
తిరుమల శ్రీవారి భక్తులకు భారీ శుభవార్త. వెంకటాద్రి యాప్ అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్ ద్వారా తిరుమలలోని 350కిపైగా ప్రదేశాలను సులువుగా గుర్తించవచ్చు. తెలుగుతో పాటు ఐదు భాషల్లో ఈ యాప్ సపోర్ట్ చేస్తుంది. తాజాగా సీఎం చంద్రబాబు ఈ యాప్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ యాప్ ఉపయోగించడం వల్ల తిరుమలకు కొత్తగా వచ్చేవారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. యాప్ ద్వారా తిరుమలలోని లొకేషన్లను సులభంగా గుర్తించవచ్చు. 25 విభాగాల్లోని 350కిపైగా ప్రదేశాల లొకేషన్లను యాప్‌లో పొందుపర్చారు. ఏఐ వాయిస్ అసిస్టెంట్ కూడా ఈ యాప్‌లో అందుబాటులో ఉంటుంది. 24 గంటల పాటు ఏఐ అసిస్టెంట్ పనిచేస్తుంది. భక్తులందరూ ఈ యాప్‌ను ఉపయోగించుకోవాలని టీటీడీ చెబుతోంది.
తిరుమలకు కొత్తగా వచ్చేవారికి రూమ్స్ కోసం ఎక్కడికి వెళ్లాలి..? దర్శన క్యూలైన్ల కోసం ఏ లొకేషన్‌కు వెళ్లాలి..? అన్నప్రసాదం సెంటర్లు ఎక్కడ ఉంటాయి..? క్యాంటీన్లు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఉచిత లగేజీ కౌంటర్లు ఎక్కడెక్కడ ఉన్నాయి? అనే వివరాల లొకేషన్లను తెలుసుకోవచ్చు. తిరుమలలో భక్తులకు అందించే సేవలకు సంబంధించిన అన్ని ప్రదేశాల లొకేషన్లు ఈ యాప్‌లో అందుబాటులో ఉంటాయి. అమెరికాకు చెందిన ఎన్నారై జేపీ ఆర్ధిక సాయంతో ఈ యాప్ టీటీడీ రూపొందించింది. భక్తుల సౌకర్యార్థం కోసం ఈ యాప్ ఎంతో ఉపయోగపడనుంది. తిరుమలలోని ప్రదేశాలను సులువుగా తెలుసుని లొకేషన్ల ఆధారంగా అక్కడికి చేరుకోవచ్చు. ఏఐ వాయిస్ అసిస్టెంట్ సౌకర్యం ఉండటంతో వాయిస్ కమాండ్ ద్వారా కూడా లొకేషన్లను గుర్తించవచ్చు. ఇంటర్నెట్ అందుబాటులో లేకపోయినా ఆఫ్‌లైన్ నావిగేషన్ ద్వారా ఉపయోగించుకునేలా ఈ యాప్ రూపొందించారు. తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్, కన్నడ, తమిళం భాషల్లో ఈ యాప్ సేవలు అందుబాటులో ఉంచారు. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ ద్వారా ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
తిరుమలలోని టీటీడీ ఆఫీసులు, పార్కింగ్ ప్రదేశాలు, మరుగుదొడ్లు, కల్యాణ కట్టలు, పోలీస్ స్టేషన్లు, షాపింగ్ కాంప్లెక్స్, ఆస్పత్రులు, తాగునీటి సౌకర్యం, గదుల కేటాయింపు కౌంటర్లు, అన్న ప్రసాద కేంద్రాలు, ఉచిత లగేజీ, పాదరక్షల డిపాజిట్ సెంటర్లు, బస్టాప్‌లు, రూమ్స్ విచారణ కేంద్రాలు, క్యాంటీన్లు, దర్శన క్యూలైన్ల లొకేషన్ల వివరాలు తెలుసుకోవచ్చు. ఆ లొకేషన్ ఆధారంగా మీరు సులభంగా చేరుకోవచ్చు. ఇక అత్యవసర హెల్ప్ లైన్ నెంబర్లు, పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్లు, టీటీడీ హెల్ప్ లైన్ నెంబర్లు ఇందులో అందుబాటులో ఉంటాయి. ఇక ఉచిత బస్సు రూట్లు, టైమింగ్స్ కూడా యాక్సెస్ చేయవచ్చు. అయితే స్మార్ట్ ఫోన్ లేని ప్రయాణికుల కోసం ప్రత్యేక కియోస్క్‌లు ఏర్పాటు చేసి యాప్ సేవలను అందించనున్నారు.