Reading Time: 2 minutes

మొబైల్స్ మరింత కాస్ట్ లీ.. ధరలు పెంచిన యాపిల్, వివో, ఐకూ.. మిగతా కంపెనీలూ పెంచే చాన్స్

Caption of Image.
  • పోకో, రెడ్​మీ, వన్​ప్లస్ కూడా
  •  గరిష్టంగా రూ.8 వేల వరకు పెంపు
  •  చిప్స్​ ధరల పెరుగుదలే కారణం
  •  మిగతా కంపెనీలూ పెంచే చాన్స్​

న్యూఢిల్లీ: స్మార్ట్​ఫోన్​ కంపెనీలు ధరల పెంపు బాట పట్టాయి.  గత మూడు రోజులుగా రేట్లను మార్చుతూ కస్టమర్లకు షాకిస్తున్నాయి.  పోకో తన పాపులర్​ మోడల్స్​ ఎక్స్ 8 ప్రో , ఎక్స్ 8 ప్రో మాక్స్ ధరలను  రూ.మూడు వేల వరకు పెంచింది.  దీంతో పోకో ఎక్స్ 8 ప్రో కనీస ధర రూ.40 వేలకి చేరుకుంది.  ఐకూ, షావోమి, రెడ్​మీ, వన్​ప్లస్, యాపిల్, వివో కూడా తమ ప్రొడక్టుల  ధరలను రూ.రెండు వేల నుంచి రూ.ఐదు వేల వరకు పెంచేశాయి.  ఐకూ 15 ధర ఏకంగా రూ.ఎనిమిది వేలు పెరిగింది. వై సిరీస్​ ఫోన్ల ధరలను వివో రూ.నాలుగు వేల దాకా పెంచింది. 

యాపిల్ ఫోన్ల ధరలు సుమారు రూ.రెండు వేల నుంచి రూ.ఐదు వేల వరకు పెరిగాయి. బడ్జెట్ ఫోన్లు మొదలుకొని ప్రీమియం ఫ్లాగ్‌‌షిప్ మోడళ్ల వరకు..అన్నింటి ధరలూ పెరిగాయి.   గతంలో తక్కువ ధరలకు లభించిన ఫీచర్ల కోసం ఇప్పుడు భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది. బడ్జెట్ ​సరిపోకపోతే తక్కువ స్పెసిఫికేషన్లు ఉన్న వేరియంట్లను ఎంచుకోక తప్పడం లేదు. 

చిప్స్​ కొరతతో ఇబ్బందులు

అకస్మాత్తుగా ధరలు పెరగడానికి ప్రధాన కారణం ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ మెమరీ చిప్‌‌ల కొరత ఏర్పడటమే! ఏఐ టెక్నాలజీ విస్తరిస్తున్న కొద్దీ ఏఐ డేటా సెంటర్ల నుంచి ర్యామ్, నాండ్ మెమరీ చిప్​లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. దీనివల్ల ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీ ఖర్చులు 90 శాతానికి పైగా ఎగబాకాయి. డిమాండ్​కు తగ్గట్టుగా సరఫరా ఉండటం లేదు. మొబైల్స్​ ఫోన్ల తయారీలో మెమరీ చిప్స్ అత్యంత కీలకమైన భాగం. వీటి ధరలు పెరగడంతో, ఆ భారాన్ని తట్టుకోలేక కంపెనీలు రిటైల్ ధరలను పెంచుతున్నాయి. 

సాధారణ ద్రవ్యోల్బణం కంటే ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ల కొరత ఈ సంక్షోభానికి అసలు కారణమని మార్కెట్ నిపుణులు అంటున్నారు.  ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే శామ్​సంగ్, రియల్​మీ వంటి మిగతా కంపెనీలు కూడా రాబోయే వారాల్లో తమ ఫోన్ల ధరలను మార్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్‌‌లో మెమరీ చిప్​ల కొరత సమస్య సమీప భవిష్యత్​లో తగ్గే సూచనలు కనిపించడం లేదు. రాబోయే పండుగ సీజన్​లో కూడా ఈ ధరల పెరుగుదల కొనసాగవచ్చని నిపుణులు అంటున్నారు.

©️ VIL Media Pvt Ltd.