భారతీయ సంస్కృతిలో నాగుపాములకు ప్రత్యేక స్థానం ఉంది. నాగపంచమి నాడు పాములను పూజించడం, వాటికి సంబంధించిన అనేక కథలు, నమ్మకాలు సమాజంలో ప్రచారంలో ఉన్నాయి. అయితే పాములకు సంబంధించి తరచూ అందరినీ ఆశ్చర్యపరిచే ఒక ప్రశ్న.. అవి ఆహారం లేకుండా ఎన్ని రోజులు బతకగలవు? మనుషులు కొన్ని గంటలు ఆహారం తీసుకోకపోతేనే నీరసించిపోతారు. కానీ పాములు మాత్రం నెలల తరబడి, కొన్ని సందర్భాల్లో ఏళ్ల పాటు ఏమీ తినకుండానే ప్రాణాలతో ఉండగలవు. దీని వెనుక ఉన్న అసలు సైన్స్ గురించి చాలా మందికి తెలియదు.
సాధారణంగా ఒక ఆరోగ్యకరమైన పాము 6 నుంచి 12 నెలల పాటు ఆహారం లేకుండా జీవించగలదు. ఇది పాము పరిమాణం, వయస్సు, జాతి, అది తీసుకున్న చివరి భోజనంపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు పెద్ద కొండచిలువలు ఏడాదికి పైగా తిండి లేకుండా ఉండగలవు. కాన్ స్నేక్ వంటి చిన్న జాతులు 3 నుండి 4 నెలల వరకు ఆకలిని తట్టుకుంటాయి. కొన్ని ప్రత్యేక జాతుల పాములు ఏకంగా రెండేళ్ల పాటు ఆహారం లేకుండా బతకగలవని శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడైంది.
పాములు ఎక్కువ కాలం ఆకలితో జీవించగలగడానికి ప్రధాన కారణం వాటి శరీర జీవక్రియ. 2007లో అమెరికాకు చెందిన పరిశోధకుడు మార్షల్ మెక్యూ రాట్ స్నేక్, రాటిల్ స్నేక్, బాల్ పైథాన్ వంటి 62 పాములపై ఆరు నెలల పాటు అధ్యయనం చేశారు. ఈ సమయంలో ఆ పాములు తమ మెటబాలిజం రేటును ఏకంగా 72 శాతానికి తగ్గించుకున్నాయి. అంటే శరీరానికి అవసరమైన శక్తిని అత్యల్ప స్థాయికి పరిమితం చేసుకుని, శరీరంలో నిల్వ ఉన్న కొవ్వును చాలా నెమ్మదిగా కరిగించుకుంటాయి. అంతేకాదు తిండి లేకపోయినా వాటి పొడవు తగ్గకపోగా, కొవ్వు శక్తితోనే శరీరం పెరగడం శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరిచింది.
ఆహారం దొరకనప్పుడు పాము శరీరం ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తుంది. మొదట శరీరంలో నిల్వ ఉన్న కొవ్వును కరిగించి శక్తిగా మారుస్తుంది. ఆ కొవ్వు కూడా పూర్తిగా కరిగిపోతే, రాట్ స్నేక్ వంటి కొన్ని జాతులు శరీరంలోని ప్రొటీన్లను విచ్ఛిన్నం చేసి శక్తిని పొందుతాయి. ఇక చలికాలంలో పాములు బ్రూమేషన్ అనే నిద్రాణ స్థితిలోకి వెళ్లిపోతాయి. ఈ సమయంలో అవి ఆహారం తీసుకోవడం పూర్తిగా ఆపేసి, శరీర కదలికలను నెమ్మదింపజేసి చలికాలాన్ని గడిపేస్తాయి.
పాములు ఆహారం లేకుండా నెలల తరబడి జీవించగలవు కానీ నీరు లేకుండా ఎక్కువ రోజులు బతకలేవు. మెటబాలిజం తగ్గించుకోవడం వల్ల క్యాలరీల అవసరాన్ని వాయిదా వేయగలిగినా, శరీరానికి నీరు మాత్రం తప్పనిసరి. అందుకే ఆహారం లేకపోయినా బతికే పాములు, నీరు దొరక్కపోతే కొన్ని వారాల్లోనే చనిపోయే ప్రమాదం ఉంది. అందుకే అడవుల్లో ఉండే పాములు సాధారణంగా ఏదో ఒక నీటి వనరు సమీపంలోనే తమ ఆవాసాలను ఏర్పాటు చేసుకుంటాయి.




