Reading Time: 2 minutes

భారతీయ టెకీలకు బిగ్ షాక్: ఈబీ-1ఏ వీసా అప్రూవల్స్ రేటు 35 శాతానికి పడిపోయాయ్

Caption of Image.

అమెరికాలో గ్రీన్ కార్డ్ పొందాలనుకునే భారతీయ టెకీలు, నిపుణులకు తీవ్ర నిరాశ ఎదురుకానుంది. ప్రత్యేక ప్రతిభావంతులకు ఇచ్చే EB-1A వీసాల ఆమోద రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో దారుణంగా పడిపోయింది. గత ఆర్థిక సంవత్సరంలో 49.1 శాతంగా ఉన్న ఈ ఏటు ప్రస్తుతం 35 శాతానికి పడిపోవటం చాలా మందిని నిరాశకు గురిచేస్తోంది. 

గతేడాది భారతీయుల నుంచి 14వేల 250 ఈబీ-1ఏ దరఖాస్తులు అందగా.. అందులో 6వేల 993 ఆమోదం పొందగా వెయ్యి474 తిరస్కరణకు గురయ్యాయని బౌండ్‌లెస్ ఇమ్మిగ్రేషన్ సంస్థ లెక్కలు బయటపెట్టాయి. కానీ 2026 ఆర్థిక సంవత్సరం తొలి 2 త్రైమాసికాల్లో 7వేల 316 దరఖాస్తులు రాగా.. కేవలం 2వేల 571 మాత్రమే క్లియర్ అయ్యాయి. మరోవైపు 1,131 దరఖాస్తులు తిరస్కరించబడ్డాయి. ఈ దరఖాస్తుల్లో ఎక్కువ భాగం టెక్నాలజీ నిపుణులవే ఉన్నారు.

ఈ పరిస్థితికి ప్రధాన కారణం డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ విధానాలే. అమెరికా కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత..  నైపుణ్య వలసలపై నిఘా పెంచడంతోపాటు నిబంధనలను అత్యంత కఠినతరం చేసింది. గతంలో యూఎస్‌సీఐఎస్ నిర్దేశించిన 10 ప్రమాణాలలో కేవలం మూడింటిని చూపిస్తే వీసా లభించేది. కానీ ఇప్పుడు ప్రతిష్టాత్మక సంస్థల్లో కీలక పాత్ర పోషించడం, సమాజంలో అత్యధిక వేతనం అందుకోవడం వంటి రెండు అర్హతలు తప్పనిసరిగా మారాయి. 

భారతీయులపై దీని తీవ్ర ప్రభావం:

ఈ పరిణామాలు H-1B వీసాలపై అమెరికాలో ఉంటూ, ఈబీ-2, ఈబీ-3 కేటగిరీల్లో దశాబ్దాల తరబడి బ్యాక్‌లాగ్‌లో మగ్గిపోతున్న భారతీయ టెకీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కఠినమైన నిబంధనలతో ప్రతిభ ఉన్నప్పటికీ చాలామందికి నిరాశే ఎదురవుతోంది. ఆశించిన గ్రీన్ కార్డ్ అందకపోవడంతో భారతీయ నిపుణులు తీవ్ర నిరుత్సాహానికి, మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.

►ALSO READ | లీవ్ పాలసీ మార్చేసిన యాక్సెంచర్.. సెలవులు తీసుకోవద్దంటూ టెక్కీలకు రిక్వెస్ట్

పరిస్థితులు ఇలాగే కొనసాగుతుండటంతో కొందరు ఉద్యోగులు అమెరికాను వీడి కెనడా గ్లోబల్ టాలెంట్ స్ట్రీమ్, యూకే గ్లోబల్ టాలెంట్ వీసాలను ఆశ్రయిస్తున్నారు. మరికొందరు బ్రతుకుదెరువు కోసం తిరిగి భారత్‌కు రావడం లేదా గ్లోబల్ కంపెనీల ద్వారా విదేశాలకు వెళ్లే మార్గాలను అన్వేషిస్తున్నారు. మొత్తంగా చూస్తే.. అమెరికాలో శాశ్వత స్థిరనివాసం ఏర్పాటు చేసుకోవాలనుకునే భారతీయ టెకీల కల ప్రస్తుత వాతావరణంలో అసాధ్యంగా కనిపిస్తోంది.

©️ VIL Media Pvt Ltd.