Reading Time: 2 minutes

ఒకప్పుడు మన తాతముత్తాతలు జొన్న రొట్టెలు తిని ఎంతో బలంగా, వృద్ధాప్యంలో కూడా బిపి, షుగర్, కీళ్ల నొప్పులు లేక ఆరోగ్యంగా ఉండేవారు. కానీ ఈ రోజుల్లో తెల్ల అన్నం, జంక్ ఫుడ్ వల్ల చిన్న వయసులోనే రోగాల బారిన పడుతున్నాం. రోజువారీ ఆహారంలో జొన్న రొట్టెను భాగం చేసుకుంటే మన శరీరంలో ఎన్నో అద్భుతమైన మార్పులు వస్తాయి. జొన్న రొట్టెతో లభించే ఆ ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

జీర్ణక్రియ మెరుగుపడుతుంది: జొన్నల్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది పేగుల కదలికలను మెరుగుపరిచి మలబద్ధకం, అజీర్తి సమస్యలను తగ్గిస్తుంది. ఇక ఆహారం సులభంగా జీర్ణమై, అందులోని పోషకాలను శరీరం సరిగ్గా పీల్చుకోవడానికి సహాయపడుతుంది.

షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది: డయాబెటిస్ ఉన్నవారికి జొన్న రొట్టె బెస్ట్ ఫుడ్. దీని గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉండటం వల్ల తిన్న వెంటనే బ్లడ్ షుగర్ లెవల్స్ పెరగవు. ఇక రోజూ జొన్న రొట్టె తినడం వల్ల రక్తంలో షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

Eating Jowar Roti Every Night: How It May Affect Your Health
Eating Jowar Roti Every Night: How It May Affect Your Health

సులభంగా బరువు తగ్గొచ్చు: జొన్న రొట్టె తింటే ఎక్కువ సేపు కడుపు నిండిన భావన ఉంటుంది. దీనివల్ల పదే పదే ఆకలి వేయదు. ఇక ఇందులో ఉండే బి విటమిన్లు మెటబాలిజాన్ని పెంచి కొవ్వును వేగంగా కరిగిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం.

ఎముకలు, కండరాలు దృఢంగా మారతాయి: జొన్నల్లో క్యాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, మెగ్నిషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా మార్చి కండరాల నొప్పులను తగ్గిస్తాయి. రక్తహీనతతో బాధపడేవారికి ఐరన్ అందించి, నీరసం రాకుండా శక్తినిస్తాయి.

జొన్న రొట్టె ఎలా తినాలి?: జొన్న పిండిలో కొద్దిగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, నువ్వులు, జీలకర్ర వేసి రొట్టెలు చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటాయి. రాత్రి పూట నూనె వాడకుండా లేదా కొద్దిగా నెయ్యితో కాల్చిన ఒక పెద్ద జొన్న రొట్టె తింటే శరీరానికి సరిపడా ఎనర్జీ లభిస్తుంది.

ఇక రాత్రి పూట తెల్ల అన్నం మానేసి జొన్న రొట్టెను అలవాటు చేసుకోవడం ద్వారా మన ప్రాచీన ఆరోగ్య రహస్యాన్ని మళ్లీ సొంతం చేసుకోవచ్చు. రోజూ క్రమం తప్పకుండా తింటే ఎలాంటి రోగాలు దరిచేరకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు.

గమనిక: ప్రతీ ఒక్కరి శరీర తత్వం ఒకేలా ఉండదు. మీకు తీవ్రమైన జీర్ణ సమస్యలు లేదా ఇతర ఆరోగ్య ఇబ్బందులు ఉన్నట్లయితే, ఆహారంలో పెద్ద మార్పులు చేసే ముందు డాక్టర్ లేదా న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకోవడం మంచిది.

The post రాత్రి భోజనంలో జొన్న రొట్టె.. రోజూ తింటే ఆరోగ్యంలో కనిపించే మార్పులు ఇవే! appeared first on Manalokam – Latest Telugu News & Updates.