియన్‌గా రజనీకాంత్ తనదైన స్టైల్‌తో ప్రేక్షకులను అలరించారు. కుటుంబం, నేర ప్రపంచం, అండర్‌వరల్డ్ శక్తుల మధ్య సాగే సంఘర్షణతో ఆ సినిమా ప్రేక్షకులకు యాక్షన్‌తో పాటు ఎమోషనల్ కనెక్ట్‌ను అందించింది.

ఇప్పుడు సీక్వెల్‌లో టైగర్ పాత్రను దర్శకుడు నెల్సన్ ఏ స్థాయిలో చూపించబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. గత చిత్రానికి కొనసాగింపుగా కథలో ఎలాంటి మలుపులు ఉంటాయి? ముత్తువేల్ పాండియన్ మరోసారి తనదైన శైలిలో ప్రత్యర్థులను ఎలా ఎదుర్కొంటాడు? అన్న ప్రశ్నలు అభిమానుల్లో క్యూరియాసిటీని పెంచుతున్నాయి. అయితే, ‘జైలర్ 2’ టీజర్, ట్రైలర్ ద్వారా కథపై బిగ్ హింట్ ఇవ్వలేదు నెల్సన్. కానీ, ఈ పార్ట్ 2లో పొలిటికల్ డ్రామా, అండర్ వరల్డ్ డాన్స్.. ఇలా కొత్త క్యారెక్టర్స్ని మాత్రం రివీల్ చేశారు.  

ALSO READ :  ‘నీ ప్రయాణం తిరుగులేనిది’..

స్టార్ క్యాస్టింగ్.. సీక్వెల్‌కు మరో బిగ్ అట్రాక్షన్!

‘జైలర్ 2’కు రజనీకాంత్ పాటుగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివన్న, తమిళ వర్సటైల్ యాక్టర్స్ ఎస్.జె. సూర్య, యోగిబాబు, బాలీవుడ్ యాక్టర్స్ మిథున్ చక్రవర్తి, విద్యా బాలన్, జతిన్ సర్నాతో పాటుగా రమ్యకృష్ణ తదితరులు నటిస్తున్నారు. అంతేకాకుండా.. విజయ్ సేతుపతి, హృతిక్ రోషన్, జాకీ ష్రాఫ్ వంటి స్టార్ల అతిథి పాత్రలపై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. వీరిలో ప్రతి ఒక్కరి పాత్రకు కథలో ఎంత ప్రాధాన్యం ఉంటుందన్నది సినిమా విడుదలైన తర్వాతే స్పష్టమవుతుంది.

జైలర్ 2కి బాక్సాఫీస్ బరిలో పోటీగా..

అక్టోబర్ 15న విడుదలకు సిద్ధమవుతున్న ‘జైలర్ 2’కు ఆ తర్వాతి రోజే ఇతర సినిమాల నుంచి పోటీ ఎదురుకానుంది. అక్టోబర్ 16న విడుదల కానున్న చిత్రాల్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నటించిన తెలుగు యాక్షన్ చిత్రం ‘రణబలి’, రాజ్‌కుమార్ రావు, వామికా గబ్బి ప్రధాన పాత్రల్లో నటించిన ‘ప్రహార్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఉజ్జ్వల్ నికమ్’ ఉన్నాయి. యామీ గౌతమ్ నటించిన ‘నయ్యి నవేలి’ కూడా అదే రోజున విడుదల కానున్నట్లు సమాచారం.

రజనీకాంత్‌కు ఉన్న క్రేజ్, నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించే యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్, భారీ స్టార్ క్యాస్టింగ్.. ఇవన్నీ సినిమాకు ప్రధాన బలాలుగా నిలవవచ్చు. అయితే, అంచనాలను అందుకోవాలంటే కథనం, ఎమోషన్స్, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తాయన్నదే అసలు విషయం.

©️ VIL Media Pvt Ltd.