
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన చరిత్ర సింగరేణి కార్మికులది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. బొగ్గు ఉత్పత్తిలో, ఉద్యమాల్లో మొనగాళ్లు సింగరేణి కార్మికులు అని కొనియాడారు. చెమటనెత్తురు ధారపోసి విద్యుత్ వెలుగులు ఇస్తున్నది సింగరేణి కార్మికులేనని అన్నారు. చీకటి గుహల్లో రక్తతర్పణ చేసిన చరిత్ర సింగరేణి కార్మికులదని అన్నారు.
కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం చేస్తానని బయలుదేరితే ఆయనకు అండగా సింగరేణి నిలిచిందని పేర్కొన్నారు. సకల జనుల సమ్మెతో 42 రోజులు దక్షిణ రాష్ట్రాలను అల్లకల్లోలం చేసి, నిరాహార దీక్ష సమయంలో కూడా కేసీఆర్ వెంట కదం తొక్కిన సింగరేణి త్యాగాన్ని ఎవరూ మరవలేదని అన్నారు. ప్రపంచంలో కార్మికులందరూ బోనస్ల కోసం పోరాటం చేస్తారు. కేవలం సింగరేణి కార్మికులు మాత్రమే రాష్ట్రం కోసం పోరాటం చేశారని ప్రశంసించారు.
బుధవారం (అక్టోబర్ 14) గోదావరిఖనిలో బీఆర్ఎస్ సింగరేణి కార్మిక గర్జన సభ నిర్వహించింది. ఈ సభకు కేటీఆర్ హాజరై ప్రసంగించారు. ‘‘కాంగ్రెస్కు అధికారమిస్తే తెలంగాణ అంధకారమవుతుందని కేసీఆర్ ముందే చెప్పారు. కేసీఆర్ చెప్పినట్లుగానే తెలంగాణలో మళ్లీ పాత రోజులు వచ్చాయి. ఇప్పుడు రాష్ట్రంలో కరెంట్ కట్ సాధారణమైంది.. రైతులు వలవలమని ఏడుస్తున్న పరిస్థితి.. కాంగ్రెస్కు ఓటేసి తప్పు చేశామని రైతులు బాధపడుతున్నారు’’ అని అన్నారు.
సింగరేణిలో అవినీతి రైజింగ్.. ఉత్పత్తి ఫాలింగ్
బీఆర్ఎస్ దిగిపోయే నాటికి సింగరేణి బొగ్గు ఉత్పత్తి 70 మిలియన్ టన్నులు. కాంగ్రెస్ హయాంలో సింగరేణి బొగ్గు ఉత్పత్తి 58 మిలియన్లకు పడిపోయిందన్నారు. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి తగ్గడానికి కారణం కార్మికులు కాదని.. కాంగ్రెస్ నేత అవినీతి వల్లే సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి తగ్గిందని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో సింగరేణిలో అవినీతి రైజింగ్.. ఉత్పత్తి ఫాలింగ్ అన్నట్లు పరిస్థితి మారిందని విమర్శించారు. ప్రస్తుతం సింగరేణిలో కుంభకోణాలో కుంభమేళా నడుస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో సింగరేణిలో అన్నీ మైనస్ టెండర్లే ఉండేవి.. కాంగ్రెస్ హయాంలో ప్లస్ టెండర్లతో సింగరేణి కుదేలైందన్నారు.
సింగరేణిలో ఇప్పుడు అంతా సీఎం రేవంత్ రెడ్డి బావమరిదిదే నడుస్తోందన్నారు. సింగరేణి టెండర్లలో సైట్ విజిట్ కుంభకోణం వెనక రేవంత్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు. నైనీ వ్యవహారంలో ప్రభుత్వానికి మిగిలిన రూ.30 వేల కోట్లు ఎవరు మింగారని ప్రశ్నించారు. సిరుల పంట అయినా సింగరేణిని అవినీతి గనిగా మారుస్తున్నది ఎవరని నిలదీశారు.