
Karthik Subbaraj : తన దగ్గర పనిచేసిన ఓ అసిస్టెంట్ డైరెక్టర్.. సొంతంగా మెగాఫోన్ పట్టుకుని దర్శకుడిగా మారుతుంటే ఆ గురువుకు కలిగే ఆనందమే వేరు. ఇప్పుడు ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కూడా అలాంటి సంతోషాన్నే వ్యక్తం చేశారు. తన దగ్గర పనిచేసిన రాజేంద్ర బాల దర్శకుడిగా పరిచయం అవుతుండటంపై ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. సుహాస్, సంజన కృష్ణమూర్తి జంటగా రాజేంద్ర బాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హైడ్ & సిల్క్’ టైటిల్ లాంచ్ కార్యక్రమంలో కార్తీక్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశంగా మారాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజేంద్ర బాల తనకు తమ్ముడిలాంటి వాడని అన్నారు. ‘జిగర్తాండ’తో పాటు తనతో కలిసి పలు సినిమాలకు పనిచేశాడని గుర్తుచేసుకున్నారు. తన దగ్గర పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్లు ఒక్కొక్కరుగా దర్శకులుగా ఎదుగుతుంటే ఎంతో ఆనందంగా ఉంటుందని చెప్పారు.
రజనీకాంత్ నటించిన ‘బాషా’ సినిమాలో తన కుటుంబ సభ్యులు జీవితంలో స్థిరపడినప్పుడల్లా ఆయన కొవ్వొత్తి వెలిగించే సన్నివేశం తనకు గుర్తుకొస్తుందని, తన శిష్యులు దర్శకులుగా మారుతున్నప్పుడు కూడా అలాంటి అనుభూతే కలుగుతుందని వివరించారు. రాజేంద్ర బాల విషయంలో చాలా గర్వంగా ఉందని ఎమోషనల్‌గా మాట్లాడారు. రాజేంద్ర బాలకు ఫస్ట్ నుంచీ ఏఆర్ మురుగదాస్ తరహాలో కమర్షియల్ మాస్ సినిమాలు తెరకెక్కించాలనే కోరిక ఉండేదని కార్తీక్ వెల్లడించారు. అందుకోసం భారీ యాక్షన్ కథను సిద్ధం చేసి పలువురు హీరోలకు వినిపించినట్లు చెప్పారు. అయితే, తొలి సినిమాతోనే భారీ బడ్జెట్, పెద్ద హీరోతో ముందుకెళ్లడం కంటే మంచి కథతో దర్శకుడిగా తనను తాను నిరూపించుకోవాలని సలహా ఇచ్చినట్లు తెలిపారు. ఆ తర్వాతే రాజేంద్ర బాల ‘హైడ్ & సిల్క్’ కథను సిద్ధం చేశారని వివరించారు. ‘హైడ్ & సిల్క్’ సాధారణ ప్రేమకథ కాదని, ఇందులో కామెడీతో పాటు బలమైన భావోద్వేగాలు ఉంటాయని కార్తీక్ సుబ్బరాజ్ తెలిపారు. ఈ కథను తెలుగులో తెరకెక్కించాలని నిర్ణయించుకున్న వెంటనే హీరో సుహాస్‌ను సంప్రదించామని, కథ విన్న వెంటనే ఆయన అంగీకరించారని వెల్లడించారు. ఈ చిత్రంలో సీనియర్ నటుడు తనికెళ్ల భరణి కీలక పాత్రలో కనిపించనున్నారు. అమృత్ రామ్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. తన దగ్గర పనిచేసిన శిష్యుడు ఇప్పుడు దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుండటంతో కార్తీక్ సుబ్బరాజ్ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.