Reading Time: 2 minutes

అందరం కలిసి కత్తులు తిప్పుదాం: జడ్డూని టీజ్ చేసిన పంత్, సర్ఫరాజ్.. స్టంప్ మైక్ కామెంట్స్ వైరల్‌!

Caption of Image.

IND vs SL: శ్రీలంకతో గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆటలో భారత బౌలర్లు పూర్తి ఆధిపత్యం చెలాయించారు. లంక బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బతీస్తూ లంచ్ విరామానికి ఆతిథ్య జట్టును 99/5తో తీవ్ర కష్టాల్లోకి నెట్టారు. మ్యాచ్ ఎంత ఉత్కంఠగా సాగుతున్నప్పటికీ, మైదానంలో రవీంద్ర జడేజాతో రిషభ్ పంత్, సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ సర్ఫరాజ్ ఖాన్ చేసిన సరదా సంభాషణ అభిమానులను విపరీతంగా అలరించింది. లంక వికెట్లు వరుసగా పడుతున్న సమయంలో జడేజాను పంత్, సర్ఫరాజ్ ఆటపట్టించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. 

నవ్వులు పూయించిన స్టంప్ మైక్ ఆడియో: 

భారత యువ బౌలర్లు వికెట్లను తీసుకుంటుండగా, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తన బౌలింగ్ స్పెల్ కోసం ఎదురుచూస్తూ నిలబడ్డాడు. ఇది గమనించిన సర్ఫరాజ్ ఖాన్ జడేజా దగ్గరకు వెళ్లి, ఇది చాలా పెద్ద మ్యాచ్, వికెట్లన్నీ ఒకరే తీసేయకుండా అందరం పంచుకుని తిందాం (లంబా గేమ్‌ హై జడ్డూ భాయ్.. మిల్ బాట్ కే ఖాయేంగే) అని హిందీలో సరదాగా సర్ఫరాజ్ అన్న ఈ మాటలు స్టంప్ మైక్‌లో స్పష్టంగా రికార్డ్ కావడంతో నెటిజన్లకి నవ్వులు తెప్పిస్తున్నాయి. 

అందరం కలిసి కత్తులు తిప్పుదాం: పంత్ 

సర్ఫరాజ్ చమత్కారానికి టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ కూడా తనదైన శైలిలో కామెంట్స్ చేశాడు. రికార్డులు బ్రేక్ చేసినప్పుడు, మ్యాచ్ ని గెలిపించినప్పుడు జడేజా తనదైన స్టైల్ లో చేసే కత్తి తిప్పే సెలబ్రేషన్‌ను గుర్తుచేస్తూ, అందరం కలిసి వికెట్లు తీసి కత్తి తిప్పుదాం (ఔర్ సబ్ తల్వార్ చలాయేంగే) అంటూ పంత్ చేసిన ఈ కామెంట్ మైదానంలో నవ్వుల పువ్వులు పూయించింది. జడేజా సిగ్నేచర్ సెలబ్రేషన్‌ను మిగిలిన బౌలర్లకు ఆపాదిస్తూ రిషభ్ అన్న ఈ డైలాగ్ మ్యాచ్‌కే ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

భారత ఆటగాళ్ల బాండింగ్‌పై ప్రశంసలు: 

గాలే టెస్టులో స్పిన్ ఫ్రెండ్లీ పిచ్‌పై భారత బౌలర్లు మ్యాచ్‌ను తమ గుప్పిట్లోకి తెచ్చుకుంటున్న తరుణంలో, ఈ సరదా సంభాషణ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించింది. టెస్టు మ్యాచ్ లాంటి తీవ్రమైన ఒత్తిడి ఉండే సమయంలో కూడా ప్లేయర్స్ ఎంతో ప్రశాంతంగా ఉంటారో ఈ ఘటన నిరూపించింది. టీమిండియా ప్లేయర్స్ మధ్య ఉన్న బాండింగ్, డ్రెస్సింగ్ రూమ్ వాతావరణానికి ఇది అద్దం పడుతోందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ స్టంప్ మైక్ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. 

 

©️ VIL Media Pvt Ltd.