
దేశంలో విమాన టికెట్ ధరలు, సర్జ్ ప్రైసింగ్, అదనపు లగేజీ ఛార్జీలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం నిర్దేశించిన ధరల నిబంధనలను పాటించని ఎయిర్‌లైన్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వాటిని గ్రౌండ్ చేయాలని కేంద్రానికి సూచించింది. ఇదే సమయంలో విమాన ఛార్జీలకు సంబంధించి తుది నిబంధనలను మూడు వారాల్లోగా నోటిఫై చేస్తామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.
కేంద్రం ప్రతిపాదించిన కొత్త విమాన ఛార్జీల నిబంధనలను సోమవారం సుప్రీంకోర్టుకు సీల్డ్ కవర్‌లో సమర్పించింది. నిబంధనల రూపకల్పన ప్రక్రియను వేగవంతం చేసినట్లు కేంద్రం కోర్టుకు వివరించింది. అయితే కొన్ని అంశాలపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని తెలిపింది. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చే వరకు విమాన ఛార్జీల విషయంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యాలయ మెమోలను మార్గదర్శకాలుగా ఉపయోగిస్తోందని పేర్కొంది.
ఎయిర్‌లైన్స్‌పై చర్యలు
ప్రస్తుతానికి కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను కొన్ని విమానయాన సంస్థలు పాటించడం లేదని పిటిషనర్లు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కోర్టు.. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించే ఎయిర్‌లైన్స్‌పై కఠినంగా వ్యవహరించాలని సూచించింది. నిబంధనలు పాటించని విమానయాన సంస్థలను గ్రౌండ్ చేయాలని కేంద్రానికి స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 7న చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.
విమాన ప్రయాణికులపై ప్రభావం చూపుతున్న పలు అంశాలను కొత్త నిబంధనల్లో చేర్చినట్లు కేంద్రం తెలిపింది. ముఖ్యంగా విమాన టికెట్ ఛార్జీల నియంత్రణ, సర్జ్ ప్రైసింగ్, అదనపు లగేజీ ఛార్జీలు, ఛార్జీల పారదర్శకత వంటి అంశాలపై నిబంధనలు ఉండనున్నాయి. విమాన టికెట్ ధరల్లో తరచూ చోటుచేసుకుంటున్న భారీ మార్పులు, ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్న అదనపు ఛార్జీలను నియంత్రించాలంటూ దాఖలైన పిటిషన్ నేపథ్యంలో ఈ విచారణ జరుగుతోంది.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం జూలైలోనే ప్రతిపాదిత విమానయాన నిబంధనలను సీల్డ్ కవర్‌లో సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. అప్పట్లో నిబంధనలు రూపొందించామని, వాటిని పార్లమెంట్ ముందుకు తీసుకెళ్లే ముందు చట్టపరమైన ప్రక్రియ కొనసాగుతోందని కేంద్రం తెలిపింది. అయితే నిబంధనలను రెండు వారాల్లోగా కోర్టుకు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది.
సామాజిక కార్యకర్త ఎస్. లక్ష్మీనారాయణన్ దాఖలు చేసిన పిటిషన్‌లో విమాన టికెట్ ధరలపై స్పష్టమైన, తప్పనిసరి నిబంధనలు తీసుకురావాలని కోరారు. సర్జ్ ప్రైసింగ్, లగేజీ ఛార్జీలు, టికెట్ రద్దు, రీఫండ్ నిబంధనలపైనా నియంత్రణ అవసరమని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రయాణికుల ప్రయోజనాలను పరిరక్షించే అధికారాలతో స్వతంత్ర విమానయాన నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలని కూడా కోరారు.
గతంలోనూ ఆందోళన
విమాన టికెట్ ధరల్లో ఆకస్మిక మార్పులపై సుప్రీంకోర్టు గతంలోనూ ఆందోళన వ్యక్తం చేసింది. పండుగలు, అధిక డిమాండ్ ఉన్న సమయాల్లో విమాన టికెట్ల ధరలు భారీగా పెరగడాన్ని కోర్టు “తీవ్రమైన ఆందోళన కలిగించే అంశం”గా పేర్కొంది. జనవరిలో జరిగిన విచారణ సందర్భంగా కుంభమేళా, ఇతర పండుగల సమయంలో విమాన టికెట్ ధరలు భారీగా పెరిగిన విషయాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. మార్చిలో విమానయాన రంగంలో ఏర్పడిన అంతరాయాలు, పశ్చిమాసియా సంక్షోభం కారణంగా పెరిగిన ఇంధన ధరలను ప్రస్తావిస్తూ.. ఈ పిటిషన్‌పై స్పందించేందుకు కేంద్రం అదనపు సమయం కోరింది.
ఇదిలా ఉండగా.. ఇండిగో విమానాల రద్దు కారణంగా దేశీయ విమాన సర్వీసుల సామర్థ్యం తగ్గి, కొన్ని మార్గాల్లో టికెట్ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గత డిసెంబర్‌లో దేశీయ విమాన ఛార్జీలపై తాత్కాలిక పరిమితులు విధించింది. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాయని కేంద్రం ప్రకటించిన తర్వాత మార్చిలో ఆ పరిమితులను తొలగించింది. అయితే విమానయాన సంస్థలు ఛార్జీలను సహేతుకంగా, పారదర్శకంగా ఉంచాలని, ప్రయాణికుల ప్రయోజనాలకు భంగం కలగకుండా చూడాలని ఆదేశించింది. ఆ తాత్కాలిక విధానం ప్రకారం.. 500 కిలోమీటర్ల వరకు ప్రయాణానికి వన్-వే టికెట్ ధరను రూ.7,500కు, 1,000 నుంచి 1,500 కిలోమీటర్ల మధ్య ప్రయాణాలకు, ఢిల్లీ-ముంబై వంటి మార్గాల్లో రూ.15,000కు పరిమితం చేశారు.
కొత్త చట్టం
భారతీయ వాయుయాన్ అధినియమ్, 2024 ద్వారా పౌర విమానయానం, విమాన రవాణా సేవల ఆర్థిక నియంత్రణకు కేంద్రానికి అధికారాలు లభించాయి. విమానయాన సంస్థల టారిఫ్‌లను ఆమోదించడం, తిరస్కరించడం లేదా సవరించేందుకు సంబంధించిన నిబంధనలను రూపొందించే అధికారం కూడా కేంద్రానికి ఈ చట్టం కల్పిస్తోంది. టారిఫ్ పరిధిలో ప్రయాణికుల విమాన ఛార్జీలు, ఇతర రుసుములతో పాటు వాటిని ప్రభావితం చేసే విధానాలు, సేవలు కూడా ఉంటాయి. దీంతో కేంద్రం ప్రతిపాదించిన కొత్త విమాన ఛార్జీల నిబంధనలపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. సెప్టెంబర్ 7న జరిగే తదుపరి విచారణలో సుప్రీంకోర్టు ఈ నిబంధనలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.