Reading Time: < 1 minute

రెండో పెళ్లి చేసుకుంటే జీతంలో 20 శాతం  కట్.. ఆ మొత్తం మొదటి భార్య ఖాతాలో జమ    

Caption of Image.

  గువహటి: చట్టప్రకారం విడాకులు తీసుకోకుండానే మొదటి భార్యను వదిలేసి, రెండో వివాహం చేసుకునే ప్రభుత్వ ఉద్యోగులపై అస్సాం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది. ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడే ఉద్యోగుల జీతంలో 20 శాతం కోత విధించనున్నట్లు ప్రకటించింది. ఈ విషయమై సీఎం హిమంత బిశ్వ శర్మ సోమవారం మీడియాతో మాట్లాడుతూ ‘మొదటి భార్యకు చట్టపరంగా విడాకులు ఇవ్వకుండా కొందరు ప్రభుత్వ ఉద్యోగులు అనధికారికంగా మరో వివాహం చేసుకుంటున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఇలాంటి కేసుల్లో మొదటి భార్య ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే, సదరు ఉద్యోగి వేతనంలో 20 శాతం కోత విధించి నేరుగా ఆమె బ్యాంకు ఖాతాలోనే జమ చేస్తాం’ అని స్పష్టం చేశారు.

కోర్టులో కేసు పెండింగ్‌‌‌‌లో ఉన్నా.. తుది తీర్పు వచ్చేవరకు మొదటి భార్య ఆర్థిక ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అంతేకాకుండా సర్వీసు నిబంధనలు, చట్టాలను ఉల్లంఘించిన ఉద్యోగులపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని తెలిపారు. ఈ నిబంధనలను కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా, ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులకు కూడా వర్తింపజేసేలా త్వరలో ఒక చట్టాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం యోచిస్తోందని సీఎం తెలిపారు. అస్సాంలో ఇప్పటికే బహుభార్యత్వాన్ని నిషేధిస్తూ సివిల్ చట్టాల ద్వారా కఠిన చర్యలు తీసుకుంటోంది. 
 

©️ VIL Media Pvt Ltd.