Reading Time: < 1 minute

అనసూయపై పీఎస్‌లో బీజేపీ నేతల ఫిర్యాదు.. హిందువుల మనోభావాలను దెబ్బతీశాయంటూ ఫైర్!

Caption of Image.

టాలీవుడ్ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. హిందూ మతాన్ని కించపరిచేలా ఆమె వ్యాఖ్యలు చేస్తున్నారని హిందూ సంఘాలు, బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఆమె వ్యాఖ్యలు కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీశాయంటూ బీజేపీ నేతలు హైదరాబాద్‌లోని బోరబండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. అటు సోషల్ మీడియాలో అనుకూల, వ్యతిరేక వాదనలు హోరెత్తుతున్నాయి. 

ఇటీవల ‘జై శ్రీరామ్’ పేరుతో కొందరు దాడులకు పాల్పడుతున్నారంటూ అనసూయ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకున్నారంటూ మండిపడుతున్నారు. అటు అనసూయపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.  అనసూయపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరిన బీజేపీ నేతలు.. సోషల్ మీడియాలో మతపరమైన అంశాలపై మాట్లాడేటప్పుడు బాధ్యతగా వ్యవహరించాలని హెచ్చరించారు.

మరోవైపు అనసూయ మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నట్టుగా స్పందించారు. తన మాటలను కొందరు ఉద్దేశపూర్వకంగా వక్రీకరిస్తూ, అసలు ఉద్దేశానికి భిన్నమైన కథనాన్ని సృష్టిస్తున్నారని ఆమె స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. తాను ఏ మతాన్నీ, సమాజాన్నీ లేదా విశ్వాసాన్నీ కించపరిచే ఉద్దేశంతో మాట్లాడలేదని క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు, తన వ్యాఖ్యలు ఒక నిర్దిష్ట వర్గంలోని వ్యక్తుల ప్రవర్తన గురించేనని పేర్కొన్నారు.

ALSO READ : బిగ్ బాస్ బ్యూటీకి ఒళ్లు గగుర్పొడిచే టాస్క్..

ఇది అనసూయకు ఎదురైన తొలి పోలీస్ వివాదం మాత్రం కాదు. 2026 జనవరిలోనూ ఆన్‌లైన్ వేధింపులపై ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా, పలువురిపై కేసులు నమోదయ్యాయి . అయితే ఇప్పుడు బోరబండ ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నదే ఆసక్తికరంగా మారింది. విచారణలో అనసూయకు నోటీసులు వెళ్తాయా? కేసు ఏ మలుపు తిరుగుతుంది? అన్నది ఉత్కంఠగా మారింది.
 

©️ VIL Media Pvt Ltd.