Reading Time: 3 minutes
జురాసిక్ కాలం నాటి వుల్లీ మమ్మోత్‌లకు మళ్లీ ప్రాణం పోస్తున్న AI!

అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన బయోటెక్నాలజీ సంస్థ కోలోసల్ బయోసైన్సెస్ ఈ పరిశోధనలు చేస్తోంది. డైర్ వుల్ఫ్‌లు (Dire Wolves), వూల్లీ మమ్మోత్‌లు (Woolly Mammoths) ఈ అంతరించిపోయిన జంతువులను తిరిగి భూమిపైకి తీసుకురావడమే ఈ సంస్థ లక్ష్యం. ఈ ప్రయత్నాలను హాలీవుడ్‌ సినిమా *జురాసిక్ పార్క్*తో పోలుస్తున్నారు. అయితే, సినిమాలో చూపించినట్లుగా డైనోసార్లను తిరిగి సృష్టించడానికి, శాస్త్రవేత్తలు ఇప్పుడు చేస్తున్న పరిశోధనలకు చాలా తేడా ఉంది.

జురాసిక్ పార్క్ సినిమాలా కాదు.. శాస్త్రవేత్తల ప్రయత్నం!

కోలోసల్ బయోసైన్సెస్ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు బెన్ లామ్ CNBCతో మాట్లాడుతూ.. జురాసిక్ పార్క్ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయని, అయితే సినిమా కథకు, నిజ జీవిత శాస్త్రీయ పరిశోధనలకు మధ్య తేడా ఉందని వివరించారు. డైనోసార్ల DNA లక్షలాది సంవత్సరాల పాటు చెక్కుచెదరకుండా ఉండే అవకాశం చాలా తక్కువ. కాలక్రమేణా DNA విచ్ఛిన్నమై, దాని అసలు జన్యు సమాచారం నశిస్తుంది. అందువల్ల పదుల కోట్ల సంవత్సరాల క్రితం జీవించిన డైనోసార్లను తిరిగి సృష్టించడం సాధ్యం కాదని అన్నారు.

అందుకే పరిశోధకులు ఇటీవల సమీప కాలంలోఅంతరించిపోయిన జంతువులపై దృష్టి పెట్టారు. డైర్ వుల్ఫ్‌, వూల్లీ మమ్మోత్‌తో పాటు డోడో పక్షి, టాస్మానియన్ టైగర్, న్యూజిలాండ్‌కు చెందిన భారీ మోవా పక్షిని తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే ఒకటి, రెండేళ్లలో అంతరించిపోయిన జాతులను తిరిగి తీసుకొచ్చే ప్రయత్నాల్లో మరింత పురోగతి కనిపించవచ్చని బెన్ లామ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

AI సాయంతో డైర్ వుల్ఫ్‌ల జన్యు సమాచారం పునర్నిర్మాణం

డైర్ వుల్ఫ్‌లు వేల సంవత్సరాల క్రితం జీవించిన తోడేళ్లు. ఇవి 12,500 సంవత్సరాల క్రితం అంతరించిపోయాయి. ఈ జంతువులను తిరిగి సృష్టించే ప్రయత్నంలో భాగంగా పరిశోధకులు పురాతన శిలాజ పుర్రె, దంతాల నుంచి లభించిన DNA నమూనాలను సేకరించారు. అయితే, ఇంత పురాతనమైన DNA పూర్తిగా ఒకే రూపంలో ఉండదు. అది చిన్న చిన్న భాగాలుగా విచ్ఛిన్నమై ఉంది. ఈ సమస్యను అధిగమించేందుకు శాస్త్రవేత్తలు అధునాతన AI నమూనాలను ఉపయోగించి DNA భాగాలను విశ్లేషించారు. వాటి ఆధారంగా డైర్ వుల్ఫ్ జన్యు సమాచారాన్ని పునర్నిర్మించారు. అనంతరం దాని జన్యు సమాచారాన్ని ప్రస్తుతం జీవించి ఉన్న దగ్గరి బంధువు అయిన గ్రే వుల్ఫ్ (Gray Wolf) జన్యు సమాచారంతో పోల్చారు. తర్వాత ఆధునిక గ్రే వుల్ఫ్ కణాల్లో జన్యు మార్పులు చేసి, అవసరమైన లక్షణాలను అభివృద్ధి చేసే దిశగా ప్రయోగాలు నిర్వహించారు. వాటి నుంచి రూపొందించిన పిండాలను సరోగేట్ తల్లులుగా పని చేసిన పెంపుడు కుక్కల గర్భాల్లో ప్రవేశపెట్టారు.ఈ ప్రక్రియ ద్వారా రోములస్, రెమస్, ఖలీసీ అనే మూడు పిల్లలు జన్మించాయి.

