Reading Time: 2 minutes

బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్.. టాలీవుడ్‌లో డిజాస్టర్ : ‘హనుమాన్ అంశ్’కు ఏమైంది?

Caption of Image.

బాలీవుడ్ లో సంచలన రికార్డులు సృష్టించిన ‘హనుమాన్ అంశ్’.. తెలుగు బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. భారీ అంచనాలతో ఏపీ, తెలంగాణలో 700కు పైగా స్క్రీన్లలో రిలీజ్ అయినప్పటికీ .. కలెక్షన్ల విషయంలో మాత్రం తీవ్ర నిరాశపరిచింది. ఈ పరిస్థితిపై సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.. 

బాలీవుడ్ లో కాసులు.. టాలీవుడ్ లో కష్టాలు..

సుమారు రూ.2 కోట్ల అతి తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా హిందీ మార్కెట్‌లో రూ.400 కోట్లకు పైగా వసూలు రాబట్టి సినీ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. అయితే అదే సినిమాను తెలుగులో విడుదల చేయగా.. ఇప్పటివరకు వసూళ్లు రూ.2 కోట్ల లోపే ఉన్నాయని సమాచారం. ఇంకా తెలుగు మార్కెట్‌లో సుమారు రూ.12 కోట్లు రికవరీ చేయాల్సి ఉంది. అయితే ఈ చిత్రం ఇప్పుడు ఈ బ్రేక్‌ఈవెన్‌కు చేరుకోవడం పెద్ద సవాలుగా మారింది.

ఆలస్యమే కొంపముంచిందా?

అయితే హిందీలో విడుదలైన 45 రోజుల తర్వాత తెలుగు వెర్షన్‌ను తీసుకురావడమే ప్రధాన సమస్యగా మారిందన్న అభిప్రాయాన్ని నిర్మాత అభిషేక్ అగర్వాల్ వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో హిందీ వెర్షన్‌కు మంచి ఆదరణ లభించడంతో, తెలుగు ప్రేక్షకుల్లో చాలామంది అప్పటికే ఒరిజినల్‌ను చూసేశారని ఆయన పేర్కొన్నారు. విజయవంతమైన హిందీ సినిమాలను వీలైనంత త్వరగా ప్రాంతీయ భాషల్లో విడుదల చేస్తే ప్రేక్షకుల్లోని ఆసక్తిని క్యాష్ చేసుకోవచ్చని అభిషేక్ సూచించారు. అయితే డబ్బింగ్, పాటల అనువాదం, సెన్సార్ ప్రక్రియకు సమయం పడుతుందని, నిర్మాతల వ్యూహాలను తప్పుబట్టలేమని కూడా చెప్పారు.

►ALSO READ | Jailer 2: ‘జైలర్ 2’ రిలీజ్‌పై మేకర్స్ క్లారిటీ.. బాక్సాఫీస్ బరిలో ఉంటుందా?

భక్తి సందేశమే అసలు బలం!

దర్శకుడు విశాల్ చతుర్వేది రూపొందించిన ఈ చిత్రం అహంకారాన్ని విడిచిపెట్టి, ఇతరులకు సేవ చేయడం, ప్రతి ఒక్కరిలోనూ దైవత్వాన్ని చూడటం వంటి సందేశాలను అందిస్తుంది. తక్కువ బడ్జెట్‌తో భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా హిందీలో సృష్టించిన మ్యాజిక్‌ను తెలుగు ప్రేక్షకుల దగ్గర ఎందుకు పునరావృతం చేయలేకపోయిందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆలస్యమైన విడుదలే కారణమా? లేక ఇప్పటికే ఒరిజినల్ చూసేయడమే ప్రభావం చూపిందా? ఈ ప్రశ్నలకు రాబోయే రోజుల్లో వసూళ్లే సమాధానం చెప్పనున్నాయి.

 

©️ VIL Media Pvt Ltd.