
తెలంగాణలో చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో అత్యంత కీలకమైన మొదటి దశ విజయవంతంగా పూర్తయింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ముసాయిదా ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పారదర్శకమైన, సమగ్రమైన ఓటర్ల జాబితాను సిద్ధం చేయడమే లక్ష్యంగా ఈ భారీ కసరత్తును నిర్వహించారు. ఈ ప్రక్రియలో భాగంగా అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి మొత్తం 3 కోట్ల38 లక్షల 26 వేల448 మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ పత్రాలను అందజేశారు. అందులో 2,64,87,213 మంది, అంటే దాదాపు 78.30 శాతం మంది పత్రాలను పూర్తి చేసి తిరిగి అధికారులకు సమర్పించారు. ఈ విచారణలో సుమారు 2.73 శాతం మంది ఓటర్లు చనిపోయినట్లు తేలగా, ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఓటు హక్కు కలిగి ఉన్నవారు 6,70,203 మంది (1.98%) ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
92 లక్షల మందికి నోటీసులు
డేటా పరిశీలన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 60 లక్షల మంది అనామలీస్ ఓటర్లుగా తేలగా, మరో 32 లక్షల మంది సరైన మ్యాపింగ్ చేసుకోలేదని స్పష్టమైంది. దీంతో మొత్తం 92 లక్షల మందికి నోటీసులు జారీ చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. తాము ఏ కారణంతో నోటీసు ఇస్తున్నామనే విషయాన్ని నోటీసులోనే స్పష్టంగా పేర్కొంటామని అధికారులు వెల్లడించారు. నోటీసులు అందుకున్న పౌరులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా సంబంధిత గుర్తింపు, ధ్రువీకరణ పత్రాలను అధికారులకు సమర్పించి తమ ఓటు హక్కును క్రమబద్ధీకరించుకోవాలని సూచించారు.
సర్ జాబితాలో మీ పేరు ఉందా.. లేదా అనేది ఈ లింక్‌పై క్లిక్ చేసి చెక్ చేసుకోండి..
ఓటు తొలగింపు లేదా మార్పులపై ప్రజలకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేసేందుకు ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు నెల రోజుల పాటు గడువు కల్పించారు. వచ్చిన అభ్యంతరాలు, క్లెయిమ్‌లను ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 15 వరకు అధికారులు సమగ్రంగా పరిశీలిస్తారు. అన్ని సవరణలు పూర్తి చేసిన అనంతరం అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేయనున్నారు. ఈ మొత్తం SIR ప్రక్రియలో క్షేత్రస్థాయి పరిశీలన, డేటా నమోదు కోసం రెండు వేలకు పైగా అధికారులు నిరంతరం శ్రమిస్తున్నారు.