Reading Time: < 1 minute
All in One App: డిజిటల్ వేదికపైకి ప్రజారవాణా సేవలు.. ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ సేవలు ఒకే యాప్‌లో..!

All in One App: ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలతో ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలు అందిస్తోన్న టీజీఎస్ ఆర్టీసీ రాష్ట్రంలో ప్రజారవాణా వ్యవస్థను మరింత ఆధునికీకరించింది. ప్రయాణికులకు వేగవంతమైన, సులువైన సేవలు అందించేందుకు మీసేవ ద్వారా వినూత్నంగా మీటికెట్ ((MeeTicket) యాప్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ప్రయాణ రంగానికి సంబంధించిన అన్ని రకాల సేవలను ఒకే డిజిటల్ గొడుగు కిందికి తీసుకురావడమే లక్ష్యంగా ఈ యాప్‌ను రూపొందిస్తున్నారు.

ఆర్టీసీ,మెట్రో ,ఆటోలు, క్యాబ్స్ వంటి అన్ని ప్రధాన రవాణా వ్యవస్థలు ఈ యాప్‌లో అనుసంధానమవుతాయి. ప్రయాణికుడు ఒకే చోట ఆర్టీసీ లేదా మెట్రో టికెట్‌తో పాటు, తన గమ్యస్థానానికి తగినట్లుగా ఆటో లేదా క్యాబ్‌ను కూడా ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు.

ప్రయాణికులు చెల్లించిన రుసుమును ఆయా రవాణా భాగస్వాములకు ఎప్పటికప్పుడు ఆటోమేటిక్‌గా జమ చేసే ఆధునిక చెల్లింపుల వ్యవస్థ ఇందులో అందుబాటులో ఉంటుంది. మీటికెట్ అనేది ఒక ఉమ్మడి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌గా పనిచేస్తుంది. దీని ద్వారా ఆటో క్యాబ్ డ్రైవర్లతో పాటు ఇతర రవాణాదారులు భాగస్వాములుగా చేరి, ప్రయాణికులకు నేరుగా సేవలు అందించి లబ్ధి పొందవచ్చు.

వినియోగదారుడు తనకు కావలసిన రవాణా విధానాన్ని ఎంచుకుని, ఒకే టికెట్ ద్వారా ప్రయాణ అనుభవాన్ని పొందేందుకు ఈ విధాసం దోహదపడుతుంది. అదేవిధంగా ప్రయాణికుడు చెల్లించిన డబ్బు ఆయా రవాణా విభాగాలకు ఎప్పటికప్పుడు చెల్లించడం జరుగుతుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి