
హైదరాబాద్ పరిధిలోని దాదాపు 38 వేల భూకమతాలను నిషేధిత భూముల జాబితా (22A) నుంచి త్వరలోనే తొలగించి విముక్తి కల్పిస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. సచివాలయంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల సొంత, ప్రైవేటు ఆస్తుల రిజిస్ట్రేషన్లకు ఆటంకాలు కలిగిస్తూ ఇబ్బందులకు గురిచేయడం తమ ప్రభుత్వ ఉద్దేశం కాదని ఆయన స్పష్టం చేశారు. గతంలో అధికారుల పొరపాట్ల వల్ల, పాత జాబితాలను అప్ డేట్ చేయకుండా సమర్పించడం వల్లే ఈ సమస్య తలెత్తిందని, దీనిని యుద్ధప్రాతిపదికన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన 757 దరఖాస్తులలో మేడ్చల్ జిల్లా నుంచే అత్యధికంగా 511 దరఖాస్తులు అందాయని, అందులో మెజార్టీ దరఖాస్తులు నిజమైన ప్రైవేటు ఆస్తులుగా పరిశీలనలో తేలాయని మంత్రి వివరించారు. ఈ 22ఏ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ఇద్దరు అధికారులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశామని, ఈ కమిటీ వారానికోసారి సమీక్ష జరుపుతుందని తెలిపారు. భూ యజమానులు కోర్టుల చుట్టూ లేదా ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా, ఒక చిన్న దరఖాస్తు ఇస్తే సరిపోతుందని, అర్హత ఉన్న ప్రాపర్టీలను ప్రభుత్వమే సుమోటోగా నిషేధిత జాబితా నుంచి తొలగిస్తుందని పేర్కొన్నారు.
బాధితులను అనవసరంగా కార్యాలయాల చుట్టూ తిప్పించుకునే అధికారులపై స్పాట్‌లోనే తీవ్ర చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి హెచ్చరించారు. ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కోసం 18005994788 టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. దేవాదాయ, వక్ఫ్, ఫారెస్టు మరియు భూసేకరణ కారణాలతో బ్లాక్ అయిన భూముల సమస్యలను కూడా సమగ్రంగా పరిశీలించి న్యాయమైన ఆస్తులకు పూర్తి భద్రత మరియు క్లియరెన్స్ కల్పిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.