Reading Time: 2 minutes

రైతన్నల ఆరోగ్యంపై ఎల్‌నినో ప్రభావం.. కిడ్నీ వ్యాధులు పెరిగిపోతున్నయ్!

Caption of Image.

విశ్వరూపం దాల్చుతున్న ఎల్‌నినోతో రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల భారత వ్యవసాయ రంగానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోంది. ముఖ్యంగా ఒడిశాలోని బర్గఢ్ జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. గ్లోబల్ హీట్ హెల్త్ ఇన్ఫర్మేషన్ నెట్‌వర్క్ సౌత్ ఏషియా హబ్ విడుదల చేసిన ‘లివింగ్ విత్ హీట్ ఇన్ ఇండియా: హీట్-హెల్త్ రిస్క్, వల్నరబిలిటీ, అండ్ ఎమర్జింగ్ రెస్పాన్సెస్’ అనే నివేదిక ఈ ఆందోళనకర నిజాలను వెల్లడించింది.

ఎండ తీవ్రత పెరుగుతుండటంతో బర్గఢ్ జిల్లాలో రైతులు ప్రతిరోజూ తీవ్రమైన వేడి ఒత్తిడిని, అధిక రసాయనిక పురుగుమందుల ప్రభావం ఎదుర్కొంటున్నారట. దీనివల్ల రైతులలో డీహైడ్రేషన్, యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్లతో పాటు మూత్రపిండాల పనితీరు మందగించడం వంటి సమస్యలు విపరీతంగా పెరుగుతున్నట్లు నివేదిక స్పష్టం చేసింది. ఎండలో గంటల తరబడి పనిచేయడం వల్ల రైతుల ఆరోగ్యం తీవ్రంగా క్షీణిస్తోందని రిపోర్ట్ పేర్కొంది.

ఈ ఆరోగ్య సమస్యల్లో అత్యంత ప్రమాదకరమైనది ‘క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఆఫ్ అన్‌సొర్ట్ ఆరిజిన్’. అంటే ఎలాంటి స్పష్టమైన కారణం తెలియకుండానే వచ్చే ఈ దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి ఇప్పుడు పెద్ద ఆరోగ్య ముప్పుగా మారుతోంది రైతుల జీవితాల్లో. ఒడిశాతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, గోవా రాష్ట్రాల్లోనూ ఇలాంటి కిడ్నీ సమస్యలు పెరుగుతున్నాయని తేలింది. సెంట్రల్ అమెరికా, శ్రీలంక, ఈజిప్ట్ దేశాల్లో గుర్తించిన వ్యాధి లక్షణాలతోనే ఇక్కడి పరిస్థితులు కూడా సమానంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ఉద్దానం వంటి ప్రముఖ కిడ్ని సమస్యల హాట్‌స్పాట్‌లో 18 నుంచి 75 సంవత్సరాల వయస్సు గల కార్మికులు, రైతులపై పరిశోధనలు జరిగాయి. వ్యవసాయ పనులు, ఇటుక బట్టీలు, నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు విపరీతమైన వేడికి గురవుతున్నట్లు తేలింది. వెట్-బల్బ్ గ్లోబ్ టెంపరేచర్ 27.5 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు కష్టమైన పనులు చేసే అవుట్‌డోర్ కార్మికులకు.. తక్కువ వేడిలో పనిచేసేవారితో పోలిస్తే కిడ్నీ పనితీరు దెబ్బతినే ప్రమాదం రెట్టింపుగా ఉన్నట్లు పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి.

ALSO READ : వేడి నీళ్లుగా పసిఫిక్ మహాసముద్రం: ఎన్‌నినో ప్రళయం రాబోతుందా..!

మారుతున్న వాతావరణ పరిస్థితులు.. ఎల్ నినో తెచ్చిపెడుతున్న ఉక్కపోత అన్నదాతల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఆహార భద్రతను అందించే రైతన్నల ఆరోగ్యాన్ని కాపాడటానికి ప్రభుత్వాలు, వైద్య నిపుణులు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయాలలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. శరీర అవసరాలకు అనుగుణంగా తగిన మోతాదులో నీరు తాగుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎండలో ఎక్కువ సేపు పనులు చేయటం, తిరగటం వంటివి వీలైనంత వరకూ మానుకోవటం బెటర్ అంటున్నారు. 

©️ VIL Media Pvt Ltd.