Reading Time: 3 minutes

రెండేండ్ల తర్వాత హైదరాబాద్‌‌లో టీ20 ..నేటి (అక్టోబర్ 14) మ్యాచ్‌‌ కు భారీ భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు   

Caption of Image.
  • యాప్‌‌లో టికెట్లు ‘సోల్డ్ అవుట్’ అని చూపించడంతో 
  • ఫ్యాన్స్ ఆగ్రహంనకిలీ టికెట్‌‌ల నివారణకు బార్ కోడ్‌‌ 
  • 60 బస్సులతో ఆర్టీసీ ప్రత్యేక సేవలు, మెట్రో రైళ్ల టైం పొడిగింపు   

హైదరాబాద్ సిటీ, వెలుగు:  హైదరాబాద్‌‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం మరో హై- వోల్టేజ్ అంతర్జాతీయ సమరానికి వేదికవుతోంది. సరిగ్గా రెండేళ్ల క్రితం(2024 అక్టోబర్‌‌లో) భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఇక్కడ చివరిసారిగా టీ20 అంతర్జాతీయ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌‌లో భారత్ రికార్డు స్థాయిలో 297 పరుగులు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది.

మళ్లీ ఇన్నాళ్లకు నగరంలో భారత్, వెస్టిండీస్ మధ్య ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్ జరుగుతుండటంతో క్రికెట్ అభిమానులలో అంచనాలు తారస్థాయికి చేరాయి. ఈ క్రమంలో ఇప్పటికే దాదాపు 25 వేల టికెట్లు అమ్ముడైనట్లు హెచ్‌‌సీఏ వర్గాలు వెల్లడించాయి. అయితే, క్రికెట్ మ్యాచ్ టికెట్ల విక్రయాలు ఎప్పట్లాగే ఈసారి కూడా తీవ్ర వివాదాలకు, విమర్శలకు దారితీశాయి. సామాన్యులకు అధికారికంగా టికెట్లు దక్కకపోవడం, క్షణాల వ్యవధిలోనే ఆన్‌‌లైన్ టికెట్లు హాట్‌‌ కేకుల్లా అయిపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈసారి కొత్తగా తెరపైకి వచ్చిన ‘టికెట్ జీన్’ యాప్ వివాదం మరింత దుమారం రేపింది. యాప్ పనితీరులో లోపాలు, బ్లాక్‌‌ మార్కెట్ దందాల కారణంగా సామాన్య ప్రేక్షకులకు నిరాశే మిగిలింది.

ఈ యాప్‌‌లో టికెట్లు పెట్టిన నిమిషాల వ్యవధిలోనే సోల్డ్ అవుట్ అని చూపించడంతో క్రికెట్ క్రీడాభిమానులు హెచ్‌‌సీఏ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పేటీఎం, జొమాటో డిస్ట్రిక్ లాంటి పేరున్న యాప్స్‌‌లో టికెట్స్ పెట్టేవారు. కానీ ఈ సారి ఎవరికీ అంతగా పరిచయం లేని టికెట్ జీన్ యాప్‌‌లో పెట్టడం ఏంటని క్రికెట్ ప్రియులు ప్రశ్నించారు. అట్లాంటి యాప్ ఉందని చాలా మందికి తెలియకపోవడం.. తెలుసుకుని ఓపెన్ చేసే లోపే టికెట్లు సోల్డ్ అవుట్ అని చూపించడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. 

రూ. 750 నుంచి రూ. 20 వేల వరకు టికెట్ రేట్స్ 

హెచ్‌‌సీఏ, నిర్వాహకుల సమన్వయ లోపం కారణంగానే ప్రతిసారీ టికెట్ల కేటాయింపు వివాదాస్పదంగా మారుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డిజిటల్ స్కానర్ పద్ధతిని అమలు చేస్తున్నప్పటికీ టికెట్ల కేటాయింపులో జరుగుతున్న ఈ గోల్ మాల్‌‌పై హెచ్‌‌సీఏ స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని అభిమానులు కోరుతున్నారు. ఇండియా, వెస్టిండీస్ మ్యాచ్‌‌కు రూ. 750 నుంచి రూ. 20 వేల వరకు టికెట్ రేట్స్ ఉన్నట్లు హెచ్‌‌సీఏ తెలిపింది.

అయితే టికెట్ జీన్ యాప్ క్రెడిబిలిటీపై కూడా ఫ్యాన్స్ అనుమానం వ్యక్తం చేశారు. హెచ్‌‌సీఏ అడ్మినిస్ట్రేషన్ సభ్యులు కూడా బయట టికెట్లు అమ్ముకుంటున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. హెచ్‌‌సీఏ మాత్రం బ్లాక్ టికెటింగ్‌‌ను అరికట్టడానికే ఈ యాప్‌‌ను తీసుకొచ్చామని ఇందులో ఒక్కో వ్యక్తి కేవలం నాలుగు టికెట్లు మాత్రమే బుక్ చేసుకునేలా ఆప్షన్ ఉంచినట్లు తెలిపారు. ఫిజికల్ టికెట్లు కాకుండా పూర్తిగా మొబైల్ టు మొబైల్ ట్రాన్స్‌‌ఫర్ విధానాన్ని ప్రవేశపెట్టారు. మ్యాచ్‌‌కు సంబంధించి 2,500 టికెట్లు స్కూల్ స్టూడెంట్లకు, ఆర్మీకి 250 టికెట్లను కేటాయించినట్లు హెచ్‌‌సీఏ పేర్కొంది.  

నకిలీ టికెట్లతో వస్తే జైలుకే.. 

