Reading Time: < 1 minute
Sanathnagar Tims Hospital Inauguration Cm Revanth Reddy

సనత్‌నగర్‌లో నూతనంగా నిర్మించిన తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS) ఆస్పత్రిని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొనగా, వారిచే సీఎం రేవంత్ రెడ్డి రిబ్బన్ కట్ చేయించి ఆస్పత్రిని జాతికి అంకితం చేశారు. హైదరాబాద్ ప్రజలకు అత్యాధునిక, నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని సుమారు రూ. 1,126 కోట్ల భారీ వ్యయంతో ప్రభుత్వం నిర్మించింది. ప్రారంభ దశలో భాగంగా ప్రతిరోజూ సుమారు 300 మంది రోగులకు బాహ్య రోగుల సేవలను అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

సనత్‌నగర్ టిమ్స్ ఆస్పత్రిలోని ప్రధాన వసతులు..

మొత్తం బెడ్లు: 1,082 పడకలు అందుబాటులో ఉన్నాయి.

ఐసీయూ విభాగం: తీవ్ర అనారోగ్యంతో బాధపడే వారి కోసం 300 ఐసీయూ బెడ్లు కేటాయించారు.

ఆపరేషన్ థియేటర్లు: అత్యవసర , సంక్లిష్ట శస్త్రచికిత్సల కోసం 31 మేజర్ ఆపరేషన్ థియేటర్లను సిద్ధం చేశారు.

వైద్యరంగంలో సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతూ, దేశంలోనే తొలిసారిగా ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో ‘ఏఐ న్యూమాటిక్ ట్యూబ్ సిస్టమ్’ను ప్రవేశపెట్టడం ఈ ఆస్పత్రి ప్రత్యేకత. ఈ సాంకేతికత ద్వారా రోగుల రక్త నమూనాలు, నివేదికలు, అత్యవసర మందులను ఆస్పత్రిలోని ఒక విభాగం నుంచి మరొక విభాగానికి క్షణాల వ్యవధిలో వేగంగా సరఫరా చేయడానికి వీలవుతుంది. నగరంలోని వివిధ ప్రాంతాల ప్రజలకు, ముఖ్యంగా కార్మిక, మధ్యతరగతి వర్గాలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించడంలో సనత్‌నగర్ టిమ్స్ కీలక పాత్ర పోషించనుంది.