Reading Time: 2 minutes

ఆఫీసులో సహోద్యోగి వాటర్ బాటిల్లో విషం కలుపుతూ కెమెరాకి దొరికిపోయిన ఇంజనీర్! అమెరికాలో బయటపడ్డ నేరం!

Caption of Image.

అమెరికాలోని కాలిఫోర్నియాలో ‘బర్కిలీ ఇంజనీరింగ్’ అనే సంస్థలో పనిచేస్తున్న రోంగ్ యువాన్ అనే మహిళకు 2017 నుంచి అకస్మాత్తుగా తీవ్రమైన అనారోగ్య సమస్యలు మొదలయ్యాయి. తరచూగా వాంతులు కావడం, జుట్టు విపరీతంగా ఊడిపోవడం వంటివి జరిగాయి. 2019లో ఒకరోజు ఆమె నీళ్ల బాటిల్లో నుంచి నీళ్లు తాగినప్పుడు చాలా పుల్లని రుచి వచ్చింది. ఏదో తేడాగా ఉందని అనుమానం వచ్చి, తన డెస్క్ దగ్గర ఎవరికీ తెలియకుండా ఒక సీక్రెట్ కెమెరా అమర్చింది.

కెమెరాలో దొరికిపోయిన నేరం
కెమెరా ఫుటేజ్ చూసిన ఆమె ఒక్కసారిగా  షాక్ అయ్యారు.  ఆమె సహోద్యోగి, ఇంజనీర్ అయిన డేవిడ్ జు (41) ఆమె డెస్క్ వద్దకు వచ్చి నీళ్ల సీసాను ముట్టుకోవడం రికార్డైంది. మరో రోజు, అతను ఒక డబ్బాలో నుంచి ఏదో తెల్లటి  పౌడర్ ఆమె నీళ్ల సీసాలో కలుపుతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి.

ఈ ఫుటేజ్ ఆధారంగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా, ల్యాబ్ పరీక్షల్లో ఆ నీటిలో ‘కాడ్మియం’ అనే తీవ్రమైన విష పదార్థం ఉందని తేలింది. దీనివల్ల యువాన్ మాత్రమే కాకుండా, ఇంట్లో ఆ నీళ్లు తాగిన ఆమె తల్లిదండ్రులు కూడా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.

కోర్టు కేసు & వివాదాస్పద తీర్పు
2019లో పోలీసులు డేవిడ్ జుపై ‘హత్యాయత్నం’ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అయితే, కోర్టులో ఈ కేసు దాదాపు మూడేళ్లకు పైగా సాగింది. సెప్టెంబర్ 2023లో జరిగిన ఒక ఒప్పందం ప్రకారం, అతను తన తప్పును పూర్తిగా అంగీకరించకుండానే కేవలం ఒక సంవత్సరం ఆంక్షలు పూర్తి చేసి జైలు శిక్ష నుంచి తప్పించుకున్నాడు. ఈ తీర్పుపై తీవ్ర విమర్శలు రావడంతో న్యాయమూర్తి ఆంక్షలను మరో రెండేళ్లకు పొడిగించారు.

►ALSO READ | ఫ్రాన్స్లో సైబర్ అటాక్లో పేలిపోయిన సూపర్ మార్కెట్స్ ఫ్రిడ్జ్లు.. టెంపరేచర్ను 50 డిగ్రీలకు పెంచేయడంతో..

బాధితురాలి ఆవేదన
డేవిడ్ జు 2026 మార్చి నాటికి తన శిక్ష కాలాన్ని పూర్తి చేసుకున్నాడు. ఇప్పుడు రికార్డుల నుంచి ఈ ‘నేరారోపణను పూర్తిగా తొలగించాలని’ (Expungement) కోర్టును కోరుతున్నాడు. అయితే బాధితురాలు యువాన్ మాత్రం ఇప్పటికీ కాడ్మియం విషప్రభావం వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతోంది. ఆమె తండ్రి కూడా గుండెపోటుతో చనిపోయారు. ఆ రోజు కెమెరా పెట్టకపోతే నేను చనిపోయేదాన్ని. న్యాయవ్యవస్థ నన్ను ఘోరంగా మోసం చేసింది, అతనికి ఎలాంటి కఠిన శిక్ష పడకపోవడం బాధాకరం అని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది.

 

©️ VIL Media Pvt Ltd.