గతంలో ఐపీఎల్ మ్యాచ్‌‌ల సమయంలో కూడా నకిలీ వీఐపీ లెటర్ హెడ్స్ ఉపయోగించి, బార్ కోడ్స్ కాపీ చేసి నకిలీ టికెట్లు విక్రయించిన ముఠాలను రాచకొండ, ఉప్పల్ పోలీసులు పట్టుకున్నారు. ఇప్పుడు అలాంటి మోసాలు జరగకుండా మల్కాజ్‌‌గిరి పోలీస్ కమిషనరేట్ కఠిన చర్యలు తీసుకుంటోంది. ఫేస్‌‌బుక్, ఇన్‌‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్) వంటి ప్లాట్‌‌ఫారమ్‌‌లలో ఎవరైనా నకిలీ టికెట్లు విక్రయిస్తున్నారా? లేదా నకిలీ బుకింగ్ లింకులు పెట్టి మోసం చేస్తున్నారా? అనే కోణంలో పోలీసుల సైబర్ వింగ్ నిరంతరం నిఘా పెడుతోంది. స్టేడియం పరిసరాల్లో నకిలీ టికెట్లను లేదా బ్లాక్‌‌లో టికెట్లను విక్రయించే వారిని పట్టుకోవడానికి 4 ప్రత్యేక వాచ్ టీమ్స్ రంగంలోకి దిగాయి.  

పోలీసులు మఫ్టీలో తిరుగుతూ నిఘా ఉంచనున్నారు. ఉప్పల్ స్టేడియం గేట్ల వద్ద అత్యాధునిక స్కానర్లను ఏర్పాటు చేశారు. డూప్లికేట్ లేదా జిరాక్స్ కాపీ టికెట్లు, ఎడిట్ చేసిన బార్ కోడ్‌‌లను ఇవి సులువుగా గుర్తిస్తాయి. నకిలీ టికెట్లతో వస్తే గేట్ల వద్దే పట్టుబడటం ఖాయం. నకిలీ టికెట్లు తయారు చేసినా, విక్రయించినా లేదా నకిలీ ఐడీ కార్డులతో స్టేడియంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించినా వారిపై చీటింగ్ (420) ఫోర్జరీ కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని పోలీసులు హెచ్చరించారు. 

భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ ఆంక్షలు 

మ్యాచ్‌‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏకంగా 2,200  మంది పోలీసులతో పాటు, 400కు పైగా సీసీ కెమెరాలు, 8 షీ టీమ్స్‌‌తో మఫ్టీలో నిఘా ఏర్పాటు చేశారు. స్టేడియం చుట్టూ పటిష్టమైన భద్రతా వలయాన్ని సృష్టించారు. ఈ భద్రతా ఏర్పాట్లలో ఐదుగురు డిప్యూటీ కమిషనర్లు (డీసీపీలు), ఐదుగురు అదనపు డీసీపీలు, 15 మంది అసిస్టెంట్ కమిషనర్లు (ఏసీపీలు), 50 మంది ఇన్‌‌స్పెక్టర్లు, 90 మంది సబ్-ఇన్‌‌స్పెక్టర్లతో పాటు ట్రాఫిక్, ఇంటెలిజెన్స్, స్పెషల్ ఆపరేషన్స్ టీమ్స్, బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్స్, షీ టీమ్స్ ఇతర ప్రత్యేక విభాగాల సిబ్బంది ఉంటారని తెలిపారు. 10 ఆర్మ్డ్ రిజర్వ్ ప్లాటూన్లు,10 తెలంగాణ స్పెషల్ పోలీస్ ప్లాటూన్లను కూడా మోహరించారు. ఈ సారి రెండు డ్రోన్స్‌‌తో కూడా భద్రత చేపట్టనున్నారు. మరోవైపు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి స్టేడియానికి ఆర్టీసీ 60 ప్రత్యేక బస్సులను నడుపనుంది.  

బ్లాక్‌‌లో క్రికెట్ టికెట్లు.. నలుగురి అరెస్ట్‌‌

గోషామహల్, వెలుగు: ఉప్పల్‌‌ స్టేడియంలో ఈ నెల 14న భారత్‌‌–వెస్టిండీస్‌‌ జట్ల మధ్య జరగనున్న టీ20 మ్యాచ్‌‌ కాంప్లిమెంటరీ టికెట్లను బ్లాక్‌‌లో విక్రయిస్తున్న నలుగురిని గోషామహల్‌‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 11 టికెట్లు, ఐదు సెల్‌‌ఫోన్లు, దాండియా పాసులు, ద్విచక్ర వాహనం, రూ.5 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

.గోషామహల్‌‌ ఇన్‌‌స్పెక్టర్‌‌ బి. శ్రవణ్‌‌ కుమార్‌‌ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం అర్ధరాత్రి అందిన సమాచారంతో బేగంబజార్‌‌లోని ఎస్‌‌ఓ మాల్‌‌పై పోలీసులు దాడి చేశారు. ‘నాట్‌‌ ఫర్‌‌ సేల్‌‌’ అని ముద్రించిన కాంప్లిమెంటరీ టికెట్లను విక్రయిస్తున్న అవినాశ్‌‌ దరఖ్‌‌, మోహిత్‌‌ సోమానిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సేకరించిన సమాచారంతో కాచిగూడకు చెందిన ఆకర్షిత్‌‌ శ్రీవాత్సవ, నింబోలిఅడ్డకు చెందిన సతీశ్‌‌ చంద్ర శ్రీవాత్సవను కూడా అరెస్టు చేశారు. అనంతరం నలుగురినీ రిమాండ్‌‌కు తరలించారు.

©️ VIL Media Pvt Ltd.