
Niti Taylor: బాలీవుడ్ నటి ‘నీతి టేలర్’ తాజాగా దక్షిణాది సినీ పరిశ్రమలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని తాజాగా వెల్లడించింది. ఓ దక్షిణాది దర్శకుడు తనను అసభ్యకరమైన రీతిలో సంప్రదించాడని ఆమె పేర్కొంది. ఆ ఘటన తర్వాత తాను సినిమాల్లో నటించకూడదని నిర్ణయించుకున్నానని తెలిపింది.
ఈ విషయమై నీతి టేలర్ మాట్లాడుతూ.. దక్షిణాదిలో తాను కేవలం రెండు సినిమాల్లో మాత్రమే నటించానని చెప్పింది. మొదటి సినిమాకు దర్శకత్వం వహించిన వ్యక్తే రెండో సినిమా కోసం తనను సంప్రదించాడని, మొదటి సినిమా పూర్తయిన తర్వాత ఆ దర్శకుడు తనకు ఫోన్ చేసి.. సినిమాలో నటించాలంటే తనతో లైంగిక సంబంధం పెట్టుకోవాల్సి ఉంటుందని చెప్పాడని వెల్లడించింది.
ఆ మాటలు విన్న వెంటనే తాను షాక్‌కు గురయ్యానని నీతి టేలర్ తెలిపింది. ఆ పరిస్థితుల్లో ఎలా స్పందించాలో కూడా అర్థం కాలేదని చెప్పింది. ఆ దర్శకుడిని వెంటనే బ్లాక్ చేసి, తన తల్లికి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పానని చెప్పుకొచ్చింది. ఇంకా ఆ దర్శకుడు గతంలో ఇతరులతో కూడా ఇలాంటి విధంగానే ప్రవర్తించడం తాను చూశానని నీతి టేలర్ పేర్కొంది. అయితే తనకు కూడా అలాంటి అనుభవం ఎదురవుతుందని ఎప్పుడూ ఊహించలేదని అన్నారు. ఈ ఘటన తర్వాత ఇకపై సినిమాల్లో నటించకూడదని నిర్ణయించుకున్నానని తెలిపింది. నీతి టేలర్ బాలీవుడ్‌లో నటిగా గుర్తింపు తెచ్చుకున్నా.. తెలుగులోనూ ‘మేం వయసుకు వచ్చాం’ సినిమాలో నటించింది. తాజాగా ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో మరోసారి చర్చకు దారితీశాయి.