అయితే, ఈ పిల్లలు పూర్తిగా అసలైన డైర్ వుల్ఫ్‌లు కావని, జన్యు మార్పులు చేసిన ఆధునిక గ్రే వుల్ఫ్‌లని కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. దీనిపై బెన్ లామ్ స్పందిస్తూ.. ప్రకృతిలో జరిగిన పరిణామాల ద్వారా గ్రే వుల్ఫ్‌లు మారినట్లే, శాస్త్రవేత్తలు కూడా జన్యు మార్పుల ద్వారా పురాతన జంతువుల లక్షణాలను తిరిగి తీసుకొస్తున్నట్లు తెలిపారు.

వూల్లీ మమ్మోత్‌ను కూడా తిరిగి తీసుకొస్తారా?

డైర్ వుల్ఫ్‌లతో పాటు వూల్లీ మమ్మోత్‌లను తిరిగి తీసుకొచ్చే ప్రాజెక్టు పైనా కోలోసల్ బయోసైన్సెస్ పనిచేస్తోంది. వూల్లీ మమ్మోత్‌లు మంచుతో కప్పబడిన చల్లని ప్రాంతాల్లో జీవించిన భారీ జంతువులు. ఇవి ఆధునిక ఏనుగులకు దగ్గరి బంధువులు. వీటి శరీరంపై దట్టమైన వెంట్రుకలు, చలిని తట్టుకునే లక్షణాలు ఉండేవి.ఈ లక్షణాలను తిరిగి అభివృద్ధి చేసేందుకు ఆధునిక ఆసియా ఏనుగుల కణాల్లో మమ్మోత్‌లకు సంబంధించిన చలిని తట్టుకునే జన్యు లక్షణాలను ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా 2030 నాటికి తొలి మమ్మోత్‌ను పుట్టించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ ప్రయోగాల వెనుక మరో లక్ష్యం.. వాతావరణ మార్పుల నియంత్రణ!

అంతరించిపోయిన జంతువులను తిరిగి తీసుకురావడం వెనుక కేవలం శాస్త్రీయ ఆసక్తి మాత్రమే లేదని బెన్ లామ్ చెబుతున్నారు. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడంలోనూ ఇవి సహాయపడవచ్చు అన్నది ఆయన అభిప్రాయం. ఆర్కిటిక్ ప్రాంతాల్లో భూమి లోపల శాశ్వతంగా గడ్డకట్టిన నేలను పెర్మాఫ్రాస్ట్ (Permafrost) అంటారు. భూమి వేడెక్కడం వల్ల ఈ నేల కరిగితే, అందులో నిల్వ ఉన్న కార్బన్ విడుదలయ్యే ప్రమాదం ఉంది. ఇది వాతావరణ మార్పులను మరింత తీవ్రతరం చేయవచ్చు. మమ్మోత్‌లు వంటి భారీ జంతువులు మంచుపై నడుస్తూ దాన్ని గట్టిగా కుదపగలవనీ మంచు పొరల ద్వారా చల్లని గాలి నేలలోకి మరింత లోతుగా చేరి, పెర్మాఫ్రాస్ట్ గడ్డకట్టిన స్థితిలో ఉండేందుకు సహాయపడవచ్చనేది ఒక అంచనా.

అలాగే, ఈ జంతువులు చెట్లను కూల్చడం, పొదలను తొక్కడం ద్వారా అడవుల విస్తరణను తగ్గించి, గడ్డి మైదానాలు ఏర్పడటానికి దోహదపడతాయనీ భావిస్తున్నారు. మంచు, గడ్డి మైదానాలు సూర్యరశ్మిని ఎక్కువగా ప్రతిబింబించే అవకాశం ఉండటంతో ప్రాంతీయ ఉష్ణోగ్రతలపై ప్రభావం పడవచ్చు.

2019లో మొదలైన ఆలోచన.. ఇప్పుడు ప్రయోగాల దశలో!

ఈ ప్రాజెక్టుకు 2019లో పునాది పడింది. ఈ సాంకేతికత భవిష్యత్తులో వైద్య రంగంలోనూ ఉపయోగపడే అవకాశం ఉంది. జన్యువులను నియంత్రించడం, కణాల్లో నిర్దిష్ట మార్పులు చేయడం వంటి అంశాలపై మరింత అవగాహనకు ఈ ప్రయోగాలు ఉపయోగపడవచ్చు. AI, DNA పరిశోధనలు, జన్యు సవరణ సాంకేతికతలు అంతరించిపోయిన జంతువుల లక్షణాలను తిరిగి తీసుకొచ్చే దిశగా కొత్త అవకాశాలను తెరుస్తున్నాయి. అయితే, ఇవి పూర్తిగా అంతరించిపోయిన జంతువులనే తిరిగి సృష్టిస్తున్నాయా, లేక వాటిని పోలిన జన్యు మార్పిడి జీవులను తయారు చేస్తున్నాయా అనే ప్రశ్నకు శాస్త్రీయంగా స్పష్టత రావాల్సి ఉంది. జురాసిక్ పార్క్ తరహా అద్భుతాలు నిజమవుతాయా లేదా అన్నది పక్కన పెడితే.. ఈ పరిశోధనలు భవిష్యత్తు జీవశాస్త్రంలో చట్టాల రూపకల్పనకు కీలక చర్చకు దారితీస్తున్నాయి.