Reading Time: 2 minutes

రషీద్‌ భాయ్ సైడ్ హటో.. ఆఫ్ఘన్ జట్టుకు కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

Caption of Image.

ఆసియా క్రీడల 2026 కోసం ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు (ACB) 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఈరోజు (సోమవారం, ఆగస్టు 17) ప్రకటించింది. సెప్టెంబర్‌లో జపాన్ వేదికగా ప్రారంభం కానున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి దార్విష్ రసూలీని కెప్టెన్‌గా నియమించారు. అయితే, ఈ ప్రకటనలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన విషయం స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ లేకపోవడమే. ఆసియా క్రీడల కోసం రషీద్ ఖాన్‌తో పాటు అజ్మతుల్లా ఒమర్‌జాయ్, రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ లాంటి సీనియర్ ఆటగాళ్లకు బోర్డు రెస్ట్ ఇచ్చింది. 

కొత్త, పాత ఆటగాళ్లకి ఛాన్స్: 

దార్విష్ రసూలీ సారథ్యంలో బరిలోకి దిగుతున్న ఈ జట్టులో కొత్త ప్రతిభ, అనుభవజ్ఞులైన ఆటగాళ్ల కలబోత స్పష్టంగా కనిపిస్తోంది. సీనియర్ ఆటగాళ్ల జాబితాలో నజీబుల్లా జద్రాన్, కరీమ్ జనత్ మాత్రమే చోటు దక్కించుకున్నారు. ఇటీవల ముగిసిన షపగీజా క్రికెట్ లీగ్ 2026లో అద్భుత ప్రదర్శన చేసిన యువ ఆటగాళ్లకు ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు పెద్ద పీట వేసింది. ఈ లీగ్‌లో 339 పరుగులు సాధించిన మహమ్మద్ అక్రమ్, 294 పరుగులతో పాటు 9 వికెట్లు పడగొట్టిన ఇస్మత్ ఆలమ్‌లు తమ డొమెస్టిక్ ప్రదర్శనతో ఆసియా క్రీడల జట్టులో స్థానం సంపాదించుకున్నారు.

భారత్‌పై మెరిసిన ఖరోతీకి ఛాన్స్: 

ఇటీవల భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో తన స్పిన్ ధాటితో ఆకట్టుకున్న లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ నంగ్యాల్ ఖరోతీకి కూడా ఈ 15 మంది జట్టులో చోటు లభించింది. ఇండియాపై ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఖరోతీ 4 వికెట్లు తీసి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. 2022 ఆసియా క్రీడల్లో ఆఫ్ఘనిస్థాన్ రజత పతకం (సిల్వర్ మెడల్) సాధించింది. ఆసారి ఫైనల్ మ్యాచ్ వర్షంతో రద్దవ్వడంతో ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా భారత్‌కు స్వర్ణం, ఆఫ్ఘనిస్థాన్‌కు రజతం లభించాయి. ఈసారి కొత్త కెప్టెన్ రసూలీ నాయకత్వంలో యువ జట్టుతో జపాన్‌లో అడుగుపెట్టి మరోసారి పతకం సాధించడమే లక్ష్యంగా ఆఫ్ఘనిస్థాన్ బరిలోకి దిగుతోంది.

ALSO READ : అందరం కలిసి కత్తులు తిప్పుదాం: జడ్డూని టీజ్ చేసిన పంత్, సర్ఫరాజ్.. స్టంప్ మైక్ కామెంట్స్ వైరల్‌!

ఆఫ్ఘనిస్థాన్ జట్టు ఇదే: 

దార్విష్ రసూలీ (కెప్టెన్), మహమ్మద్ ఇషాక్ (వికెట్ కీపర్), మహమ్మద్ అక్రమ్, హసన్ ఈసాఖిల్, ఖాలిద్ తనివాల్, ఇమ్రాన్ మీర్, ఫైసల్ ఖాన్ షినోజాదా, నజీబుల్లా జద్రాన్, ఫర్మానుల్లా సఫీ, ఇస్మత్ ఆలమ్, కరీమ్ జనత్, నంగ్యాల్ ఖరోతీ, అరబ్ గుల్ మోమండ్, ఫరీదూన్ దావూద్‌జాయ్, అబ్దుల్లా అహ్మద్‌జాయ్.

 

 

©️ VIL Media Pvt Ltd.