
దేశంలోని మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. వాటిల్లో అద్బుతమైన పథకం ఒకటి ఉంది. అదే ఉద్యోగిని యోజన స్కీమ్. చిన్న వ్యాపారం స్టార్ట్ చేయాలనుకునే మహిళలకు ఈ పథకం బాగా ఉపయోగపడుతుంది. మహిళలు ఆర్ధికంగా ఎదిగేందుకు కేంద్రం సహాకారం అందిస్తోంది. మహిళలు ఏదైనా కొత్త వ్యాపారం మొదలుపెట్టాలనుకున్నా లేదా ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని మరింత విస్తరించాలనుకున్నా ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. కేంద్రం రూ.3. లక్షల వరకు ఎలాంటి తాకట్టు లేకుండా రుణం మంజూరు చేస్తోంది. ఈ పథకానికి ఎవరు అర్హులు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి? నిబంధనలు ఏంటి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
వడ్డీలో రాయితీ పొందవచ్చు..
చేతివృత్తులు, కుట్టుపని, ఆహార పదార్థాల తయారీ, చిన్న దుకాణాలు లాంటి చిన్న వ్యాపారాలు మొదలుపెట్టాలని చాలామంది మహిళలకు ఉంటుంది. కానీ పెట్టుబడి పెట్టడానికి నిధులు ఉండవు. అలాంటివారి కోసం ఈ పధకం కేంద్రం అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా మహిళలు ఎలాంటి ఆస్తులు తాకట్టు పెట్టకుండా బ్యాంక్ నుంచి రూ.3 లక్షల రుణం పొందవచ్చు. అలాగే సబ్సిడీని కూడా పొందే అవకాశం ఇందులో ఉంది. ఇక సాధారణ మహిళలు 30 శాతం వరకు రుణ రాయితీ పొందవచ్చు. ఇక షెడ్యూల్డ్ కులాలకు చెందిన మహిళలు 50 శాతం వరకు సబ్సిడీ పొందే అవకాశముంది. ఇక వితంతువులు, దివ్యాంగులకు ప్రత్యేక వడ్డీ రాయితీ సౌకర్యం ఉంది. ఈ స్కీమ్ 88 రకాల చిన్న వ్యాపారాలకు వర్తిస్తుంది.
పధకం అర్హతలు ఏంటి..?
వయస్సు 18 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు మించి ఉండకూడదు. వితంతువులు, నిరుపేదలు, అంగవైకల్యం ఉన్న మహిళలకు ఈ ఆదాయ పరిమితి నుంచి మినహాయింపులు ఉంటాయి. అలాగే దరఖాస్తు చేసుకునే మహిళలకు మంచి లోన్ హిస్టరీ అనేది ఉండాలి. గతంలో ఏదైనా బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని తిరిగి చెల్లించకపోతే ఈ రుణం ఇవ్వరు. దరఖాస్తు చేసేముందు మీ రుణ అర్హతను తెలుసుకోవాలి. దరఖాస్తు చేసుకునేందుకు ఆధార్, ఓటర్ ఐడీ, ఇన్‌కమ్ సర్టిఫికేట్, పాస్ పోర్ట్ సైజు ఫొటో వంటివి ఉండాలి. ఇక వ్యాపారాన్ని సంబంధించి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉండాలి. మహిళలు తమ సమీపంలోని ఏదైనా బ్యాంకుకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఉమాంగ్ యాప్, పోర్టల్ ద్వారా ఈ పథకానికి సంబంధించి వివరాలు పొందవచ్చు.